Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Tamil Politics: ద్రవిడియన్ మోడల్ ఆఫ్ ఎకానమీ టార్గెట్ ట్రిలియన్ ఎకానమీ @ 2030

Tamil Politics: ద్రవిడియన్ మోడల్ ఆఫ్ ఎకానమీ టార్గెట్ ట్రిలియన్ ఎకానమీ @ 2030

పాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. తాను మే 2021లో అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రి అధికార నివాసానికి కూడా మారకుండా సొంత ఇంటిలోనే ఉండిపోయారు. సీఎం అధికార బంగళా సిటీ మధ్యలో ఉండటంతో కార్యకర్తలకు పలు ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలు సృష్టిస్తుందని తన సొంత బంగళాలో హ్యాపీగా ఉండిపోయారు ఆయన. చాలా ఆలస్యంగా అంటే 69 ఏళ్లకు గానూ సీఎం అయ్యే ఛాన్సు అందుకోలేకపోయిన స్టాలిన్ తన తండ్రి మరణానంతరం సీఎం అయ్యారు. తండ్రి ఉన్నంతకాలం ఆయనే సీఎంగా ఉండటంతో స్టాలిన్ ను తరచూ ‘ప్రిన్స్ ఛార్లెస్’ తో పోల్చేవారు అందరూ. ఇక సవతి సోదరుడితో ఉన్న విభేదాలు, గొడవల కారణంగా కరుణానిధి ఉన్నంతకాలం తండ్రి చాటు బిడ్డలా ఆయన ఉండిపోక తప్పలేదు. స్టాలిన్ కు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.. ఆతరువాత అత్యధికసార్లుఅంటే ఐదుసార్లు తమిళనాడు సీఎంగా కరుణానిధి వ్యవహరించారు కానీ కుమారుడు స్టాలిన్ కు మాత్రం ఆయన సీఎం పదవి అప్పగించలేదు. కాకపోతే డిప్యుటీ సీఎంగా మాత్రమే ఆయన పని చేసే ఛాన్స్ సంపాదించుకున్నారు. మద్రాస్ మేయర్ గా చాలాకాలం ఉన్న స్టాలిన్ తమిళులకు మద్రాస్ మేయర్ లేదా కరుణానిధి కుమారుడిగానే ఎక్కువగా సుపరిచితం అయ్యారు. తన తండ్రి తనకు నేర్పిందంతా కేవలం ఒకటే అదే “పని..పని… పని చేయటం మాత్రమే” ఆయన నేర్పారంటూరు స్టాలిన్.

- Advertisement -

ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యక్తిగత జీవితంలో రొటీన్ కూడా చాలా ఆసక్తిగొలిపేలా ఉంటుంది. రెండంతస్తుల తన సొంత బంగళాలోని పై అంతస్తులో ఉన్న జిమ్ లో ఫిట్నెస్ కు సంబంధించిన కసరత్తులన్నీ తప్పకుండా చేస్తారు స్టాలిన్. వెయిట్ ట్రైనింగ్, యోగా, మెడిటేషన్ వంటివన్నీ పూర్తి చేస్తే కానీ ఆయనకు పూర్తిగా తెల్లారదు. పైగా సైక్లింగ్ రెగ్యులర్ గా చేసే స్టాలిన్ మీకు రోడ్లపై చాలా సింపుల్ గా సైకిల్ తొక్కుకుంటూ పోతూ కనిపిస్తుంటారు. చాలా సందర్భాల్లో కామన్ మ్యాన్ లా కనిపించేందుకు స్టాలిన్ తహతహలాడుతుంటారు.

“ద్రవిడియన్ మోడల్ ఆఫ్ ఎకానమీ” అంటే ఏంటో చూపిస్తానంటూ కరోనా విపత్తు, వరదల సమయంలోనూ ఆయన చాలా హుందాగా ప్రవర్తిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించటంలో నిమగ్నమైపోయారు. జాతీయ రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కనబరచని స్టాలిన్ రాహుల్ గాంధీ మొదలుపెట్టిన భారత్ జోడో పాదయాత్రకు హాజరై జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారుకూడా.

2030 కల్లా ఒక ట్రిలియన్ ఎకానమీగా తమిళనాడును మార్చటమే తన ఏకైక లక్ష్యమని ఇదే ద్రవిడియన్ మోడల్ ఆఫ్ ఎకానమీ అంటూ వివరిస్తారు. కేవలం అభివృద్ధి మాత్రమే కాదని ప్రజా సంక్షేమం కూడా తమకు అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమంటారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి సెక్టర్ లో అభివృద్ధి సాధిస్తూ ప్రతి ఒక్క తమిళుడిని ఈ ప్రయాణంలో కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లటమే ద్రవిడియన్ మోడల్ అని సగర్వంగా వివరించే స్టాలిన్ మాటలు వింటే ముచ్చటేస్తుందంటారు ఇతర రాష్ట్ర ప్రజలు. అవును మన రాజకీయ నేతలంతా ఎప్పుడూ రాజకీయాలు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలే తప్ప తమ రాష్ట్రాన్ని ఎంత పెద్ద ఎకానమీగా మార్చి ప్రజల జీవితాలు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారో మాత్రం అస్సలు ప్రస్తావించరు.

ఇండియా టుడే నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అన్ని రకాల పెట్టుబడులు పెట్టేలా, వ్యాపార, వాణిజ్యాలు అత్యధికంగా సాగేలా, ప్రజలకు ఉపాధి లభించేలా ఊతమిచ్చే సర్కారుగా స్టాలిన్ సర్కారుకు పేరుపడింది. ఇండియాలో ‘బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్’ గా తమిళనాడును నిలిపారు స్టాలిన్. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతితోపాటు ప్రజా సంక్షేమం రెండూ సమానంగా సాగేలా ప్రత్యేక హై పవర్డ్ ఎకనామిక్ అడ్వైజరీ టీంను నియమించారు స్టాలిన్. ఈ టీంలో నోబెల్ బహుమతి గ్రహీత ఈస్తర్ డఫ్లో కూడా ఉండగా, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఉన్నారు. ఈ టీం ఇచ్చే సూచనలు, సలహాలు తప్పకుండా స్టాలిన్ పాటిస్తున్నారు. తమిళనాడులో పెట్టుబడులపరంగా ఏకంగా 207 ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రంగా టాప్ లో ఉండటం విశేషం. 2.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ఏకైక రాష్ట్రంగా కొత్తగా 344,150 మందికి ఉపాధి-ఉద్యోగావకాశాలు కల్పించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.

పవర్ ప్లాంట్స్, ఎలక్ట్రానిక్స్, ఆటో కాంపోనెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జనరల్ మానుఫాక్చరింగ్, ఫార్మా కంపెనీలు తమిళనాడులో పెట్టుబడులు పెట్టగా ప్రస్తుతం రాష్ట్ర ఎకానమీ 300 బిలియన్ డాలర్లు అంటే 24,750 కోట్ల రూపాయలుగా ఉంది. దీన్ని మూడింతలు పెంచేలా 2030కి ఆ లక్ష్యం చేరుకునేలా పరుగులు పెడుతోంది స్టాలిన్ సర్కారు. చెన్నై-బెంగళూరు, చెన్నై-కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్స్ ను అభివృద్ధి చేస్తోంది. మిలియన్ మంది యువతను స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ట్రెయిన్ చేస్తున్న ‘నాన్ ముధాల్వన్’ (నేనే ఫస్ట్) అనే ప్రోగ్రాంను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇలా ట్రెయిన్ అయిన 110,000 మంది యువతకు ఇప్పటికే 1,027 మైక్రో అండ్ మెగా జాబ్ ఫెయిర్స్ లో కొలువులు దక్కాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసి ఇందులో భాగంగా 301 సంస్కరణలను తీసుకువచ్చారు. ‘బిజ్ బడ్డీ’ అనే మరో పోర్టల్ ద్వారా కూడా పెట్టుబడులు పెట్టేవారికి తమిళనాడు స్వర్గధామంగా మార్చేస్తోంది రాష్ట్ర సర్కారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలా ఏళ్లుగా రాజకీయాలు చూస్తూ, వింటూ పెరిగిన వ్యక్తి కావటంతో తన మంత్రివర్గ సహచరులు, పార్టీ వారు ఏమి చెప్పినా ఆయన చాలా ఓపిగ్గా వింటారనే పేరు పడింది. కాబట్టి తాము చెప్పాలనుకున్నవన్నీ స్టాలిన్ ముందు చెప్పచ్చు. రాష్ట్రంలో మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు, వికలాంగులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. ఇలాంటి వాటిని ‘ఉచితాలు’ అంటే స్టాలిన్ కు నచ్చదు ఎందుకంటే కార్పొరేట్లకు ఎన్నో కన్సెషన్స్ ఇస్తున్న ప్రభుత్వాలు పేద ప్రజల కనీస అవసరాలు తీర్చకపోవటం సామాజిక అసమానతను పెంచి పోషించటమే అంటూ మోడీ విమర్శలకు ఘాటైన సమాధానం ఇచ్చారు స్టాలిన్. ఇలా అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయాలను సమన్వయం చేసుకుంటూనే మరోవైపు డీఎంకే పార్టీని మరింత పటిష్ఠం చేస్తున్నారు స్టాలిన్.

45 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్ పార్టీ యువజన విభాగానికి అధినేతగా ఉంటూనే పార్టీ పనులు క్షేత్రస్థాయిలో చక్కబెడుతుంటారు. ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా ఎక్కడా కనిపించవు కూడా. ఓ సామాన్య వ్యక్తిగా, పార్టీ కార్యకర్తగా ఆయన గడప గడపకూ నెలల తరబడి తిరిగి తాతకు తగ్గ మనవడు అనిపించుకునేలా ఇమేజ్ ను సొంతంగా నిర్మించుకున్నారు. స్టాలిన్ లా కేవలం తండ్రి పేరు చెప్పుకుని ఎదగకుండా స్వయంగా కేడర్ వద్దకు వెళ్లిన వ్యక్తిగా ఉదయనిధికి మంచి పేరుంది తమిళుల్లో. అటు ఢిల్లీలో స్టాలిన్ సోదరి కనిమొళి, మేనల్లుడు దయానిధి మారన్ లు ఉండి జాతీయ స్థాయిలో అవసరమైన విషయాలను చక్కబెడుతుండగా ఇక్కడ డీఎంకే రాజకీయ వారసత్వాన్ని ఉదయనిధికి కట్టబెడుతూ ఆయన్ను భవిష్యత్ సీఎంగా ట్రైన్ చేస్తున్నారు స్టాలిన్. ఏకైక సంతానమైన ఉదయనిధి, అల్లుడు చెప్పిన సలహాలు, సూచనలు తీసుకుంటూ స్టాలిన్ పరిపాలన చేస్తున్నారు. స్టాలిన్ పాలనపై పెద్దగా విమర్శలు లేకపోవటం అసలు విషయం. తన తండ్రి కరుణానిధికి పూర్తి భిన్నంగా స్టాలిన్ ప్రవర్తిస్తుండటం ఎవరికీ అంతు చిక్కటం లేదు.

ఇలా స్టాలిన్ పరిపాలన చేస్తూ అభిమానానికి పాత్రులు కావటం ప్రతిపక్ష పార్టీకి పెద్ద తలనొప్పులే తెచ్చిపెడుతోంది. స్టాలిన్ సర్కారు యావత్తూ అవినీతిలో మునిగిపోయిందని అన్నాడీఎంకే డిప్యుటీ జనరల్ సెక్రెటరీ ఎడపాడి కే పళనిస్వామి ఆరోపిస్తున్నారు. ఇలా అవినీతి దారిలో వచ్చిన భారీ బ్లాక్ మనీ మొత్తాలను స్టాలిన్ కుమారుడు, హీరో, ప్రొడ్యూసర్ కూడా అయిన ఉదయనిధి స్టాలిన్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా వైట్ మనీగా మార్చేసుకుంటున్నారని ఈపీఎస్ ఫైర్ అవుతున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సినిమాలను కొని వాటిని రిలీజ్ చేసే వ్యాపారంలో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో పవర్ సెంటర్లు చాలా ఉన్నాయని అవి ప్రస్తుతం నాలుగుకు చేరాయంటున్నారు పళనిస్వామి. దీంతో తమిళనాడులో నలుగురు సీఎంలున్నారని.. స్టాలిన్, ఆయన సతీమణి, కుమారుడు, అల్లుడు అందరూ సీఎంలుగా వెలిగిపోతున్నారన్నది ఈపీఎస్ ప్రధాన ఆరోపణ. అవినీతికి తలుపులు తెరిచిన స్టాలిన్ ఏకంగా కుమారుడికి మంత్రిగా పట్టాభిషేకం చేసి దందాను తారాస్థాయికి తీసుకెళ్తున్నారని ప్రతిపక్ష నేత ఈపీఎస్ చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. డీఎంకే కేవలం వారసత్వ రాజకీయాలే కాదు ఏకంగా ‘కార్పొరేట్ కంపెనీ’లా మారిపోయి డబ్బు లావాదేవీల్లో మునిగిపోయిందని ప్రతిపక్ష అన్నాడీఎంకే అనటాన్ని అధికార డీఎంకే కనీసం పట్టించుకోవటం లేదు. తమదైన రీతిలో పనులు చేసుకుంటూ పోతోంది స్టాలిన్ కుటుంబం.

తమిళనాడులో రాజకీయాల ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీల మృతితో కక్ష రాజకీయాలు కాస్త శాంతించాయి. అధికార డీఎంకే సైలెంట్ గా దూసుకుపోతూ ఉంటే మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకే మాత్రం తమలో తమకు ఐక్యత లేక పార్టీని కుక్కలు చింపిన విస్తరిలా చేసేస్తున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలుగా ఎప్పుడో చీలిపోయిన పార్టీపై ఎలాగోలా పట్టు సాధించే పనిలో శశికళ మునిగిపోయారు. ఇక మిగిలింది కమల్ హాసన్ పార్టీ అసలు ఆ పార్టీ ఉందో లేక పార్టీని మూసేశారో తెలియని అగమ్య గోచరంలో ఉంది. డీఎండీకే పార్టీ విషయానికి వస్తే.. పార్టీ అధినేత విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టగా ఆయన సతీమణి పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నా డీఎండీకే ప్రభావం మరింత ప్రాభవం కోల్పోయింది. ఈనేపథ్యంలో తమిళనాడులో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ తెగ కసరత్తులు చేస్తూ, కలలు కంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News