Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Teacher's day: ఉపాధ్యాయ వృత్తికే తలమానికం డా సర్వేపల్లి రాధాకృష్ణన్

Teacher’s day: ఉపాధ్యాయ వృత్తికే తలమానికం డా సర్వేపల్లి రాధాకృష్ణన్

సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు..

సెప్టెంబర్ 5వ తేదీ అనగానే మనదరికీ చటుక్కున గుర్తుకు వచ్చేది “టీచర్స్ డే” లేదా “ఉపాధ్యాయుల దినోత్సవం”. దేశవ్యాప్తంగా 1962 నుండి “టీచర్స్ డే”ను హర్షోల్లాసాల మధ్య పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1962లో భారత 2వ రాష్ట్రపతి (1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతి) బాధ్యతలు చేపట్టిన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన “ఉపాధ్యాయుల దినోత్సవం” జరుపుకోవడం వెనుక గల నేపథ్యం గురించి నేటి విద్యార్థులు తెలుసుకోవాలి. 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో విద్యార్థులు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవ్వగా, సెప్టెంబర్ 5న తన జన్మదినానికి బదులుగా విద్యార్థుల భవితవ్యాన్ని ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా తీర్చిదిద్దే గురువులందరికీ కృతజ్ఞతాభావం చాటుకునేలా “టీచర్స్ డే”గా నిర్వహించాలని ఆయన వారికి సూచించడంతో అప్పటి నుండి ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గొప్ప తత్వవేత్త, రచయిత మరియు స్వతంత్ర భారతదేశానికి రెండవ రాష్ట్రపతి. ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. భారత రాష్ట్రపతి పదవినలంకరించిన డా బాబూ రాజేంద్ర ప్రసాద్, డా సర్వేపల్లి రాధాకృష్ణన్, డా శంకర్ దయాళ్ శర్మ, డా అబ్దుల్ కలాం మరియు శ్రీమతి ద్రౌపది ముర్ము గతంలో ఉపాధ్యాయ వృత్తితో సంబంధం ఉన్న వారే కావడం విశేషం. తేదీలలో మార్పున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం పరిపాటి. సమాజాభ్యున్నతిలో ఉపాధ్యాయుల పాత్రకు గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న “యునెస్కో వరల్డ్ టీచర్స్ డే” జరుపుకుంటారు. ప్రతి విద్యార్థికి “ఉపాధ్యాయుల దినోత్సవం” జీవితంలోని అత్యంత మధురమైన జ్ఞాపకాలలో ఒకటి. ఏమాత్రం ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకుండా, వారి కోసం ప్రత్యేకంగా ఒక రోజును నిర్వహించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. తమకు ఇష్టమైన ఉపాధ్యాయుల హావభావాలను అనుకరించేందుకు రిహార్సల్స్ చేయడం, ఆలస్యంగా ఉండి అన్ని ఏర్పాట్లు చేయడం, తరగతి గదులను అందంగా అలంకరించడం లాంటివి అనుభవైక్యంగా మాత్రమే తెలుసుకోవాల్సిన విషయాలు.

- Advertisement -

డా రాధాకృష్ణన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు:
దేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా 1952 నుండి 1962 వరకు పదేళ్ళ పాటు సేవలందించిన ఆయన 1962లో దేశ 2వ రాష్ట్రపతి పదవినలంకరించి 1967 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన అత్యధికంగా పదహారు సార్లు నోబెల్ సాహితీ పురస్కారానికి మరియు పదకొండు సార్లు శాంతి పురస్కారానికి ప్రతిపాదింపబడ్డారు. 1948 ఆయన యునెస్కో కార్యనిర్వాహక మండలి (Executive Board) అధ్యక్షుడిగా అన్నుకోబడ్డారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఆయనను “సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్”గా మరియు స్వాతంత్ర్యానంతరం “డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్”గా సంబోధించబడే వారు. అత్యుత్తమ ప్రతిభ గల విద్యార్థిగా ఆయన విద్యార్థి జీవితమంతా ప్రతిభా పురస్కారాలు (మెరిట్ స్కాలర్‌షిప్‌లు) అందుకున్నారు. తొలుత వెల్లూరులోని వూర్హీస్ కాలేజీలో చేరిన ఆయాన ఆ తరువాత, తన 17 సంవత్సరాల వయస్సులో మద్రాసు క్రిస్టియన్ కాలేజీకి మారారు. 1906లో ఆయన తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి, ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. 1931లో ‘నైట్’ బిరుదు పొందిన నాటి నుండి స్వాతంత్ర్యం సాధించే వరకు “సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్”గా సంబోధించబడిన ఆయన స్వాతంత్ర్యానంతరం “డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌”గా పేరు తెచ్చుకున్నారు. ఆయన 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ గా, 1939 నుండి 1948 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ గా మరియు 1953-1962 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా ఉన్నారు. 1936లో, అతను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తూర్పు మతాలు మరియు నీతిశాస్త్రాల యొక్క స్పాల్డింగ్ ప్రొఫెసర్‌గా నియమించబడడంతో పాటు ఆల్ సోల్స్ కాలేజీకి ఫెలోగా కూడా ఎన్నికయ్యారు. భారత స్వాతంత్ర్యానికి పూర్వం 1946లో “రాజ్యాంగ సభ”కు ఎన్నికైన ఆయన ఆ తరువాత యునెస్కో మరియు మాస్కో (సోవియట్ యూనియన్)కు రాయబారిగా పనిచేశారు. ఆయనకు 1954లో ‘భారతరత్న’ మరియు 1961లో జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి బహుమతి లభించింది. 1963లో, అతను “ఆర్డర్ ఆఫ్ మెరిట్‌”ను మరియు 1975లో “విశ్వమానవాళి కోసం భగవంతుడు పంచిన ప్రేమతత్త్వం మరియు జ్ఞానం యొక్క విశ్వజనీన వాస్తవికత” అనే భావనను ప్రచారం చేసినందుకు ‘టెంపుల్టన్’ బహుమతిని కూడా అందుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సందర్భంగా ఆయనకు లభించిన మొత్తం నగదు పారితోషికాన్ని ఆయన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి విరాళంగా అందించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఆయన మైసూర్ విశ్వవిద్యాలయాన్ని వీడుతున్న సమయంలో అక్కడి విద్యార్థులు ఆయనను పూలతో అలంకరించిన క్యారేజ్‌లో రైల్వే స్టేషన్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారంటే ఆయన ఎంతగా వారి అభిమానం చూరగొన్నారో అర్థమవుతుంది. డా. రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్‌లను మరియు రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డును ప్రారంభించింది. అతను వృద్ధులు మరియు వెనుకబడిన తరగతుల వ్యక్తుల కోసం లాభాపేక్షలేని “హెల్పేజ్ ఇండియా”ను స్థాపించారు. ఆయన గురించి అంతగా ప్రాచుర్యం పొందని మరో విషయమేమిటంటే భారత రాష్ట్రపతిగా ఆయనకు లభించే రూ. 10,000 జీతంలో రూ. 2500 మాత్రమే స్వీకరించి మిగిలిన మొత్తాన్ని ప్రతి నెలా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా అందించేవారు. మూర్తీభవించిన జాతీయ భావాలు మరియు మహోన్నత విలువలతో జీవించిన ఆయన ఏప్రిల్ 17, 1975న తనువు చాలించారు.

ఆణిముత్యాలు:
“మనకు తెలుసు అని అనుకున్నప్పుడు, మనం నేర్చుకోవడం మానేస్తాము”, “జ్ఞానం మరియు సైన్స్ ఆధారంగా మాత్రమే ఆనందం మరియు సంతోషకరమైన జీవితం సాధ్యమవుతుంది”, “సహనం అనేది అనంతం యొక్క అక్షయతకు పరిమితమైన మనస్సు చెల్లించే నివాళి”, “జ్ఞానం మనకు శక్తిని ఇస్తే ప్రేమ మనకు సంపూర్ణతను ఇస్తుంది”, “పుస్తకాలు సంస్కృతుల మధ్య వారధి నిర్మించే సాధనాలు”, “మనందరి మదిలో జీవించే దేవుడు అనుభూతి చెందడం, బాధపడడం చేత సమయానుసారం మనందరిలో ఆయన లక్షణాలు, జ్ఞానం, అందం మరియు ప్రేమ బహిర్గతమవుతాయి”, “నిజమైన మతం ఒక విప్లవాత్మక శక్తి: ఇది అణచివేత మరియు అన్యాయాలకు శాశ్వత శత్రువు”, “మతం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, అది మన యొక్క ప్రవర్తనను వ్యక్తపరిచే అంశం” అని ఆయన ప్రవచించిన స్ఫూర్తివంతమైన పదాలు జీవితంలోని ప్రతి దశలోనూ ఉన్నత విద్యను అభ్యసించడానికి మరియు జ్ఞాన సముపార్జనకు ఎంతగానో ప్రేరణనిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రక్రియ. జీవితంలో డా సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి అత్యుత్తమ ఉపాధ్యాయుడి సాన్నిహిత్యం ఉంటే మన లోని విద్యార్థి ఎప్పటికీ వైఫల్యం చెందడు. “విద్యార్థి జీవితాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయుడు కానీ తరగతి కాదు” అని అలనాటి ప్రముఖ ఆంగ్ల రచయిత మైఖేల్ మోర్పుర్గో అన్న మాటలు అప్పటికీ ఇప్పటికీ అక్షరసత్యాలే. విద్య విలువను పెంపొందించడానికి తన జీవితమంతా అంకితం చేసి భారతీయ ఆలోచనాసరళిని పాశ్చాత్య విధానంలో విశ్లేషణాత్మకంగా వివరించడం ద్వారా భారతీయుల గౌరవాన్ని ఇనుమడింపచేసేందుకు అహరహం శ్రమించిన ఆ కృషీవలుడు డా సర్వేపల్లి రాధాకృష్ణన్ కు మనం ఆజన్మాంతం కృతజ్ఞతగా ఉండాలి.

దేశాధినేత ద్వారా ఉపాధ్యాయుడికి దక్కిన గౌరవం:
1996వ సంవత్సరంలో అప్పటి భారత రాష్ట్రపతి డా శంకర్ దయాళ్ శర్మ అధికారిక పర్యటన నిమిత్తం మస్కట్ సందర్శన సందర్భంగా ఎయిర్ ఇండియా విమానం మస్కట్‌ విమానాశ్రయంలో దిగినప్పుడు పలు అసాధారణ సంఘటనలు జరిగాయి. సాధారణంగా తమ దేశానికి విచ్చేసే ఏ విదేశీ ప్రముఖులకైనా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికే సాంప్రదాయం ఒమాన్ దేశంలో లేదు. అయినప్పటికీ ఆ సాంప్రదాయాలను పక్కనబెట్టి, ఒమాన్ సుల్తాన్ “ఖాబూస్ బిన్ సైద్” విమానాశ్రయానికి చేరుకొని విమానం ల్యాండ్ అవగానే మెట్లెక్కి విమానంలో కూర్చున్న భారత రాష్ట్రపతి డా శంకర్ దయాళ్ శర్మ వద్దకు వెళ్లి ఆయనను తోడ్కొని కిందకు దిగగా అక్కడ సిద్ధంగా ఉన్న కారు డ్రైవర్ తలుపు తెరిచి నిలబడగా, అతనిని పక్కకు తప్పుకోమని సౌంజ్ఞ చేసి డ్రైవర్ సీటులో స్వయంగా తానే కూర్చొని భారత రాష్ట్రపతిని అధికార వసతికి తీసుకువెళ్ళారు. ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన విస్తుపోయిన విలేకరులు ఆ తరువాత సుల్తాన్‌ను ఎందుకు ఇన్ని ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని ప్రశ్నించగా, “భారత రాష్ట్రపతిగా కాకుండా ఒకప్పటి నా ప్రొఫెసర్ గా మిస్టర్ శర్మను రిసీవ్ చేసుకోవడానికి నేను విమానాశ్రయానికి వెళ్లాను. నేను భారతదేశంలోని పూణేలో చదువుతున్నప్పుడు, డా శర్మ నా ప్రొఫెసర్” అని సుల్తాన్ సమాధానమిచ్చాడు, ఈ అరుదైన సంఘటన సమాజంలో ఒక ఉపాధ్యాయుడికి ఉండే గౌరవమర్యాదాలకు నిదర్శనంగా నిలుస్తుంది.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News