సోషల్ మీడియాపై ఇటీవలికాలంలో దాడి ఎక్కువైంది. ప్రజలకు చేరువైన సామాజిక మాధ్యమం దుర్వినియోగమవుతోందన్న విమర్శలు ఎడాపెడా వస్తున్నాయి. సమాజంలోని అన్ని అనర్థాలకు సోషల్ మీడియానే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం వదంతులు వ్యాప్తి చేయడానికే సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారన్న దుష్ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. సోషల్ మీడియాపై వస్తున్న విమర్శల్లో వాస్తవమెంత ? సోషల్ మీడియా వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదా ? నిర్భయ ఘటనను ఉద్యమంగా మలచింది సోషల్ మీడియా కాదా ? మేధావులు, యువజనులు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
సోషల్ మీడియా అనగానే చాలామందికి ఒక నెగెటివ్ ఫీలింగ్ కలుగుతుంది. సెలబ్రిటీల ఇమేజ్ ను దెబ్బతీసే తప్పుడు వార్తలు, నెటిజన్ల ట్రోలింగ్ ఇవే కళ్లముందు కదలాడతాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపే. మరో వైపు చూస్తే సోషల్ మీడియా కు జనంలో ఆదరణ పెరుగుతోంది. సోషల్ మీడియా… సామాన్యుడి ధర్మగంటగా మారింది. సంప్రదాయ మీడియా పట్టించుకోని సమస్యలను, బాధలను, కష్టాలను, కన్నీళ్లను ఇప్పుడు సోషల్ మీడియానే పట్టించుకుంటోంది. నాయకులు బెదిరించినా, పోలీసులు వేధించినా …మీకు మేమున్నాం… అంటూ బాధితులకు అండగా నిలుస్తోంది సోషల్ మీడియానే. ఆధునిక టెక్నాలజీలో భాగంగానే సోషల్ మీడియాను చూడాలి. నిత్యజీవితంలో ప్రజలకు సోషల్ మీడియాతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. నేటి సమాజంలో సోషల్ మీడియాకు రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతోంది. మరీ ముఖ్యంగా యువత జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమైంది. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఈజీ అయిపోయింది. తక్కువ పైసలతోనే అన్ లిమిటెడ్ డేటా ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. అంతేకాదు సగటు మనిషి తనకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ ను ఆశ్రయిస్తున్నాడు. సోషల్ మీడియా లో ఏదైనా ఇష్యూ ఫోకస్ కాగానే నెటిజన్లు వెంటనే స్పందిస్తున్నారు. దీనికి అనేక ఉదాహరణలున్నాయి. 2021 సెప్టెంబరులో జరిగిన ఉమ్మడి కడప జిల్లా దువ్వూరు కు చెందిన అక్బర్ బాషా ఉదంతమే ఓ ఉదాహరణ. ఓ బడా రాజకీయ నాయకుడు తన భూమిని కబ్జాను చేయడానికి ప్రయత్నిస్తే అక్బర్ బాషా కూడా అందరిలా పోలీసులను ఆశ్రయించాడు. అయితే సదరు పోలీసు అధికారి కబ్జా రాయుడికే వంత పాడాడు. అదేమంటే ఎన్ కౌంటర్ చేసి పారేస్తానని హెచ్చరించాడట. దీంతో తనకు అన్ని దారులు మూసుకుపోయాయని అక్బర్ బాషా ఒక దశలో డిసైడ్ అయ్యాడు. ఇక చేసేదేమీ లేక దింపుడు కళ్లెం ఆశగా తన గోస చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టాడు. ఇంకేముంది…అక్బర్ బాషా వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో పేదవాడైన అక్బర్ బాషాకు న్యాయం చేయాలని ఆదేశిస్తూ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు . ఇదంతా కేవలం సోషల్ మీడియా వల్లనే సాధ్యమైంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చెయ్యలేని పనిని సోషల్ మీడియా చేసింది. బాధితుడైన అక్బర్ బాషాకు న్యాయం జరిగేలా చూసింది.
జనంలోకి చొచ్చుకెళ్లిన సోషల్ మీడియా
ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా సామాన్య ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా సామాన్య జనానికి అందుబాటులో లేకపోవడం వల్లనే సోషల్ మీడియా ఈ రేంజ్‌లో జనంలోకి చొచ్చుకుపోయింది. సహజంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కు ఒక ఫిక్స్‌డ్ ఫార్మాట్ ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీ వార్తలు, ప్రతిపక్షాల ఆరోపణలు, సిన్మా కబుర్లు, పేజ్ త్రీ విశేషాలు….మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రధానంగా ఇవే కనిపిస్తాయి . సామాన్యుడి కష్టాలను, నష్టాలను పెద్దగా పట్టించుకోవు. అవన్నీ వ్యక్తిగత విషయాలంటూ పక్కన పడేస్తుంది. ఎవరు అవునన్నా, కాదన్నా ఎన్నికలు, అధికార, ప్రతిపక్షాల వ్యూహాలు, కొత్త సినిమా విశేషాలు, క్రికెట్ కబుర్లు …వీటి చుట్టూనే మెయిన్ స్ట్రీమ్ మీడియా తిరుగుతుంది. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. సమస్యలను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే, ఎవరో ఒకరు వచ్చి తమ కన్నీళ్లను తుడుస్తారన్న ధీమా సామాన్య జనంలో కలిగింది. ఈనేపథ్యంలోనే సోషల్ మీడియాకు సమాజంలో ఆదరణ పెరిగింది. మరోవైపు ఒకప్పుడు యువత రాజకీయాలపై ఆసక్తి చూపేది కాదు. అదేదో పెద్ద వాళ్ల వ్యవహారం అన్నట్లు యువతరం ఫీలయ్యేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. యువత మైండ్‌సెట్ కూడా మారింది. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు యువత స్పందిస్తోంది. నాయకుల మాటల్లో రవ్వంత తేడా కనిపించినా సోషల్ మీడియాలో యువత దుమ్ము దులుపుతోంది. ఒకే అంశంపై రాజకీయ నాయకులు ఒకసారి ఒకలా, మరోసారి మరోలా మాట్లాడితే రెండు దృశ్యాలను చూపిస్తూ ఎడాపెడా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడు చాలా మంది రాజకీయవేత్తలు ఏదైనా మాట్లాడటానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఏం మాట్లాడితే ఎక్కడ తేడా వస్తుందో అనే భయంతో కాస్తంత కంట్రోల్లో ఉంటున్నారు. ఈ సంగతి ఎలాగున్నా సామాన్య ప్రజలకు అక్కరకొచ్చే ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో పెడితే కొన్ని నిమిషాల్లోనే స్పందన వస్తోంది. అధికార యంత్రాంగం ఉరుకులు పరుగుల మీద సదరు సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తోంది.
సోనూసూద్‌ను హీరో చేసింది సోషల్ మీడియానే
సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకునే నటుడు సోనూసూద్‌ను హీరో చేసింది సోషల్ మీడియానే. దాదాపు మూడేళ్ల కిందట కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు సోనూసూద్…..ఎందరినో ఆదుకున్నాడు. ముక్కూమోహం తెలియని వారికి స్థోమతకు మించి సాయం చేశాడు. ఎవరు ఏ ఇబ్బందితో సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా….నేనున్నానంటూ సోనూసూద్ ముందుకొచ్చాడు. సొంత డబ్బు ఖర్చు పెట్టి వలస కార్మికుల కోసం వాహనాలు పంపాడు. కార్మికులను సురక్షితంగా వారి సొంతూళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకున్నాడు. మానవత్వానికి పెద్ద పీట వేశాడు. ఈ సంఘటనలన్నిటినీ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసింది. ఉత్తరాదికి చెందిన సోనూసూద్ నెటిజన్లు నెత్తిన పెట్టుకుని ప్రేమించారు. అలాగే ఢిల్లీలో కొన్నేళ్ల కిందట జరిగిన నిర్భయ ఘటన ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే నిర్భయ ఘటన చివరకు ఒక ఉద్యమానికి దారితీసింది. నిర్భయ ఇష్యూలో దేశవ్యాప్తంగా యువత ఉవ్వెత్తున కదిలింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఇదంతా అచ్చంగా సోషల్ మీడియా పుణ్యమే. మరో ముచ్చటే లేదు.
సామాజిక ఉద్యమాలకు వేదిక …..
సామాజిక ఉద్యమాలకు సోషల్ మీడియా ఒక వేదికగా మారింది. దీంతో పాలకులు పరేషాన్ అవుతున్నారు. సుత్తిలేకుండా ప్రజలు సూటిగా అడిగే ప్రశ్నలకు బదులివ్వలేకపోతున్నారు. ఆ ఉక్రోశాన్ని సోషల్ మీడియా పై చూపెడుతున్నారు. సమాజం అన్నాక అందరూ సంస్కారవంతులు ఉండరు. దుర్మార్గులు, వెకిలి చేష్టలకు పాల్పడే వారు కూడా ఉంటారు. అమ్మాయిలకు న్యూడ్ ఫొటోలను పోస్టులుగా పెట్టే కామాంధులు కూడా ఉంటారు. తాజాగా డీప్ ఫేక్‌ల ఉదంతాలు నడుస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో ఎదుటివారి పరువును తీసి, వారి గౌరవాన్ని దెబ్బతీసే పోస్టులు పెడుతున్నమాట వాస్తవం. సోషల్ మీడియా వేదికగా జరిగే ఈ దుర్మార్గాలను, దారుణాలను ఎవరూ సమర్థించరు. సమర్థించకూడదు కూడా. అయితే వీటిని కట్టడి చేయడానికి, దోషులుగా తేలినవారికి శిక్షలు వేయడానికి చట్టాలున్నాయి. ఈ కలుపు మొక్కలను ఏరివేయాల్సిందే. అంతేకానీ, కొంతమంది చిల్లర వ్యక్తులు పెట్టే పోస్టులను సాకుగా చూపించి, మొత్తం సోషల్ మీడియానే నెగటివ్ కోణంలో చూపించే ప్రయత్నాలు సరికాదు. సోషల్ మీడియా అనే ధర్మగంట మోగుతూనే ఉండాలి. సామాన్యుడి కన్నీళ్లను సోషల్ మీడియా తుడుస్తూనే ఉండాలి. బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఇందులో మరో ముచ్చటే లేదు.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320