గతవారం బెంగళూరులో ఓ బి.టెక్ విద్యార్థి అధ్యాపకుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్షా కేంద్రానికి సెల్ ఫోన్ తో రావడం అతను చేసిన తప్పు. దేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడమనేది ఆదిత్య ప్రభుతోనే ప్రారంభం కాలేదు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో ఏటా వెయ్యికి పైగానే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు తెలియ జేస్తున్నాయి. ఆదిత్య ప్రభు కోసం అతని తల్లి బయట నిరీక్షిస్తుండగా ఈ సంఘటన జరిగింది. తనకు బాగా దగ్గరగా ఒక గదిలో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయం చాలా సేపటి వరకు ఆమెకు తెలియదు. ఈ విశ్వవిద్యాలయ అధికారులకు ఏ కోశానా దయాదాక్షిణ్యాలు లేవని, ఇన్విజిలేటర్ దారుణంగా వేధించడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఆ తల్లి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
గతవారం ఓ ఏడవ తరగతి బాలిక కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కూడా ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే జరిగింది. చదువుల భారం, ఉపాధ్యాయులు, అధ్యాపకుల వేధింపులు, ఒక్కోసారి తల్లితండ్రుల వేధింపులు వగైరాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడమనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్కోసారి ఒంటరితనం, తననెవరూ పట్టించుకోవడం లేదని, తాను పనికి రాననే భావన, ఇతరుల దుష్ప్రవర్తన, హింస, కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళనలు కూడా ఈ ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి.
ఆదిత్య ప్రభు ఆత్మహత్య సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది కానీ, అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడడానికి అధికారులు ఎంతగా కారణం అయి ఉంటారో ఆలోచించాల్సిన విషయం ఇది. తెలిసో తెలియకో, పొరపాటునో గ్రహపాటునో అతను సెల్ ఫోన్ ను పరీక్షా కేంద్రంలోకి తీసుకువెళ్లి ఉండవచ్చు. ఆ చిన్న తప్పిదానికి అతని అందరి ముందూ ఇంతగా వేధించాల్సిన అవసరం లేదు. విశ్వవిద్యాలయాలన్నా, విద్యా సంస్థలన్నా విద్యార్థులను సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన దేవాలయాల లాంటివి. టీనేజ్ వయసులో ఉన్న విద్యార్థుల మనసులు ఏ విధంగా గందరగోళంగా, తికమకగా ఉంటాయో అధికారులు అర్థం చేసుకుని ఉండాలి. విద్యార్థులలో భయం జొప్పించే కంటే వారికి కౌన్సెలింగ్ చేయడం చాలా మంచిది.
ఒకప్పుడు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడమనేది చాలా అరుదుగా, చెదురు మదురుగా జరుగుతుండేవి. ఇప్పుడు దాదాపు నిత్యకృత్యం అయిపోయాయి. దిగ్భ్రాంతి కరమైన విషయమేమిటంటే, ఇంకా యుక్త వయసులోకి రాని విద్యార్థులు, చిన్న పిల్లలు సైతం ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం, దేశంలో ఏటా 13 వేల మంది బాల బాలికలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం వంటి ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో చదువుల భారం, అధ్యాపకుల ఒత్తిడి, వేధింపుల కారణంగానే ఆత్మహత్యలు జరుగుతున్నాయని అర్థమవుతోంది.
రాజస్థాన్ లోని కోటాలో ఉన్న కోచింగ్ సెంటర్లు పూర్తిగా ఆత్మహత్యలకు మారుపేరుగా గుర్తింపు పొందాయి. గత మే నెలలో హైదరాబాద్ నగరంలో అయిదు మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, నిజామాబాద్‌లో ఒక విద్యార్థి ఒకే రోజున ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన కారణంపై ఈ టీనేజ్ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత జూన్ లో బాసరలో కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజానికి, ఒక్కోసారి ఇదమిత్థంగా కారణం చెప్పలేని పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. సోషల్ మీడియా, తోటివారి ప్రభావం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. సరిగ్గా చదవడం లేదనో, సెల్ ఫోన్లతో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారనో పెద్దలు మందలించినప్పుడు కూడా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది. ఆధునిక యువతరం మానసికంగా బలహీనంగా తయారవుతోందా? వీరిని సోషల్ మీడియా బలహీనంగా మారుస్తోందా? పిల్లలకు వారి మనస్తత్వాలను అర్థం చేసుకుని తల్లితండ్రులే కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, దానికి ఆత్మహత్య మాత్రమే పరిష్కారం కాదని తల్లితండ్రులు పిల్లలకు నూరిపోయాల్సి ఉంటుంది.
