‘దీపావళి’ ‘దీపం జ్యోతి పరం బ్రహ్మా
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే’ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగాను, సమస్తమైన చీకట్లను పారద్రోలేదిగాను చెప్పారు మన ఋషులు. అంతేకాదు దీపం వల్లనే సర్వమూ సాధ్యమౌతుందని చెప్పారు. అంటే దీపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం ఉంటే సృష్టిలో సాధించరానిది ఏదీలేదు. అటువంటి దీపానికి నమస్కారం అని అంటున్నారు. తొలుత దీపారాధన చేసిన తరువాతనే ఏ పూజనైనా ప్రారంభించడం హిందూ సంప్రదాయం. అంతేకాదు రోజులో సగభాగం రాత్రి. ఐతే ఆ రాత్రిలో వస్తుసముదాయం కనిపించడానికి దీపం అత్యంత ఆవశ్యకం. దీపం లేనిదే ఏ చిన్నపనీ సాధ్యం కాదు. మన ఇంట్లో కూడా మనం అడుగు ముందుకు వెయ్యలేం. దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఇది. అలాంటి దీపం ప్రధానంగా హిందువులకు ‘దీపావళి’ అనే పేరుతో ఒక ప్రముఖమైన పండుగే ఉంది. శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై యుద్ధం చేసి నరకాసురుడి చీకటి రాజ్యాన్ని కూల్చివేసిన విజయోత్సవ సందర్భమే దీపావళి. దీపావళి శీర్షికతో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ అభ్యుదయ కవి సీరపాణి ఒక కవిత రాశారు. ఇది అతని ‘డమరుధ్వని’ కవితా సంపుటి లోనిది.
సాధారణంగా వినాయక చవితి, ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి మనకు ఏడాదిలో వచ్చే ముఖ్యమైన పండుగలు. సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా? అని మనం ఎదురు చూస్తాం. అది పంటల పండుగ. అందులో మన పితృదేవతలకు కూడా భాగస్వామ్యం ఉంది. వారిని పూజిస్తాం. వినాయక చవితికి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. దసరా మనకు విజయ చిహ్నమైన శక్తి పూజ. ఆయుధపూజ అని కూడా అంటాం. ఉగాది నూతన సంవత్సరాది. ఆనందంతో ఆహ్వానిస్తాం. కాకుంటే ఒక్కోసారి గత సంవత్సరంలోని కష్టనష్టాలు పునరావృతం కాకూడదని నిరసిస్తూ నూతన సంవత్సరం అన్ని విధాల శుభప్రదం కావాలని ఆశిస్తాం. సాధారణంగా దీపావళిని ఉల్లాసంగా, నిర్ద్వంద్వంగా ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ దీపావళిని కష్టాలు కడగండ్లమయంగా భావించి సాదరంగా స్వాగతించలేకపోతున్నానంటున్నాడు కవి. ‘ఎవరన్నారు?
దీపావళి వచ్చిందని,
దీధితులను తెచ్చిందని!’ దీధితులు అంటే కాంతి కిరణాలు. దీపావళి వచ్చిందా? దీధితులను తెచ్చిందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు కవి. కారణం ఏమై ఉంటుంది? ‘ఊరికొక్క కాకాసురుడు
ఉచ్చులల్లుతున్నప్పుడు
మండలానికో మహానాయకుడు
అఖండ దీపాలార్పుతున్నప్పుడు
నరనరాన నరకాసురుడు
నాట్యం చేస్తున్నప్పుడు’ అసుర సంహారమే దీపావళి ఆంతర్యం. కొందరు సోమరిపోతులు పనిలేకున్నా రాజకీయ నాయకుల వద్ద చేరి వారి ముఖప్రీతికై ఇతరులపై ఏవేవో చాడీలు చెబుతూ వారి ప్రాపకం సంపాదిస్తుంటారు. అంతేకాక వారిని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ‘కాకా’ పడుతుంటారు. అలాంటి వారిని కవి కాకాసురులు అంటున్నాడు. వీరి వల్లనే గ్రామాల్లో ఎక్కువగా తగాదాలు ఏర్పడి అశాంతి నెలకొంటుంది. అంతేకాదు మండలానికి ఒక్కో నాయకుడు తయారై జిల్లా ఔన్నత్యాన్ని పాడుచేస్తుంటాడు. మండలం అనే పదం గతంలో జిల్లాకే పరిమితం. ఇక నరకాసురుడు నరనరాన నాట్యం చేస్తున్నాడంటే కొందరు దుండగులు జ్ఞానవంతుల్ని అణగద్రొక్కి, దుష్టశక్తుల్ని ప్రేరేపిస్తుంటారని భావం. ఆనాడు నరకాసురుడు ఒక్కడే ఐతే, ఈనాడు నరనరానా ఉన్నాడని అర్థం. అంటే అది సత్యదూరం కాదన్నమాట. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో దీపావళి జాడ ఏది? అంతేకాదు- ‘పెద్దమ్మలు ఇంటింటా
పీఠం వేస్తున్నప్పుడు
పొయ్యిలో పిల్లులు
మఠం వేస్తున్నప్పుడు’ పై వాక్యాలు దీపావళి రోజుల్లో ఒకానొక కాలంలో సర్వే సర్వత్రా కరువు తాండవించేది అనడానికి నిదర్శనాలు. ఈ పండుగ ప్రతియేటా నవంబరు నెలలో వస్తుంది. ముఖ్యంగా రైతాంగం ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా, ఆ కాలానికి మాత్రం తిండిగింజల కొరత ఏర్పడుతూ ఉంటుంది. మరో రెండు నెలలకు గాని పంట చేతికి రాదు. పెద్దమ్మ అంటే జ్యేష్టాదేవి. దరిద్రదేవతన్నమాట. ప్రతి ఇంట్లోనూ కొలువై ఉంటుంది. పొయ్యిలో పిల్లులు మఠం వెయ్యడం అంటే పస్తులు పడడం అని అర్థం. ఇలాంటి కరువు రోజుల్లో బయటకు చెప్పుకోలేని దారిద్ర్యంతో ముఖ్యంగా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంటుంది. రైతును నమ్ముకున్న ఇతర చేతివృత్తుల కుటుంబాలు కూడా ఆకలికేకలతో విలవిలలాడిపోతాయి. ఆ విషయాన్నే కవి దయనీయంగా వక్కాణిస్తున్నాడు. ‘కలకంఠి కన్నీటి ముత్యాలు
కొంగున ముడి వేస్తున్నప్పుడు
గుండెల గూళ్ళలోని
కోర్కెల దీపాలు కొండెక్కుతున్నప్పుడు
ఎవరన్నారు?
దీపావళి వచ్చిందని!’ ఇంటి ఇల్లాలు కుటుంబ దారిద్ర్యానికి కన్నీటి పర్యంతం అవుతుంది. ఆ విషయాన్నే కవి కన్నీటి ముత్యాలు కొంగున ముడివేయడం అని కరుణరసాత్మకంగా వర్ణిస్తున్నాడు. ప్రతి ఎదలోనూ ఆశాదీపాలు ఆరిపోతున్నాయి. ఇలాంటి విషాద పరిస్థితుల్లో దీపావళి ఎక్కడ వచ్చినట్లు? అని కవి నిట్టూర్చుతున్నాడు. ‘కంటిలోని దీపాలను అశ్రులు ముంచేస్తుంటే,
ఎద లోపలి దీపాలను వ్యధలే మింగేస్తుంటే,
తల లోపలి దీపాలను తాపమె త్రాగేస్తుంటే,
కల లోపలి దీపాలను కలతలు కబళిస్తుంటే,
ఎవరన్నారు?
దీపావళి వచ్చిందని!
దీధితులను తెచ్చిందని!’ చూపుల దీపాలను కన్నీళ్లు ముంచేస్తున్నాయి. మనసులోని దీపాలను మనోవ్యధలే మింగేస్తున్నాయి. తల లోపల ఉన్న దీపాలను తీవ్ర మనస్తాపమే త్రాగేస్తోంది. కనీసం కమ్మని కలలోనైనా ఉపశమనం పొందుదామంటే కలతలు వాటిని కూడా కబళిస్తున్నాయట. ఇటువంటి సంక్షుభిత జీవన పరిస్థితుల్లో దీపావళి వచ్చిందని ఎవరంటున్నారు? అని కవి నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడైతే కొంత ఉపశమనం కలుగుతుందేమో! కాని ఒక అర్థ శతాబ్దం కిందటి పరిస్థితులకు మాత్రం ఈ కవిత అద్దం పడుతోందనడంలో సందేహం లేదు. అక్టోబర్ 1971లో ఈ కవిత రచింపబడింది. ఇది నవంబర్ 17వ తేదీ 1972 లో ‘ప్రగతి’ మాసపత్రికలో ప్రచురించబడింది.
పిల్లా తిరుపతిరావు…7095184846