Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Sindhu water dispute: ఒప్పందంలో పెను సవాళ్లు

Sindhu water dispute: ఒప్పందంలో పెను సవాళ్లు

సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమూలంగా సమీక్షించి సవరించడానికి చర్చలు జరపాలంటూ భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. జమ్మూ, కాశ్మీర్‌లలో రెండు జల విద్యుత్కేంద్రాలను నిర్మించడానికి సంబంధించి పాకిస్థాన్‌ మొండిగా అభ్యంతరాలు చెప్పడం ఈ నోటీసు జారీకి ప్రధాన కారణం అయింది. జీలం నదిలో 330 మెగావాట్ల కిషన్‌గంగా జల విద్యుత్‌ ప్రాజెక్టు, చీనాబ్‌ నదిలో 850 మెగావాట్ల రాట్లే జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించాలని భారత ప్రభుత్వం తలపెట్టింది. నిజానికి ఈ ఆలోచన 2006 నాటిది. అయితే, పాక్‌ ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా సింధూ నదీ జలాల ఒప్పందానికి లోబడే ఉన్నాయని, ఈ నదీ జలాలను వాడుకోవడానికి తమకు హక్కు ఉందని భారత ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. వాస్తవానికి ఈ ఒప్పందానికి సంబంధించిన ఏ సమస్యనైనా చర్చించడానికి కొందరు నిపుణులతో ఒక పర్మనెంట్‌ ఇండస్‌ కమిషన్‌ను చాలా కాలం క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, జల విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాన్ని చర్చించాలని భారత ప్రభుత్వం అనేక పర్యాయాలు సూచించినా పాకిస్థాన్‌ ప్రభుత్వం ససేమిరా అంటోంది. పైగా, తరచూ దీని మీద లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తోంది.
ఫలితంగా, ప్రపంచ బ్యాంక్‌ ఈ సమస్య పరిష్కారానికి ఒక నిపుణుడిని నియమించింది. అయితే, పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈ నిపుణుడికి సహకరించడానికి నిర్మొహమాటంగా నిరాకరించింది. పైగా దీన్ని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇందుకు భారత ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మొదట ఉభయ దేశాల ప్రతినిధులు చర్చించాలని, పర్మనెంట్‌ ఇండస్‌ కమిషన్‌ చర్చలు ఏర్పాటు చేయాలని, ఈ విధంగా వివిధ దశలలో చర్చించిన తర్వాతే దీన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకు వెళ్లాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేదీ కుదరకపోవడంతో భారత ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రపంచ బ్యాంకు నిపుణుడికి సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనను కూడా పాక్‌ ప్రభుత్వం తిరస్కరించింది. చివరికి 2022 మార్చిలో ప్రపంచ బ్యాంక్‌ ఒక నిపుణుడి సహాయంతో మధ్యవర్తిత్వం నెరపడానికి మరొకసారి ముందుకు వచ్చింది. అవసరమైతే, కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ద్వారా వాదోపవాదాలు వినిపించాలని కూడా సూచించింది.
ఇందుకు మొదట ఉభయ దేశాలు అంగీకరించడంతో హేగ్‌ అంతర్జాతీయ న్యాయస్థానంలోని కోర్టు లోని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్లో వాదోపవాదాలు ప్రారంభం అయ్యాయి. అయితే, అవి ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. మధ్యలోనే ప్రతిష్ఠంభన ఏర్పడింది. దాంతో భారత ప్రభుత్వం ఈ మొత్తం ఒప్పందాన్ని పునస్సమీక్షించాలని, మళ్లీ చర్చలు జరగాలని, సవరణలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల తమ నీటి సరఫరా దెబ్బతింటుందంటూ పాక్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కానీ, అందుకు ఆధారాలను మాత్రం అందజేయడం లేదు. అందువల్ల భారత ప్రభుత్వ వాదనకే బలం చేకూరుతోంది. ఒక నిపుణుడితో మధ్యవర్తిత్వం నెరపాలని, ఆర్బిట్రేషన్‌ కోర్టులో కూడా వాదోప వాదాలు జరపాలని ప్రపంచ బ్యాంకు సూచించడం వల్ల ఈ వివాదంలో రెండు రకాల తీర్పులు వెలువ డే అవకాశం ఉంది. ఇవి పరస్పరం భిన్నమైన తీర్పులుగా మారే అవకాశం కూడా ఉంది. ఇక, ఈ మొత్తం ఒప్పందాన్ని మళ్లీ తెరవడం వల్ల భారత్‌కు కొన్ని సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల భారత్‌ నిబ్బరంగా, సంయమనంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
సుమారు పదేళ్ల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ సింధూ నదీ జలాల ఒప్పందం 1960లో కుదిరి ఆచరణలోకి వచ్చింది. ఈ ఒప్పందంతో మొత్తం ఆరు నదులకు సంబంధం ఉంది. మధ్యవత సమస్యలను, వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన పర్మనెంట్‌ ఇండస్‌ కమిషన్‌ జరిపి వల్లే ఈ నదీ జలాల పంపకం సుమారు అయిదు దశాబ్దాలుగా సజావుగా సాగుతూ వస్తోంది. ఈ ఒప్పందాన్ని అనేక దేశాలు ఆదర్శంగా, మార్గదర్శకంగా తీసుకుని నదీ జలాల వివాదాలను పరిష్కరించు కుంటున్నాయి. అంతేకాదు, భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య అనేక ఘర్షణలు, వివాదాలు, పోరాటాలు చోటుచేసుకున్నప్పటికీ, ఈ ఒప్పందం మాత్రం అన్ని రకాల అగ్నిపరీక్షలను తట్టుకుని కొనసాగగలుగుతోంది. సుమారు 16 ఏళ్లుగా ఒక్క వివాదమే పరిష్కారం కానప్పుడు పునస్సమీక్షకు ఇక ఎంతకాలం పడుతుందో ఎవరు చెప్పగలరు? ఇతర సమస్యల విషయంలో ఈ రెండు దేశాల మధ్య చర్చలకు కూడా ఆస్కారం లేకుండాపోతోంది. అనేక విధాలుగా ఉభయ దేశాల మధ్య సంబంధాలే లేవు. అందువల్ల పునఃస్సమీక్ష అనేది తప్పకుండా కొత్త సవాళ్లు సృష్టించడం ఖాయం.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News