Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Stalin Vs Governor: తమిళనాడు గవర్నర్‌ అనాలోచిత చర్య

Stalin Vs Governor: తమిళనాడు గవర్నర్‌ అనాలోచిత చర్య

గవర్నర్‌ దుస్సాహస చర్య క్షమించరానిది

తెలిసో తెలియకో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. నిజానికి ఇంతకు ముందు ఇటువంటి సంఘటన జరిగిన సందర్భం కూడా లేదు. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యకు పాల్పడడంలో ఆయన దూరదృష్టితో గానీ, ముందు చూపుతో గానీ వ్యవహరించలేదన్నది సుస్పష్టం. పోర్టుఫోలియో లేని మంత్రి వి. సెంథిల్‌ బాలాజీని తాను పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు సమాచారం పంపించారు. ప్రస్తుతం సెంథిల్‌ బాలాజీ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈలోగా కేంద్ర హోమ్‌ మంత్రి నుంచి ఫోన్‌ రావడంతో ఆయన ముఖ్యమంత్రికి మరో సమాచారం పంపిస్తూ, సెంథిల్‌ బాలాజీని తొలగిస్తూ తాను ఇంతకు ముందు పంపిన ఆదేశాలను పెండింగ్‌లో పెడుతున్నానని, అటార్నీ జనరల్‌ను సంప్రదించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజ్యాంగ సూత్రాలకు బద్ధుడై ఉండాల్సిన గవర్నర్‌ ఇటువంటి చర్యకు ఉపక్రమించే ముందే న్యాయపరమైన సలహాలను తీసుకుంటారని ఆశించడం సహజం. చర్యతీసుకున్న తర్వాత న్యాయ సలహాను కోరడాన్ని బట్టి ఆయన నిర్ణయ శక్తిని, వివేకాన్ని అర్థం చేసుకోవచ్చు.
రాజ్యాంగంలోని 153, 163, 164 ఆర్టికల్స్‌కు లోబడి తాను ఈ చర్య తీసుకుంటున్నట్టు ఆయన తన మొదటి వర్తమానంలో వివరించారు. రాజ్యాంగం ప్రకారం తనకున్న అధికారాలు, మంత్రివర్గ సలహా ప్రకారం తాను నడుచుకోవడం, ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల నియామకానికి సంబంధించిన ఆర్టికల్స్‌ ఇవి. ఈ ఆర్టికల్స్‌ను లోతుగా, నిశితంగా పరిశీలించే పక్షంలో మంత్రులను నియమించడం, తీసేయడం అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోని విషయమని తేలికగా అర్థమవుతుంది. కాగా, సెంథిల్‌ బాలాజీ మీద అవినీతి ఆరోపణలు రావడం, సుప్రీంకోర్టు ఆయనమీద వ్యాఖ్యలు చేయడం వంటి కారణాలను ఆయన తన చర్యను సమర్థించుకుంటూ వివరించారు. ఈ మంత్రిని తొలగించాలని కోరడం అనేది చట్టబద్ధం కాదు కానీ, నైతిక సంబంధమైనది. ఈ మంత్రిని తొలగించాలంటూ ఆయన గతంలో రాసిన లేఖకు ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో గవర్నర్‌ రవి ఏకపక్షంగా ఈ చర్యను చేపట్టడం ఏవిధంగా చూసినా దుస్సాహస చర్యే అవుతుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తమకు తాముగా మంత్రివర్గం నుంచి వైదొలగితే మంచిదే. ముఖ్యమంత్రి తొలగించినా అది సమంజసమైన చర్యే అవుతుంది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఇదే విధంగా జరుగుతుంటుంది.
విచారణ కోర్టులో ఆరోపణలను సిద్ధంచేసినప్పుడు నైతిక కారణాల మీద మంత్రులు తమ పదవుల నుంచి వైదొలగడం సహజంగా జరుగుతుంటుంది. నిజానికి వారు చట్ట ప్రకారం పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఏళ్ల క్రితం అన్నాడి.ఎం.కె ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతికి, అక్రమంగా డబ్బు తరలింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆ ఆరోపణలు నిగ్గు తేలేవరకూ ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆయనను ముఖ్యమంత్రి ఈ కారణాలపై పదవి నుంచి తొలగించాల్సిన అవసరం కూడా లేదు. తాను ఒక అవినీతిపరుడైన మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాననే అపనింద నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆయనను పదవి నుంచి తొలగిస్తే బాగుండేది. లేక సెంథిల్‌ బాలాజీ తన మంత్రి వర్గంలో ఉన్నందు వల్ల చట్టం తన పని తాను చేసుకుపోవడానికి అవరోధాలు ఎదురవుతున్నాయనే అభిప్రాయంతోనైనా స్టాలిన్‌ తన మంత్రిని తొలగించాల్సింది. ఏది ఏమైనా అది ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి సంబంధించిన విషయం. కానీ, గవర్నర్‌ దుస్సాహస చర్యమాత్రం క్షమించరాని చర్య అని చెప్పక తప్పదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News