Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్State of World Population Report: జనాభా పెరుగుదల ఒక సదవకాశం

State of World Population Report: జనాభా పెరుగుదల ఒక సదవకాశం

ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించే ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌’ ప్రకారం భారతదేశ జనాభా ఈ ఏడాది మధ్య నాటికి చైనా కంటే ముప్ఫయ్‌ లక్షలు మించిపోతుంది. ప్రస్తుతం చైనా జనాభా 142.5 కోట్లు.ఐక్యరాజ్య సమితి జనాభా గణన పద్ధతులు సాధారణంగా దేశ అధికారిక జనాభా లెక్కల మీదా, జననాలు, మరణాలు, వలసల మీదా ఆధారపడి ఉంటాయి. నిజానికి, భారతదేశ జనాభాను గణించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలతో కూడుకుని ఉంటుంది. ఇక ఈ సోషలిస్టు యుగంలో దేశంలోని పేదరికం గురించి సమర్థించుకోవడానికి మాత్రమే జనాభా గణాంకాలు ఉపయోగపడుతున్నాయి. దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి, జీవన ప్రమాణాలు పెరగకపోవడానికి కూడా అధిక జనాభానే కారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని రకాలుగా కుటుంబ నియంత్రణ పద్ధతులను అమలు చేసినా, అది వ్యక్తిగతంగా తమకు హోదాకు, తమ స్వేచ్ఛకు తగని విషయంగా భావించడం జరుగుతోందే తప్ప, ఇందులోని తార్కికతను అర్థం చేసుకోవడం జరగడం లేదు.
దేశంలో 1990లలో ఆర్థిక సంస్కరణలు రూపుదిద్దుకున్నప్పుడుభారతదేశం ప్రపంచ దేశాలకు ఒక పెద్ద, సువిశాల మార్కెట్‌ వనరుగా కనిపించింది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాల్సింది కానీ, మళ్లీ పేదరిక ప్రదర్శనే ముందుకు వచ్చింది. పేదరిక ప్రదర్శన అనేది చాలా కాలం పాటు రాజకీయంగానూ, ఆర్థికంగానూ ఒకసదవకాశం కనిపిస్తూ వచ్చింది. జనాభా ఎక్కువగా ఉన్న చైనా తదితర దేశాలకు భిన్నంగా భారతదేశ జనాభాలో యువత సంఖ్య ఎక్కువ. ఉద్యోగాలు చేయగల వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువ. చైనాలో వృద్ధ జనాభా అధికంగా ఉంటుంది. భారతదేశం తన యువ జనాభాను సరైన విధంగా, అభివృద్ధి దిశలో వినియోగించుకోగలిగిన పక్షంలో చాలా తక్కువ కాలంలో ఒక అగ్రరాజ్యంగా అవతరించడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్మిక శక్తితో, చక్కని వేతన వ్యవస్థతో అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి వీలుంది. ఇక పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల కంటే అధిక సంఖ్యలో స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులు అనుక్షణం అందుబాటులో ఉండడం జరుగుతోంది. భారతదేశ కార్మికులను, నిపుణులైన ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, అమెరికా, ఐరోపా దేశాలు కొత్త ప్రాజెక్టులను రూపొందించడం, చేజిక్కించుకోవడం జరుగుతోందంటే దేశ యువ జనాభా ఏ పరిస్థితిలో, ఎంత ఉన్నత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, విదేశీ విశ్వవిద్యాలయాలు సైతం అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులను చేర్చుకుంటున్నాయంటే, ఇక్కడి నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు.
ఈ నైపుణ్య, ప్రతిభా పాటవ సంపద దేశంలో ఆర్థిక అసమానతలను రూపుమాపకపోవచ్చు. కానీ, పేదరికానికి జనాభా పెరుగుదల, కుటుంబ నియంత్రణ పాటించకపోవడమే కారణమని భావించడానికి మాత్రంఆస్కారం లేకుండా చేసింది. విచిత్రమేమిటంటే, భారతదేశ జనాభా చైనా జనాభాను దాటి ఉంటే దాటి ఉండవచ్చు కానీ, దేశ జనాభా కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభిస్తోందన్న మాట మాత్రం నిజం. 2021 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం, దేశంలో పునరుత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతోంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, 2050 నాటికి ప్రస్తుత 140 కోట్ల భారతీయ జనాభా 167 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, 2100 నాటికి ఇది 153 కోట్ల వద్ద స్థిరపడుతుందని భావిస్తున్నారు.దేశ జనాభా 140 కోట్లకు పెరగడమన్నది సదవకాశమా, దురవకాశమా అని దేశమంతా ఆలోచిస్తున్న సమయంలోనే, ఈ జనాభాను సద్వినియోగంచేసుకోవడానికి, జనాభా పెరగడాన్ని సదవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం మంచిది. కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా దేశ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ జనాభాకు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. 2011 నుంచి ఇంతవరకూ సుమారు 16 లక్షల మంది భారతీయులు విదేశాలలో స్థిరపడి తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక్కడి నుంచి వలసలు పెరుగుతున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ. కార్మికులు, ఉద్యోగుల నైపుణ్యాలు పెరుగుతున్న ఈ దశలో జనాభాను మరింతగా నైపుణ్యాల దిశగా తీర్చిదిద్దే పక్షంలో దేశం మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News