Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్అప్పుడేట్లుండె తెలంగాణ, ఇప్పుడెట్లుంది తెలంగాణ

అప్పుడేట్లుండె తెలంగాణ, ఇప్పుడెట్లుంది తెలంగాణ

10 ఏళ్ల పాలన..

పదేండ్లలో తెలంగాణ గతినే మార్చివేసిన సీఎం కేసీఆర్. ఈ పదేండ్లు వెనక్కి తొంగి చూస్తే గతమేంది వర్తమానం ఏంది ఆలోచన వేయకమానదు. నాటి నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే వరకు తెలంగాణ పరిస్థితి, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. కరువు, కాటకాలు, సాగు, తాగునీటి గోస, కరెంటు కోతలు, కాలం కలిసి రాకపోవడంతో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమై అల్లకల్లోలం , అరిగోస పడ్డాం. తెలంగాణలో ఏ మూల చూసినా రైతన్నల ఆర్ధనాధాల దృశ్యాలు కనిపించాయి. తలాపున పారుతున్న గోదారి పారిన మన బతుకు ఎడారిలా ఉండేది. తెలంగాణ నాటి బతుకు వ్యధ చిత్రం దుర్భరంగా ఉండేవి.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో నేడు
సాగునీళ్లకు కొదవ లేదు. కరెంట్ కోతలు లేవు. పెట్టుబడికి ఇబ్బంది లేదు. మండుటెండల్లో మత్తడులు దుంకుతున్నాయి. మన తలాపునే నిండుకుండలా జలాశయాలు ఉన్నాయి. చెరువులు, కుంటలు వాగులు వంకలు నదులు అన్ని జలకళలాడుతున్నాయి. దండిగా ఎవసం. నిండుగా పసిడి పంటల రాశులు.
తెలంగాణ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందంటే ఇదంతా రైతు బిడ్డ సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలకు నిదర్శనం. పదేండ్లలో సీఎం కేసీఆర్ తీసుకున్న రైతు సంక్షేమ పథకాలతో ఎవసం పండుగ చేసుకుంటున్నాం.

స్వరాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ నిర్ణయాలతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. పంట పండిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా కొనుగోళ్లు చేయడంతో రైతుల్లో భరోసా నింపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల వల్ల అరిగోస పడ్డ రైతన్నలు. తెలంగాణ రైతులకు సాగునీటి వసతి కల్పించకపోవడంతో వర్షాధారంగా, బోరు బావుల ఆధారంగా వ్యవసాయం భారంగా సాగేది. పెట్టుబడుల కోసం నిరుపేద రైతుల బాధలు అంతా ఇంతా కాదు.. తెలంగాణలో నూటికి 95 శాతం చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులే ఉండటంతో వారికి వ్యవసాయంతో ఆముదాని తక్కువే. వ్యవసాయమే ఆధారం కావడంతో సాగు చేస్తేనే.. పంట పండుతేనే.. జీవితాలు బాగుండేవి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడుల కోసం.. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం, రైతుల దయనీయ జీవితాలు పల్లె పల్లెన కనిపించేవి. వర్షపు నీరే సాగుకు దిక్కు.. కరెంట్ కోతలు..ఎరువుల కోసం, విత్తనాల ఇబ్బందులు. మా జీవితాలు ఇంతే అంటూ బిక్కు బిక్కుమంటూ జీవితాలు వెల్లదీసేవారు.

సిఎం కేసీఆర్ నాయకత్వంలో ఆనాటి బాధలన్ని తొలగిపోయాయి. తెలంగాణ ఎటు చూసినా నీళ్ళ అలికిడి వినిపిస్తుంది. తెలంగాణ వస్తేనే సాగు నీళ్లోస్తాయి. రైతులు జీవితాలు మారుతాయని ఉద్యమ సమయంలో చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో చేసి చూపించారు. రైతన్న జీవితంలో వెలుగులు నింపారు. చీకట్ల నుండి తెలంగాణను వెలుగులోకి తెచ్చారు. కరెంటు, మిషన్ కాకతీయ ద్వారా చెరువు, కుంటల పునరుద్ధరణ, శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం పెట్టుబడి సాయం క్రింద రైతు బంధు ద్వారా ఖరీఫ్, రబీ పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.10వేలు అందించడంతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.రైతు బంధు ద్వారా రైతన్నకు వెన్నెముక లా నిలిచారు కేసీఆర్.

రాజకీయాల్లో ఎన్నో చెప్తుంటారు కానీ సీఎం కేసీఆర్ లెక్క ఎవ్వరూ కూడా తమకు అండగా నిలబడటం లేదని రైతులు అంటున్నారు. మరోసారి రైతులకు భరోసా ఇచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో తెలంగాణ సిఎం కేసీఆర్ రైతు బంధు ద్వారా 65 లక్షల మంది రైతులకు 72 వేల కోట్ల రూపాయలు అందించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తూ వెన్నుదన్నుగా నిలిచారు.36 వేల కోట్లతో నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయ రంగానికి ఉచితంగా అందిస్తుంది.

వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం. కోటి ఎకరాలకు పంట సాగు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. తెలంగాణలో అన్ని పంటలు కలిపి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరింది. 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పంట సాగు విస్తరణ పెరిగింది. పండించిన ధాన్యాన్ని కొనుగోలుకు 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది.

రైతు బీమాతో ధీమా
నాడు రైతన్నల కష్టాలు చెప్పనలవి కావు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో అప్పులు కుప్పలుగా మారి రైతులు అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకోవడం నాడు సాధారణంగా ఉండేది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆనాటి ప్రభుత్వం రూ.1.50 లక్షల పరిహారం అందించడానికి నానా కొర్రీలు పెట్టడంతో వందకు ఒక్కరికి కూడా పరిహారం అందడం గగనంగా ఉండేది. వేల మంది రైతు ఆత్మహత్యలను పట్టించుకోలేదు. నేడు సీఎం కేసీఆర్ రైతు కుటుంబాలకు అండగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభించి 5 లక్షల భీమా తెచ్చి రైతుకు, రైతు కుటుంబానికి ధీమాగా నిలిచాడు. మళ్ళీ అధికారంలోకి రాగానే రైతు బంధు తరహాలో రాష్ట్రంలోని 93 లక్షల మంది కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ 5 లక్షల భీమా సౌకర్యం కల్పిస్తమని కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి కేసీఆర్ ధీమా ప్రకటించారు.

నూతన రెవెన్యూ చట్టంతో ధరణి పోర్టల్ ద్వారా కష్టాలు తీరాయి. ఒకప్పుడు రైతుల పట్టా పాస్ బుక్ కష్టాలు అంతా ఇంతా కావు. కాగితాలలో ఎక్కువ భూమి, కాస్తులో తక్కువ భూమి.. ఇలా ఎన్నో భూసమస్యలు రైతుల జీవితాల్లో కష్టాలు రాజేసాయి. నేడు ధరణి పోర్టల్ ద్వారా రైతులు స్వంత మండలంలోనే మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని మరునాడు తహశీల్ కార్యాలయంలో నయాపైసా ఖర్చు లేకుండా పట్టా చేసుకునే వీలు కలిగింది. కానీ కాంగ్రెస్ పాలన వస్తె ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అంటున్నరు. అంటే రైతుకు మళ్ళీ ఉరి తాడు పెనుతున్నట్లే. ధరణి ఉంటేనే రైతుకు భరోసా ఉంటుంది.

ఇలా ఎన్నో అనుమానాల నుండి దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. దేశంలో ఓకే ఒక్క రాష్ట్రం తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతులకు అండగా నిలచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం, సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని పైకి తెచ్చారు. సమ్మిళిత, సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి, రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. భూ సంస్కరణలు, నీరు, మార్కెటింగ్, పెట్టు బడి సాయం, భీమా, ఉత్పత్తి వంటి వసతులను కల్పిస్తుంది. ఇటీవల పొడు భూముల సమస్య పరిష్కారం చేశారు రైతాంగ అభివృద్దికి సంక్షేమానికి ఉన్న ప్రతి అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానంలో అమలు చేస్తున్నరు.
పాడి పరిశ్రమ, ఉపాధి రంగాల్లో అభివృద్ది సంక్షేమం కోసం పాటు పడుతుంది. సమ్మిళిత వ్యవసాయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. వ్యవసాయ విప్లవం, జల విప్లవం, విద్యుత్ విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, మార్కెటింగ్ , ఉత్పాదిక, వంటి అనేక రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. మరో పక్క మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందుతుంది. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఇంకో పక్క ఐటి రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఇటు ప్రభుత్వం గత పదేండ్లలో 2 లక్షల 30 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఇందులో 90 వేల ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది. ప్రతి పల్లె, పట్టణం ప్రగతి పథంలో ముందుకు దూసుకు పోతున్నది.

ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలను మెరుగు పరుస్తున్నాయి. రైతు బంధు, దళిత బంధు, చేనేత బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, గృహ లక్ష్మి, ఆసరా పింఛన్లు వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి. దీంతో పాటు ఈ ఎన్నికల సందర్భంగా సిఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిపెస్టో తెలంగాణకు కేసీఆర్ ధీమా.
బీ ఆర్ ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిపోస్టో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా ఉంది.

కేసీఆర్ బీమా- ఇంటింటికి ధీమా అన్న స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని రైతు బంధు తరహాలో 94 లక్షల కుటుంబాలకు 5లక్షల బీమా పధకం అమలు చేస్తామని ప్రకటించారు. మహిళలకు 3 వేల గౌరవ భృతి, రూ.400 కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ స్కీమ్ ను 15 లక్షలకు పెంచుతామని చెప్పారు. రైతు బంధు పథకం కింద ఇంతవరకు ఎకరాకు 10 వేల రూపాయలు చొప్పున ఇస్తుండగా, దానిని 16 వేలకు తీసుకు వెళతామని తెలిపారు. ఆసరా పింఛన్లు 5వేలకు, దివ్యాంగుల కు 6 వేలు , అగ్రవర్ణ పేదలకు కూడా గురుకుల పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలో పెడతామని కొత్తగా కేసీఆర్ ఇస్తున్న హామీల పట్ల ప్రజలు, మహిళలు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

అరవై ఏండ్లకు పైగా పాలన చేసిన నాయకులకు తెలంగాణ రైతుల, ప్రజల కష్టాలు కనిపించవు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెల్లగ అయిన తెలంగాణ మీద, సీఎం కేసీఆర్ పాలన మీద ఈర్ష ద్వేషాలతో కుట్రలు పన్నుతున్నారు. కేసీఆర్ ను పడగొట్టి అధికారంలో కూసుందామని కలలు కంటున్నారు. పోరాటం, త్యాగం గుర్తు చేసుకుంటాం. పునర్నిర్మాణంలో తెలంగాణ సాధించిన విజయాలు చెప్పుకుంటాం. నిత్యం ప్రజలతో మమేకమైన వారికి ఎప్పుడు తిరుగు ఉండదు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నరు.

చిటుకుల మైసారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, వ్యాసకర్త. సెల్: 9490524724

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News