స్మార్ట్ ఫోన్ లు, టీనేజ్ ప్రేమలు, బైక్ రైడింగ్‌లు … ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులకు యుక్త వయసులో ఉన్న పిల్లలకు మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం కరోనా పుణ్యామాని ఆన్‌లైన్ తరగతులతో ప్రతి రోజూ స్మార్ట్ ఫోన్లతోటే గడుపుతున్నారు. తల్లిదండ్రులకు వీరికి మధ్య మాటల యుద్ధం, ఫోన్ల వల్ల పిల్లల చదువు మాట పక్కన పెడితే భవిష్యత్తు పాడైపోతుందని పెద్దల మనోవేదన అయితే, కాసేపు దానితో గడిపితే జీవితమే వృధా అయిపోయి నంతగా గొడవ చేస్తారెందుకని పిల్లలు వాదన. స్నేహితుల పుట్టిన రోజు పార్టీకి వెళ్లాలని టీనేజ్ పిల్లలు అడుగు తారు. రాత్రంతా పార్టీ పేరుతో లేనిపోని అలవాట్లకు బానిసలుగా మారిపోతారేమోననే భయంతో వద్దని తల్లిదండ్రులు వారిస్తే ఇక ఆరోజు నుంచి ఇంట్లో యుద్ధమే స్టార్ట్ అవుతుంది. భోజనం మానేసి, ఏదో బ్రహ్మాండం బద్దలు అయినట్లుగా మౌనంగా ఒక మూలాన కూర్చోవడం చేస్తారు.
పిల్లలు ఎప్పడికి చిన్నవయసులోనే ఉంటేనే బాటుంగుందని అనుకుంటారు అమ్మానాన్నలు. పిల్లల వయసు పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయనడంలో సందేహం లేదు. నిజమే టీనేజ్ పిల్లలతో మనస్పర్ధలు రావడం సహజమే. టీనేజ్ లో పిల్లలు వారు ఇలా ప్రవర్తించేందుకు కూడా చాలా కారణాలున్నాయి. పిల్లలు పెరుగుతూ పెద్దవాళ్లవుతున్నారంటే శారీరక మార్పులే కాక వారిలో మొదట కనిపించే మార్పు తల్లిదండ్రుల మాటలకు నో అనడం ప్రారంభిస్తారు. అది పిల్లల తప్పు కాదు అని గుర్తిం చాలి. నేను ఎదుగుతున్నాను, నాకు ఎన్నో విషయాలు తెలుస్తు న్నాయి, నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతాను అనే తత్వం అలవాడుతుంది. ఇలాంటి మార్పులన్నింటినీ చూసి ఏదో జరిగి పోతుంది, పిల్లలు పాడైపోతున్నారని ఆందోళన చెందడం, వారిపై అధికారంతో దాడిచేయడం సత్ఫలితాలను ఇవ్వదని, చాలా సున్నితంగా వారి మనసులకు దగ్గరగా మాట్లాడుతూ టీనేజ్ పిల్లలను మార్చుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
ఇంట్లో తల్లిదండ్రులు చెబుతున్న విషయాలకు, బయట ఉన్న ప్రపంచానికి, పిల్లలు పెరుగుతున్న పరిస్థితులు వారిని ఎన్నో రకాల ఆలోచనలను వారి మనసులో తొలుస్తుంటాయి. ఇటువంటి సందర్భంలో వారు మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. స్నేహితులు, సమాజంలో తన తోటివారు చేసే పనులు చేయాలా, తల్లిదండ్రులు కోరుకుంటున్న పనులు చేయాలో సతమతమవు తుంటారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కోరుకుంటున్న దానికి భిన్నంగా పిల్లల ప్రవర్తన కనిపిస్తుంది.
మైనారిటీ తీరని ప్రేమలు ఇటీవలికాలంలో ఎక్కువై పోయాయి. సినిమాల ప్రభావమో.. స్మార్ట్ ఫోన్‌ల ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో కానీ తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో (వ్యామోహంలో) పడి తొమ్మిది నెలలు మోసి కన్న తల్లిని ఇన్నాళ్ళు పెంచిని తండ్రిని కూడా లెక్క చేయడం లేదు. ఇటీవల పాఠశాల దశలోనే పిల్లల మధ్య ప్రేమల పేరుతో తిరుగుతున్నారు. ఛాటింగులు పెరిగి పోతున్నాయి. చదువుకునే వయసులో ప్రేమ, స్నేహం అంటూ అందమైన భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు.
వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటున్న మైనర్లు: మా అబ్బాయికి ఎంత చెప్పినా వినడం లేదు. మా అమ్మాయికి ప్రేమా వ్యా మోహాంలో పడిపోయింది. లేదు కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. ఎప్పుడు చాటింగ్‌లతో బీజి. అతను స్కూలు మానేసి ’స్మార్ట్ ఫోన్‌తో ఆటలు ఆడుతూ గడిపేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఇలాంటి సమస్యలు తల్లిదండ్రుల మధ్య కొనసాగుతూనే ఉన్నాయి. సమాజంలో మంచి పేరున్న తల్లిదండ్రుల బయటకు చెప్పుకోలేక లోలోపలనే కుమిలి కుమిలి వేదనతో నలిగిపోతున్న వారు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రుల కు మాత్రమే సమస్య కాదు ఇప్పుడు ఇదో సామాజిక సమస్యగా మారింది. కొంత అటు ఇటుగా చాలా కుటుంబాలలో మైనర్‌ల ప్రేమలు, సెల్‌ఫోన్ వ్యసనాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది పిల్లలు ఆకర్షణను, వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటున్నారు. హార్మోన్లలలో సమతుల్యత లోపించడం కారణంగా, తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపో వడం మూలంగానే ఇలా జరుగుతున్నాయి.
పిల్లలు సన్మార్గంలో నడవాలంటే ……
జనరేషన్ వ్యత్యాసం: పాత తరానికి, కొత్త తరానికి ఉన్న వ్యత్యాసంలో సామాజిక పరిస్థితుల్లో, జీవనశైలిలో వచ్చిన మార్పు లను తల్లిదండ్రులు గుర్తించాలి. అప్పుడు పిల్లలు చేసే ప్రతి పనీ విరుద్ధంగా చేస్తున్నారనే బావన తగ్గుతుంది. పిల్లలు చేసే పనులపై ప్రదర్శించే కోపాన్ని, వారిపై మీకున్న ప్రేమను విడివిడిగా చూడగలగాలి. తల్లిదండ్రులకు, టీనేజ్ పిల్లలకు మధ్య ఉన్న సంబం ధాలు మంచిగా ఉన్నంత వరకే పిల్లలకు మీ మాటపై వారికి గౌర వం, భక్తి, భయం ఉంటుంది. పాత తరం, ప్రస్తుత తరానికి ఉన్న పిల్లలకు కలిగే ఆలోచన విధానం, జీవనశైలి, అభిరుచుల్లో ఉన్న పిల్లల భవిష్యత్తుకు హాని చేయని మార్పులను అంగీకరించే ప్రయత్నం చేయాలి.
పాజిటివ్ దృక్పథం: పిల్లలు మాట్లాడే మాటలకు విలువనివ్వక నా కడుపున పుట్టిన నువ్వు నాకు చెప్పేంత మొనగాడి వయ్యావా అనే ఇలాంటి మాటలు పిల్లల మనోభావాల్ని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయి. పిల్లల అభిప్రాయాల్ని గౌరవిస్తూనే అందులో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో వాటివల్ల కలిగే అనర్థాలేంటో వివరించే ప్రయత్నం చేయాలి. ఇది పిల్లలకు మీ పట్ల ఉన్న పాజిటివ్ దృక్పథాన్ని అర్థం చేసుకుంటారు.
మానసిక పరివర్తన: టీనేజ్ పిల్లలు కోరుకుంటున్న స్వేచ్ఛ, వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు మానసిక పరివర్తనను సూచిస్తాయి. పిల్లల్ని నిర్దేశించడంలో, నియంత్రించడంలో, వారికి రక్షణ కల్పించడంలో, కాపాడుకునే ప్రయత్నం చేయటంలో సమతుల్యత కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
లక్ష్యం వైపుగా అడుగులు: టీనేజ్ వయసులోని పిల్లల్ని అదుపులో పెట్టడం అంటే రోజూ వాళ్లు చేసే పనుల పట్ల వ్యతిరేకత, బాధను వ్యక్తం చేయడం కాదు. వారి ప్రవర్తన గురించి ఎవరికి పడితే వాళ్లతో చెప్పడమూ కాదు. వాళ్లకు బాధ్యత కల్పించాలి. వాళ్లు ఏం చేస్తున్నారో అందులో విజేతలుగా నిలబడేందుకు అవసరమైన విషయాలు వారితో చర్చించాలి. ఒక్కసారి తల్లిదండ్రులుగా మీరు బాధ్యతను కలిగేలా చేస్తే ఆ తరువాత మీరిచ్చే స్వేచ్ఛను వాళ్లు ఏమాత్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. బాధ్యత లేని స్వేచ్చా వారి జీవితాన్ని ఎటైనా తీసుకువెళ్లచ్చు. బాధ్యతతో కూడిన స్వేచ్చా స్వాతంత్య్రం మాత్రం కోరుకున్న లక్ష్యం, గమ్యం వైపే అడుగులు వేయిస్తుంది.
స్నేహితులను ఇంటికి ఆహ్వానించండి: టీనేజీ పిల్లల స్నేహితుల్ని ఇంటికి రమ్మనాలి, స్నేహితుల ప్రవర్తనను తల్లిదండ్రులుగా గమనించి వారి ప్రభావం మీ పిల్లలపై ఎంతవరకు ఉంటుందో గుర్తించవచ్చు. స్నేహితులతో పిల్లల ప్రవర్తననూ దగ్గర్నుంచి గమనించవచ్చు. ఇలా ఇంటికి వాళ్ళ స్నేహితులను ఇంటికి పిలవడం వల్ల పిల్లల్లో మీ పట్ల స్నేహ భావాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తాయి.
ఆకర్షించే అంశాలు : మద్యం, డ్రైవింగ్, డ్రగ్స్, ఆకర్షణలు, సెక్స్…ఇవన్నీ టీనేజీ పిల్లలను ఆకర్షించే అంశాలు. వీటి వల్ల కలిగే పర్యవసానాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పటం తల్లిదండ్రుల బాధ్యత. వీటి గురించి నిస్సందేహంగా పిల్లలతో చర్చించాలి అనుమానాలను నివృత్తి చేయాలి.
కంటికి రెప్పలా కాపాడుకోవాలి: టీనేజర్లు స్వేచ్ఛాయుత ప్రపంచంలోనే వాళ్లని ఎదగనివ్వాలి. యుక్త వయసులో అడుగు పెట్టగానే ప్రత్యేక గుర్తింపు పొందాలని తహతహలాడిపోతూ ఉంటారు. తమకంటూ ఓ ఐడెంటిటీని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని, అందుకు తగిన స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలి. అలాగని చెడు స్నేహాలతో పక్కదారి పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండాలి: మైనర్ ఏజ్ 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఒకరంటే మరి ఒకరికి తెలియకుండానే ఆకర్షణ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు ఎప్పటికపుడు పిల్లల ప్రేమ వ్యవహారాలను తెలుసుకుంటూ వారితో స్నేహాంగా వ్యవహరించాలి. ఈ వయసులో అంతా రొమాంటిక్‌గా వుంటుంది. తేలికగా వీరు ఆకర్షణలకు లొంగిపోతారు. ఒక్కొకపుడు తప్పుదోవ పట్టేస్తారు. ఈ వయసు ఎంతో క్లిష్టమైంది. సరిగా వ్యవహరించకుంటే జీవితమంతా నష్టపోయే అవకాశాలు కూడా వుంటాయి. తల్లిదండ్రులు ఎదుగుతున్న బిడ్డకు స్నేహితుడుగా వ్యవహరించాలి. కోపం చేసి కేకలు పెట్టినందువలన ప్రయోజనం వుండదు.
కౌన్సెలింగ్ తప్పనిసరి: అమ్మాయిలకు అబ్బాయిలకు కౌన్సెలింగ్ తప్పని సరి. ఇప్పుడు సెల్‌ఫోన్ వ్యసనం సమాజానికి సమస్యగా తయారయ్యింది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరు సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నారు. వీటివల్ల మానసిక ఒత్తిడికి గురై కృంగిపోతున్నారు. ఇనాటి పిల్లలకు ఖచ్చితంగా కౌన్సెలింగ్ అవరం. మనిషి ప్రవర్తనలో మార్పు, లక్ష్యనిర్దేశం, లక్ష్యాన్ని సాధించాలనే కసి, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడం కౌన్సెలింగ్ వల్ల జరుగుతుంది.
తల్లిదండ్రులు పిల్లలతో అనుభవాలను పంచుకోండి: టీనేజ్ వయసులో భ్రమలు ఎక్కువగా వుంటాయి. మీ బిడ్డకు ప్రతివారు తనను నిజంగా ప్రేమించేవారుగా కనపడతారు. కాని ఈ భ్రమలు మోసపుచ్చుతాయి. కనుక తల్లితండ్రులు తప్పనిసరిగా ఈ వ్యవహారాలపట్ల జాగ్రత్త వహించాలి. ఈ వయసులో ఇవి సహజం. గట్టిగా వారికి చెపుతూ మీ టీనేజ్ అననుభవాలు వివరించండి. అవి పనిచేస్తాయి. టీన్స్ తేలికగా ప్రేమలో పడిపోతారు. మొదట నవ్వు గా మొదలై ఆ స్నేహం జీవితాంతం వుండిపోతుందనుకుంటారు. ఈ రకమైన నిర్ణయాలు వారి భవిష్యత్తు పునాదికి ప్రమాదకరం. పిల్లలతో వారు తమ అనుభవాలను తప్పిదాలను ఆ వయసులో జరిగిన వాటిని వివరించాలి.
- డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321