Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్Semifinals: ఎన్నికల విజయాలు, సరికొత్త గుణపాఠాలు

Semifinals: ఎన్నికల విజయాలు, సరికొత్త గుణపాఠాలు

ఇండియా కూటమి గెలవడం అనేది సుదూర స్వప్నమే

అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా సంస్థలు సెమీ ఫైనల్స్ గా అభివర్ణించిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు స్పష్టమైన ఫలితాలను వెలువరించాయి. దేశ భవిష్యత్తు, ముఖ్యంగా 2024లో జరగ బోయే లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతోన్నాయన్నది చెప్పకనే చెప్పాయి. భారతీయ జనతా పార్టీ మూడు
రాష్ట్రాల్లో విజయ దుందుభి మోగించడం లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో ముఖాముఖీ పోటీ జరిగినప్పటికీ, ఆ పార్టీ మీద ఘన విజయం సాధించడం నిజంగా ఒక పెద్ద విశేషంగానే కనిపిస్తోంది. ఈ ఫలితాలను బట్టి
అర్థమవుతున్నదేమిటంటే, హిందీ రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యథాతథ స్థితిలో విజయాలు సాధించే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాక, ఇండియా కూటమి గెలవడం అనేది సుదూర స్వప్నమే. అది ఒక కూటమిగా ఎక్కడా పోటీ చేసే అవకాశం లేదని అర్థమైపోయింది. బీజేపీ మధ్యప్రదేశ్ ను కాపాడుకోవడంతో పాటు, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కూడా తమ ఖాతాలో వేసుకోవడాన్ని ప్రస్తుత కీలక పరిస్థితుల్లో ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు.

- Advertisement -


తెలంగాణలో ఘన విజయం సాధించడం, బీజేపీని మూడవ స్థానంలోకి నెట్టడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటే అని చెప్పవచ్చు. మొత్తానికి లోక్ సభ ఎన్నికలు హిందీ రాష్ట్రాలకు సంబంధించినంతవరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ముఖాముఖీగా జరగబోతున్నాయి తప్ప, ఇవి బీజేపీకి, ఇండియా కూటమికి మధ్య జరగబోవడం లేదనేది ఈ ఎన్నికలతో నిర్ధారణ అయిపోయింది. నిజానికి అయిదేళ్ల క్రితం ఈ మూడు హిందీ రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే, పార్టీ ఫిరాయింపుల కారణంగా మధ్యప్రదేశ్ ను మధ్యలోనే పోగొట్టుకుంది. ఏది ఏమైనా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడం మాత్రం చెప్పుకోదగ్గ విశేషం.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తామే సాధించామని చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితి పార్టీ చివరికి అతి
దారుణంగా భంగపడడం విస్మరించరాని విషయం. ఈ రాష్ట్రంలో విజయం సాధించడం అన్నది ఒక ఘన కార్యమే కానీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోవడమ న్నది మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏటికి ఎదురీదడమే అవుతుంది. బీజేపీ హిందీ రాష్ట్రాలలోనే కాక, పశ్చిమ రాష్ట్రాలలోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ, ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలోనూ పట్టు సాధించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పోటీ పడగలుగుతుందా అన్నది అంతుబట్టని విషయంగా కనిపిస్తోంది. తెలంగాణలో కూడా బీజేపీ తన స్థానాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకోగలిగింది.

తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి చిత్తుగా ఓడడమన్నది ఆషామాషీగా తీసుకోవాల్సిన వ్యవహారం కాదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత వల్లే కేసీఆర్ నాయకత్వంలోని బి.ఆర్.ఎస్ కు శృంగభంగం జరగలేదు. కుటుంబ పాలన, విపరీతమైన అవినీతి, అంతకు మించి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అహంకారపూరిత ప్రేలాపనలు, తామే తెలంగాణ, తెలంగాణే తాము అన్న వైఖరి ఆ పార్టీ పుట్టి ముంచాయి. ఈ పార్టీకి ఎక్కడా, ఏ విషయంలోనూ ఓ సిద్ధాంతమంటూ లేకపోవడం కూడా ఇందుకు చాలావరకు తోడయింది. ఇక ఎన్నికల ప్రచారమనేది నరేంద్ర మోదీ చుట్టూనే తిరిగింది. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింహ్ చౌహాన్ తో సహా ప్రాంతీయ నాయకులందరూ రెండవ వరుసలోనే ఉండడం జరిగింది. నిజానికి ఇది ఎంతో సాహసంతో కూడిన వ్యూహం.

గత మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు ప్రాంతీయ నాయకులను విస్మరించినందువల్లే ఈ పార్టీ పరాజయం పాలయిందనే అభిప్రాయం ఉన్నప్పటికీ బీజేపీ తన పంథాకు కట్టుబడి ఉండడం, కేవలం నరేంద్ర మోదీకే ప్రాధాన్యం ఇవ్వడం గమనించాల్సిన విషయం. ఏతావతా, రాజస్తాన్ లో 199 సీట్లకు గాను 115 సీట్లను, మధ్యప్రదేశ్ లో 230 సీట్లకు గాను 164 సీట్లను, చత్తీస్ గఢ్ లో 90 సీట్లకు గాను 54 సీట్లను గెలుచుకోవడం బీజేపీకి పెద్ద విజయమేనని చెప్పవచ్చు.

ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ తనకు తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించింది. ఈ ఘనతంతా మోదీకే దక్కుతుంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించినంత వరకూ బీజేపీ ఇదే వ్యూహంతో ముందుకు సాగినా ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింహ్ చౌహాన్ తో సహా రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలో రాష్ట్ర స్థాయి నాయకులెవరూ ప్రచార బాధ్యతలను తమ భుజాలకెత్తుకునే ప్రయత్నం చేయకుండా, ప్రచార బాధ్యతను పూర్తిగా కేంద్ర నాయకత్వానికి వదిలేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ గట్టి పోరాటమే సాగించారు. ఆయన కారణంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లయినా సంపాదించగలిగింది. చత్తీస్ గఢ్ లో అక్కడి ముఖ్యమంత్రి బాఘేల్ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, ఆయన ప్రభుత్వం ఆదివాసీలను దూరం చేసుకోవడం ఆయనకు తీరని పరాభవాన్ని మిగల్చింది. పార్టీలు విజయాలు సాధించాలన్నపక్షంలో సైద్ధాంతిక నిబద్ధత, సరైన అభ్యర్థుల ఎంపిక, వ్యూహాత్మక ప్రచారం, నాయకత్వం మీద నమ్మకం, అన్ని వర్గాలను కలుపుకునిపోవడం, సంస్థాగతమైన సమన్వయం వంటి అంశాలన్నీ కలిసి రావాలనేది ఈ ఎన్నికల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News