Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Social media derailing: సోషల్‌ మీడియా దారి తప్పుతుందా?

Social media derailing: సోషల్‌ మీడియా దారి తప్పుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సోషల్‌ మీడియా ప్రచారం అతి జుగుప్సాకరం

ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. అవును.. నిజమే! నేటి రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వాడకం అతిసర్వ సాధారణమయింది. వైఫై కనెక్షన్‌ అందరికీ అందుబాటు ధరలో లభిస్తోంది. ముఖ్యంగా, జియో నెట్‌ వర్క్‌ ప్రవేశించాక మరీ అపరిమితంగా వాడకం మొదలయింది. ఇతర నెట్‌ వర్క్‌ సంస్థలు పోటీతత్వంకు తలోగ్గక తప్పలేదు. ఇందువలన, మానవ సంబంధాలు బహుదూరమైపోయాయి. ‘నెట్‌’ అనేది అతి పెద్ద వ్యసనంగా మారింది. ఒకే ఇంటిలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల అందరి లోకం అరచేతిలో ఇమిడిన ‘స్మార్ట్‌ ఫోనే’! పడక గదిలోనున్నా, భోజనం చేస్తున్నా అదే ధ్యాస. కాగా, సోషల్‌ మీడియా అనేది జీవితంతో పెనవేసుకున్న ‘ఫెవికాల్‌ ’ బంధం. వాట్స్‌ అప్‌, ఫేస్‌ బుక్‌క, ఇన్‌స్ట్రాగాం, మోజ్‌.. ఇలా.. ఎన్నో, ఎన్నెన్నో యాప్‌లు. ఇవే ప్రపంచం, వీటి తోడిదే లోకం.. యావత్‌ ప్రపంచానికి దూరం తరిగి పోయింది. దీనిని అభివృద్ధిగా పరిగణించాలో, ఒక విధమైన ‘మానియా’గా భావించాలో అర్థం కాని స్థితి. సోషల్‌ మీడియాను దుర్వినియోగ పరిచేవారు అత్యధిక శాతం ఉండటం శోచనీయం. అనేక సన్సారాల్లో చిచ్చు రేగటం ఈ సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోంది. ముఖ్యంగా, అపరిచిత వ్యక్తులతో స్నేహాలు ముప్పు తెస్తున్నాయి. ఇటువంటివి బ్లాక్‌ మెయిల్‌ వంటి వాటికి దారి తీస్తున్నాయి. ఫొటోల మార్ఫింగ్‌ చేయటం, వాటిని చాలా మంది షేర్‌ చేయటం, వేలాది మంది నెటిజన్లు వినోదంగా భావించడం సర్వ సాధారణమయింది. ఇలా, పరువు ప్రతిష్టలతో ఆటలాడుకోడం విశ్వ వ్యాపితంగా మారింది. సైబర్‌ నేరాల కేసుల్లో ఇటువంటి ఆరోపణలే అత్యధికంగా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఎదో ఓ క్షణంలో సోషల్‌ మీడియా బారిన పడటం తప్పటం లేదు. కరోనా మహమ్మారి సమయంలో పసి పిల్లలకు సైతం ఆన్లైన్‌ క్లాసెస్‌ నెట్‌ వర్క్‌ విధానంలో నిర్వహించడం వలన ముక్కుపచ్చలారని వాళ్లకు కూడా స్మార్ట్‌ ఫోన్‌ వాడకం అలవాటుగా మారింది. ఎక్కడ చూసినా అరచేతిలో స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకుని వీక్షించే వారే కనబడుతుంటారు. ఆఫీస్‌ లల్లో పనులు కూడా కుంటుపడుతున్నాయి. ఇక, కళాశాలల్లో సంగతి చెప్పే పనిలేదు. ఒక జోక్‌ ఏమిటంటే, ఎదురెదురుగా నున్న భార్యాభర్తలు కూడా ఫోన్‌లల్లో ఛాటింగ్‌ చేసుకోవడం. ఇక, గుడ్‌ మార్నింగ్‌, గుడ్‌ నైట్‌ వంటి నసపెట్టే మేస్సేజేస్‌ పెట్టేవారి సంఖ్యకు కొదవ లేదు. ఉదయం లేవగానే వాటిని డిలీట్‌ చేయటం ఓ పెద్ద ప్రహసనం. అసలు వాట్స్‌ అప్‌ మెసేజెస్‌కు ‘ఛార్జ్‌’ పెడితే సగం అసహనం హరీస్తుంది. అరచేతిలో స్మార్ట్‌ ఫోన్‌ వీక్షించే వారు, ఎవరు ఏది వీక్షిస్తున్నారో అగమ్య గోచరం. పాత రోజుల్లో అశ్లీల చిత్రాలు చూడాలంటే అదొక నేరం. ఎంతో చాటు మాటుగా, భయం భయంగా చూడటం జరిగేది. సాక్షాత్తు, చట్టసభ సమావేశాల్లో స్మార్ట్‌ ఫోన్లలో ‘నీలి’ చిత్రాలు చూస్తూ దొరికిపోయిన ప్రజా ప్రతినిధులు వున్న భావస్వాతంత్య్రం కలిగిన వ్యక్తులను కలిగి ఉన్న దేశం మనది. ఈ సోషల్‌ మీడియా వలన ప్రచారం పీక్‌ దశకు చేరుకుంది. పాత పరిచయాలు, బంధుత్వాలు కలుస్తున్నాయి. అదొక్కటి హర్షించదగ్గ విశేషం అయినా, ఈ సోషల్‌ మీడియాను రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉచిత పబ్లిసిటీ యంత్రంగా వాడుకుంటున్నారు. ఆవేశ కావేశాలు పతాక స్థాయికి వెళ్తున్నాయి. నేతల తలరాతలు మార్చడానికి సోషల్‌ మీడియా పెద్ద వేదికగా మారిందనడంలో సందేహం లేదు. ఇక, మన తెలుగు ప్రాంతాలకు వస్తే, ఒకనాడు ఏవో ఒకటి, రెండు పత్రికల గుత్తాధిపత్యం నడిచేవి. ఒక ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, కూలాలన్నా ఆ పత్రికల పాత్ర ఆ స్థాయిలో ఉండేది. వారు రాసిందే రాత, చెప్పిందే వేదం..మరి, ఈనాడు సోషల్‌ మీడియా విశృంఖలత్వం తర్వాత, ఆయా పత్రికలు, వివిధ ఛానెళ్లు ఏవి, ఎలా, ఏ విధంగా ప్రచారం చేస్తున్నా, గొంతు చించుకుంటున్నా ప్రజలు వాటిని నమ్మడం లేదు. ఇదొక పెద్ద మార్పు. అతి ముఖ్యంగా, తెలుగు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సోషల్‌ మీడియా ప్రచారం అతి జుగుప్సాకరం అయిన పుంతలు తొక్కుతోంది. తీవ్ర వ్యక్తిత్వ హననం జరుగుతోంది. ఆయా నాయకుల కుటుంబ సభ్యులను కూడా అతి హేయంగా కామెంట్స్‌ చేయడం చూస్తోంటే ఎంతో కంపరం కలుగుతోంది. మార్ఫింగ్‌ వీడియోలు, ఫోటోలు ద్వారా ఒకరినొకరు అసభ్యకరంగా దూషించుకోడం ద్వారా ఈ సోషల్‌ మీడియాను విపరీతంగా దుర్వినియోగ పరుస్తున్నారు. వీక్షించే వారిలో కొందరికి ఇది వినోదంగా అనిపించినా, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంటోంది. పోలీస్‌ శాఖ ఎన్ని విధాలుగా కేసులు నమోదు చేసినా, ఈ పైశాచికత్వానికి తాళం పడడం లేదు. సోషల్‌ మీడియా వెనుక రాజకీయ వేత్తలు ఉన్నారనేది అందరకూ తెలిసినదే! విదేశాల్లో ఉన్నవారు కూడా ‘యూ ట్యూబ్‌ ’ ద్వారా తమ వాగ్ధాటిని ప్రదర్శిస్తున్నారు. ఆధారాలు లేని ప్రచారం వలన కొద్దిగా వారి వారి సరదాలు తీరవచ్చేమో కానీ, వీటిని నీతి బాహ్యమైన చర్యలుగా పరిగణించాలి. వివిధ టివి ఛానెల్స్‌, కొన్ని పత్రికలు నిస్పాక్షితకు ‘ఘోరీ’ కట్టాయి. ఒక వర్గపు రాజకీయాన్ని భుజానికి ఎత్తుకుంటున్నాయి. ప్రతిగా సోషల్‌ మీడియా ద్వారా అవహేళనలకు పాత్రమవుతు న్నాయి. చివరకు, ఒక్క మాటలో చెప్పాలంటే, ‘నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు’ అనేలా ఆంధ్ర రాజకీయాలు తయారయ్యాయి. పక్షపాత రహతంగా చర్చించ వలసిన విశ్లేషకులు సైతం నిస్సిగ్గుగా ఒక వర్గానికి కొమ్ము కాయడం వలన సోషల్‌ మీడియాలో వారు సైతం అసభ్యపు కామెంట్ల పాలు బడుతున్నారు. ఈ జాడ్యం ఎక్కడివరకు దారి తీస్తుంది అంటే, కుల, మత ఘర్షణలకు ఈ వేదిక తావు ఇచ్చేంత వరకు. సాహిత్య, సమాలోచన కార్యక్రమాల కంటే వీటికి ఎక్కువగా వ్యూయర్‌ షిప్‌లు దక్కుతున్నాయి. వీధుల్లో, షాపుల్లో సిసి కెమెరాల ద్వారా అసాంఘిక శక్తుల ఆచూకీ తెలుసుకున్నట్లు, ఇటువంటి సోషల్‌ మీడియా కూడా రక్షణ శాఖ ఆధీనంలో ఉండాలి. ఎవరు ఎటువంటి పోస్టింగ్‌లు పెడుతున్నారు, అవి సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా నెట్‌ వర్క్‌ అనేది అతి చవక అయిపోయింది. దీనిని అతి ఖరీదు వ్యవహారం చేయాలి. దీనివలన సోషల్‌ మీడియా వాడకం కొద్దిగా నియంత్రణలో ఉంటుంది. ప్రతి దానికీ తగిన వెల నిర్ణయిస్తే, ఎంతో అవసరమైతేనె సోషల్‌ మీడియా వాడకం జరుగుతుంది. ప్రాయంలో ప్రవేశించే వారికి ఇదొక వ్యస నం. వారు పెడదారులు త్రొక్కకుండా చూడటం తల్లిదండ్రులకు అతి కష్టంగా మారింది. జీవన విధానంలో మొబైల్‌ వాడకం లేని ఘడియను ఊహించలేనంతగా వ్యవస్థ తయారయింది. చిన్న పిల్లలకు కూడా మొబైల్స్‌ అందుబాటులో ఉండటం వలన, వారు దేనిని క్లిక్‌ చేస్తున్నారో తెలుసు కోవడం చాలా దుర్లభంగా మారింది. అసభ్య, అశ్లీల వెబ్‌ సైట్లును నిషేధిస్తే అవి ఇతర మార్గాల ద్వారా చొరబడుతున్నాయి. సోషల్‌ మీడియా వలన కొంత ఉపయోగం ఉన్నా, అంతకు మించి సమాజం కునారిల్లడానికి మార్గాలూ ఉన్నాయి. రెండువైపులా పడునున్న కత్తి ఈ సోషల్‌ మీడియా! సభ్యతగా పలకరించుకోవడం వరకు, దూరాభారాల బరువు తగ్గటం వరకు, ఖండాంతరాలోనున్న వారితో భావాలు పంచుకోవడం వరకు.. ఇంత వరకు ఫర్వాలేదు. అంతకుమించి, సైబర్‌ క్రైమ్‌ నేరాలు, ఆన్లైన్‌ మోసాలు జరుగుతున్నాయి. వీటి నియంత్రణ అతి కష్టంగా మారుతోంది. అన్నింటికీ మార్గం ఈ సోషల్‌ మీడియా పైన ‘డేగ’ కన్ను వేయాలి. ఉగ్రవాదంలా మారిన ఈ సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టింగ్స్‌ భావోద్రేకాలను రెచ్చగొట్టి, సమాజంలో విష బీజాలను నాటుతున్నాయి. అందుకే, ప్రభుత్వం వీటిని ఉపెక్షించ కూడదు. శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. అవి ఎలా ఉండాలంటే, ఏదైనా అనుచిత పోస్టింగ్‌, కామెంట్‌ పెట్టేముందు, పదేపదే ఆలోచించి, అతి జాగ్రత్తగా వ్యవహరించేలా ఉండాలి. సభ్య సమాజంలో అసభ్య త రేకెత్తించే వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నా తప్పు లేదు. ఇందుకు ‘చట్టాలు’ సవరించినా ఫర్వాలేదు. భవి ష్యత్తులో సోషియల్‌ మీడియా ఆనందంగా, ఆహ్లాద భరితంగా మారుతుందని ఆశ పడటం పేరాశే అయినా, ఆ సుది నాలకు ఎదురుచూడటం వినా మార్గం లేదు

  • పంతంగి శ్రీనివాస రావు,
    9182203351.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News