తెలుగునాట పానుగంటి లక్ష్మీనరసింహరావు పేరు వినని వారుండరు. సాహిత్యానికి సంబంధించి ఏ విభాగానికి చెందిన రచయితలకైనా ఆయన ఒక విధంగా మార్గదర్శి. 1865లో పుట్టి 1940లో కన్నుమూసిన పానుగంటి తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకూ చిరస్మరణీయుడు. ఆయనతో మాట్లాడితే చాలు ఒక విజ్ఞాన సర్వస్వాన్ని ఆకళింపు చేసుకున్నట్టుగా అప్పట్లో రచయితలు, కవులు భావించేవారు. ఆయనతో ఒక గంటసేపు మాట్లాడితే చాలు ఒక గ్రంథాన్ని రాయవచ్చనో, ఒక పరిశోధన గ్రంథాన్ని వెలయించవచ్చనో సాహితీవేత్తలు ఆశపడేవారు. తెలుగు, సంస్కృత భాషలను ఆపోశన పట్టిన అరుదైన సాహితీ వేత్త ఆయన. తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆయన దగ్గర పాఠాలు చెప్పించుకున్న తర్వాతే తమ తరగతులకు వెళ్లేవారు. ఉపాధ్యాయుడుగా కూడా పనిచేసిన పానుగంటి లక్ష్మీనరసింహారావుకు ఏది ఎలా బోధించాలో బాగా తెలుసు.
రాజమహేంద్రవరంలోని సీతానగరంలో జన్మించిన పానుగంటి గుర్తుకు వస్తే వెంటనే ఆయన రాసిన ‘సాక్షి’ ఉపన్యాసాలు గుర్తుకు వస్తాయి. సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యలపై ఆయన చేసిన ప్రసంగాలు ఇప్పటికీ ఎప్పటికీ వర్తించేవిగా ఉంటాయి. జంఘాల శాస్త్రి పేరుతో ఆయన చేసిన ప్రసంగాలు అప్పట్లో పరిశోధనాంశాలుగా కూడా ప్రసిద్ధి పొందాయి. 1913 నుంచి 1933 వరకూ ఆయన చేసిన ప్రసంగాలు తెలుగునాట ఎంతో జనాదరణ పొందడమే కాకుండా ఎన్నో ప్రచురణలకు నోచుకున్నాయి. విచిత్రమేమిటంటే, ఆయన ఏది రాసినా పరిశోధనా గ్రంథమే అయ్యేది. పరిశోధకులకు ఉపయోగపడేది. ఆయన సాక్షి ప్రసంగాలు అటు రాజకీయ రంగాన్నే కాక, ఇటు సాహితీ ప్రపంచాన్ని, సామాజిక వేత్తలను కూడా ప్రభావితం చేశాయంటే అందులో అతిశయోక్తేమీ లేదు.
శ్రీవిష్ణునామ మాల స్తోత్రం, నర్మదా పురుకుత్సీయం, సారంగధర, రాధాకృష్ణ, ప్రచండ చాణక్యం, పాదుకా పట్టాభిషేకం, కోకిల, విజయరాఘవం, వనవాస రాఘవము, వైజయంతీ విలాసము లేదా విప్రనారాయణ చరిత్ర, బుద్ధ బోధ సుధ, వృద్ధ వివాహము, మనోమహిమ, కల్యాణ రాఘవము, కంఠాభరణము తదితర రచనలన్నీ వేటికవే సాటి. ఎంతో పరిశోధన చేసి గ్రంథపరచిన రచనలివి. ఇందులో ఆయన 1904లో రాసిన ‘రాధాకృష్ణ’ గౌడీయ వైష్ణవాన్ని ఆధారం చేసుకుని చేసిన రచన. అశుతోష్ ముఖర్జీ రాసిన ‘లార్డ్ గౌరంగ్’ అనే గ్రంథాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ నాటకాన్ని రాయడం జరిగింది. కృష్ణుని పట్ల రాధకున్న భక్తి క్రమక్రమంగా ఒక మహానుభూతిగా మారిన క్రమాన్ని నాటకపరంగా అద్భుతంగా మలచడం ఈ నాటకాంశం. వైష్ణవ పండితులు కూడా కృష్ణుని పట్ల రాధ మనసులో ఉన్న భక్తిని ఇంతగా వర్ణించలేకపోయారు. రాధ భక్తిని ఒక ఉదాత్త స్థాయికి, ఉత్తమోత్తమ స్థాయికి తీసుకు వెళ్లి ఆమెకు గోలోకంలో అంటే స్వర్గలోకంలో ఒక శాశ్వత స్థానాన్ని కల్పించడం జరిగింది. ఈ క్రమానుగత పరిణామానికి నారద మహామునిని ప్రయోక్తగా ఉపయోగించు కోవడం పానుగంటికే చెల్లింది.
తెలుగు, సంస్కృత భాషల్లో పాండిత్యాన్ని సంపాదించుకున్న తర్వాత ఆయన పెద్దాపురంలోని ఒక హైస్కూలులో టీచర్ గా పనిచేశారు. కొంత కాలం అక్కడ పనిచేసిన తర్వాత ఆయన పిఠాపురం వెళ్లిపోయారు. అక్కడ పిఠాపురం మహారాజా వద్ద ఆస్థాన కవిగా చేరి, జీవితాంతం అక్కడే కొనసాగారు. తెలుగు సాహిత్యంలో వ్యాసాలకు ప్రాధాన్యం కల్పించిన వ్యక్తి పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఆయనకు ‘ఆంధ్రా షేక్ స్పియర్’, ‘ఆంధ్రా ఎడిసన్’ అనే బిరుదులతో పాటు ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు కూడా ఉండేది. అప్పట్లో ముగ్గురు ప్రసిద్ధి చెందిన సాహితీవేత్తలు ఉండేవారు. వారు చిలకమర్తి లక్ష్మీనరసింహం, కూచి నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహారావు. వారిని ‘సింహత్రయం’గా అభివర్ణించేవారు.
Savyasachi in Telulgu Literature: సాహితీ లోకంలో అపర సవ్యసాచి
ఆయన ప్రసంగాలు పరిశోధనాంశాలుగా ప్రసిద్ధి