దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు వింటున్నప్పుడు మనసు తీవ్ర ఆందోళనకు గురవుతుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, అందులోనూ 16 ఏళ్ల లోపు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే మరీ ఆందోళన కలుగుతుంది.ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే అతని కుటుంబం కుప్పకూలినట్టు, చిన్నాభిన్నమైనట్టే భావించాలి. అతని చుట్టూ అల్లుకుపోయిన ప్రపంచం కూడా ఆవేదనతో, ఆందోళనతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థులు ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం సమాజాన్ని ఒక్క కుదుపు కుదిపింది. అందులో ఒక వ్యక్తి వైద్య కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ప్రీతి. ఒక సీనియర్ విద్యార్థి వేధిస్తున్నాడనే కారణంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మరో కేసులో, కళాశాలలో తనను పెడుతున్న చిత్రహింసలను భరించలేక 16 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యలకు కారణమైన వారికి సరైన శిక్ష విధించడానికి న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది.
అయితే, ప్రాథమికంగా ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలు మాత్రం విదితమవుతున్నాయి. కళాశాలల్లో ర్యాగింగ్‌ను నిరోధించడానికి అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు అనేక చర్యలు తీసుకున్న మాట నిజమే. దీని గురించి కార్పొరేట్ కాలేజీల్లో చర్చోపచర్చలు జరుగుతున్న మాట కూడా నిజమే. ఈ సమస్యను నిరోధించడానికి దేశంలోనూ, రాష్ట్రంలోనూ చట్టాలు, నిబంధనలు, శిక్షలు, హెల్ప్‌లైన్లు లేవని కాదు. ఇన్ని ఉన్నప్పటికీ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతూనే ఉండడానికి కారణం ఏమిటి? పైగా, పాఠశాలల స్థాయిలో కూడా ఇటువంటి జరుగుతూ ఉండడానికి కారణం ఏమిటి? నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం, దేశంలో చోటు చేసుకుంటున్న ప్రమాద మరణాలు, ఆత్మహత్యల్లో విద్యార్థుల శాతం 8 వరకూ ఉంది. ఇది అధికార లెక్కల ప్రకారం మాత్రమే. అనధికార గణాంకాలు ఇంకా ఎంతైనా ఉండవచ్చు.
ఈ ధోరణిని నివారించడానికి ఎవరు ఏం చేస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. బాంబే ఐ.ఐ.టిలో ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, “దళిత, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నా” అని వ్యాఖ్యానించారు. విద్యా సంస్థల్లో సామరస్యం, సానుభూతి, ఆదరణ కొరవడడమే ఇందుకు ప్రధాన కారణమని కూడా ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి చేసిన వ్యాఖ్యలతో ఎవరూ విభేదించలేరు. బాంబే ఐ.ఐ.టిలోని దర్శన్ సోలంకి అయినా, కాకతీయ వైద్య కళాశాలలో చదువుతున్న ప్రీతి అయినా, 16 ఏళ్ల కళాశాల విద్యార్థి అయినా, వీరు ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్యమైన కారణం వారి విద్యాసంస్థల్లో సానుభూతి, సామరస్యం లేకపోవడమే.
ఇలా విద్యార్థులు అర్థంతరంగా తమ జీవితాలను చాలించుకోవడానికి విద్యాసంస్థలు, అధ్యాపకులు, నిబంధనల రూపకర్తలతో పాటు చివరగా సమాజాన్ని కూడా తప్పుపట్టాల్సి ఉంటుంది. ఈ నిశ్శబ్ద మహమ్మారిని దేశం నుంచి, సమాజం నుంచి, మనసుల్లోంచి తరిమి కొట్టాలంటే అందుకు విద్యను, విద్యాబోధనను సంస్కరించడం ఒక్కటే మార్గం. ఇందుకు తల్లితండ్రులు, అధ్యాపకులు, అధికారులు సమన్యయంతో ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రజల్లో అవగాహనను పెంపొందించాలి. చైతన్యం కలిగించాలి. ముఖ్యంగా విద్యాసంస్థలు వాణిజ్యమయం కాకుండా, కళాశాల్లో వివక్ష లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం పెంచడానికి పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టాలి. ఇటువంటిది జరిగే వరకూ విలువైన ప్రాణాలు ఆత్మహత్యల రూపంలో గాల్లో కలిసిపోతూనే ఉంటాయి.