Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్T Congress: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న కాంగ్రెస్

T Congress: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న కాంగ్రెస్

అందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టుగా ఉంటుంది. అంకాంగ్రెస్ ధోరణి. అయిదారు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు పాలక, ప్రతిపక్షాలన్నీ తమకు వీలైనంతగా సమాయత్తం అవుతుంటే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరయి పోతోంది. ఎన్నికల నాటికి ఈ పార్టీ మనుగడలో ఉంటుందా అని ఆలోచిస్తున్న వారు కూడా లేకపోలేదు. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ తీవ్ర అసమ్మతితో, అసంతృప్తితో కునారిల్లుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ అ సమ్మతికి తెర దించని పక్షంలో పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా మారడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఏడాదిగా ఈ పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. ఈ అసమ్మతిని పరిష్కరించడానికి అటు అధిష్ఠానం గానీ, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ గానీ పెద్దగా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవనే అనిపిస్తోంది.
గత ఏడాది రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన దగ్గర నుంచి పార్టీలో సిగపట్లు ప్రారంభమయ్యాయి. పార్టీలో అంతకు ముందు కుమ్ములాటలు, లుకలుకలు లేదని కాదు. పార్టీలో ఆధిపత్యం కోసం సీనియర్లు, జూనియర్లకు మధ్య మొదటి నుంచీ అసంతృప్తి, అసమ్మతి ఉంటూనే ఉంది. అయితే, తెలుగు దేశం పార్టీ నుంచి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన రేవంత్ రెడ్డికి అధిస్థానం పార్టీ పగ్గాలు అప్పగించడం పార్టీలోని సీనియర్లకు ససేమిరా కొరుకుడు పడడం లేదు. తామందరినీ కాదని రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రేవంత్ రెడ్డికి పార్టీ సారథ్యం అప్పగించడంపై సీనియర్లు కారాలు, మిరియాలు నూరుతున్నారు. వక్త, అందరినీ కలుపుకుని పోగల వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి చేతిలో పార్టీని పెడితే పార్టీకి మళ్లీ జవజీవాలు. పోసినట్టవుతుందని భావించి రాహుల్ గాంధీ ఆయనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఎంపిక చేశారు. పార్టీ ఎమ్మెల్యేలలో చాలామంది తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బి.ఆర్.ఎస్)లో చేరిపోయిన నేపథ్యంలో రాహుల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
రాహుల్ గాంధీ నిర్ణయంతో సీనియర్లకు పచ్చి వెలక్కాయ గొంతులో అడ్డం పడ్డట్టయింది. అటు రాహుల్ మాటను కాదనలేక, ఇటు రేవంత్ రెడ్డి నాయక త్వాన్ని అంగీకరించలేక వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. మొదట్లో చడీ చప్పుడూ లేకుండా తమ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చిన సీనియర్లు ఇప్పుడు బాహాటంగానే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించడం ప్రారంభించారు. రేవంత్ వ్యవహార శైలి వారికి మింగుడు పడడం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి తన గ్రూపు వారిని కాంగ్రెస్లోకి తీసుకు రావడం వారికి పుండు మీద కారం రాసినట్టుగా ఉంది. పార్టీలో వేళ్లుపాదుకుపోయి ఉన్న నాయకులంతా, పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారిపై తోక తొక్కిన తాచులా ఎగిరిపడుతున్నారు. పార్టీలోని కుమ్ములాటలను గమనించిన అధిష్టానం హుటాహుటిన సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ను పంపించింది కానీ, ఆయన దౌత్యం పెద్దగా పనిచేసిన దాఖలాలు కనిపించడం లేదు.
మారడం చాలా అవసరం. నిజానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పార్టీ శ్రేణులలో కొద్దిగా ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయనే అభిప్రా యం కూడా కలిగింది. అది కాస్తా ఈ కుమ్ములాటలతో ఆవిరైపోయింది. పార్టీ సీనియర్లు బహిరంగంగానే ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటుండడంతో పార్టీని మళ్లీ నిరుత్సాహం, నిస్సత్తువ ఆవరించాయి. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచీ ఒక్కక్షణం వృథా చేయకుండా దిగ్విజయ్ సింగ్ సీనియర్ల ఫిర్యాదులను వింటూనే ఉన్నారు. తనతో మాట్లాడడానికి ఆయన అందరికీ అవకాశమిచ్చారు. పార్టీ కమిటీలన్నిటినీ రేవంత్ తన వర్గం వారితోనే నింపేస్తున్నారని, తమను పక్కన పెట్టేస్తున్నారని సీనియర్లు దిగ్విజయ్కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు మాణిక్యం టాగూర్ తమ అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా, రేవంత్ ఎట్లా చెబితే అట్లా వ్యవహరిస్తున్నారని కూడా పార్టీ పెద్దలు ఆయనకు చెప్పారు.
రేవంత్ రెడ్డి వర్గం కూడా పార్టీ సీనియర్ నాయకుల తీరుతెన్నులను బాహాటంగానే ఎండగడుతోంది పార్టీలో రేవంతు పెరుగుతున్న పట్టు, పలుకుబడిని చూసి సీనియర్లు ఓర్వ లేకపోతున్నారని, సరిగ్గా ఆయన పాదయాత్ర చేయదల చుకున్నప్పుడే వారంతా గొంతెత్తడం ప్రారంభించారని వారు దిగ్విజయ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. రేవంత్ పాదయాత్ర ద్వారా తన పట్టును పెంచుకోవడం ఈ నాయకులకు ఏమాత్రం గిట్టడం లేదని కూడా వారు ఆయనకు చెప్పారు. నిజానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర ప్రతిప క్షాల కంటే కొద్దిగా మంచి స్థాయిలో ఉంది. ముఖ్యంగా, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తదితర పార్టీల కంటే పటిష్ఠంగా ఉంది. పాలక పక్షం మీద సంధించడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలన్నీ ఆ పార్టీ దగ్గర ఉన్నాయి. పాలక పక్షం మీద పోరాటాన్ని ఉధృతం చేయడానికి తమకే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ అధిష్టాన వర్గం సైతం భావిస్తోంది. ఈ దశలో పాత కాపులు, కొత్త కాపుల మిశ్రమంగా పార్టీని అభివృద్ధి చేయడానికి దిగ్విజయ్ సింగ్ నడుం బిగించగలిగితే, అందరినీ ఒక తాటి మీద నడిపించడానికి కృషి చేస్తే, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే మాత్రం పార్టీకి ఇవే చివరి ఎన్నికలయ్యే ప్రమాదం ఉందని అర్ధం చేసుకోవాలి.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News