Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Telangana model is Best model: తెలంగాణ మోడలే దేశానికి శరణ్యం

Telangana model is Best model: తెలంగాణ మోడలే దేశానికి శరణ్యం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ రంగాలలో తెలంగాణ ప్రగతిని నిష్పక్షపాతంగా బేరీజు వేసినప్పుడు, ఈదశాబ్ద కాలంలో దేశంలో గుజరాత్‌ మోడల్‌కు దీటుగా తెలంగాణ మోడల్‌ ఒకటి ఏర్పడిందని, దేశానికి ఇదే మోడల్‌ శరణ్యం కాబోతోందని అర్థమవుతుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అటు సంక్షేమంలోనే కాకుండా ఇటు అభివృద్ధిలో సైతం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా పురోగతి సాధించిందనే వాస్తవం కళ్లకు కడుతుంది. అభివృద్ధి, సంక్షేమం పోటాపోటీగా ముందుకు దూసుకుపోవడం వల్లే ఇది తెలంగాణ మోడల్‌గాస్థిరపడింది. నిజానికి, తెలంగాణ ఉద్యమ నేతకేసీఆర్‌ నాయకత్వంలో2014 జూన్‌ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతిపక్షాలు, దిన పత్రికలు, ఇతర సమాచార సాధనాలు ఆయనను తేలికగా తీసిపారేయడం జరిగింది. ఆయన పాలనలో విద్యుత్‌ ఉత్పత్తి ఉండదని, అంతరాయాలు, విరామాలు లేకుండా విద్యుత్‌ పంపిణీ జరగదని, విద్యుత్‌ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని, పరిశ్రమలు, కర్మాగారాలు మూతబడడం ఖాయమని, నీటి చుక్క అందడం గగనమని, నిరుద్యోగ సమస్య కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతుందని, ఆయనను నమ్మి రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, కొత్త కంపెనీలు రావడం జరిగే పని కాదని రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆయన మీద ప్రజల్లో విపరీతంగా అపనమ్మకం పెరగడానికి ప్రతిపక్షాలు శాయశక్తులా ప్రయత్నించాయి. అయితే, అందరి అంచనాలను, దుష్ప్రచారాలను తారుమారు చేస్తూ, ఆయన ప్రభుత్వ ప్రస్థానం ప్రగతి పథంలో దూసుకు పోవడానికి ఎంతో కాలం పట్టలేదు. పదేళ్లు గడిచేసరికి(2022 డిసెంబర్‌ నాటికి)ఆయన ప్రభుత్వ ప్రగతి నివేదిక జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక నిపుణుల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
ప్రస్తుతం ఉద్యోగాల సృష్టిలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్‌. ఆరోగ్యంలో, విద్యలో, పన్నుల వసూళ్లలో, సంక్షేమంలో, అభివృద్ధిలో అన్నిటా ఆయన సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రమే మొదటి స్థానం ఆక్రమిస్తోంది. ఇది రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన ర్యాంకు లేదా స్థానం కాదు. ఇది సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన ర్యాంకు. ఒకప్పుడు ‘గుజరాత్‌ మోడల్‌’ను అనుసరించిన రాష్ట్రాలు ఇప్పుడు ‘తెలంగాణ మోడల్‌’ను అనుసరిస్తున్నాయంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం అమలు చేసేవన్నీ వినూత్న పథకాలే. రూపొందిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలు, ప్రవేశపెడుతున్న పథకాలు వగైరాలన్నీ దేశానికి తలమానికంగా ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలే కాకుండా, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు సైతం పథక రచనలో ఆయన మార్గాన్నే అనుసరిస్తున్నాయంటే అందులో అతిశయోక్తేమీ లేదు. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ వంటివారు ‘తెలంగాణ మోడల్‌’ గురించి పదే పదే ప్రస్తావించడమే కాకుండా, “దేశ నిర్మాణంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాత్ర తిరుగులేనిది’ అంటూ తరచూ వ్యాఖ్యానించడం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన మాటలు.
ఆయన సారథ్యంలో తెలంగాణ ముఖ చిత్రం ఆయేటికాయేడు అతి వేగంగా మారిపోతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి దేశ, విదేశీ పెట్టుబడులు వరదల్లా ప్రవహిస్తున్నాయి. భాగ్య నగరం ఆయన హయాంలో బెంగళూరు, ముంబై నగరాలనే కాదు, సిలికాన్‌ వ్యాలీని కూడా మించిపోయింది. ‘కలల నగరం’గా ఇదివరకు ముంబై, బెంగళూరు నగరాలకు ఉన్న పేరు ఇప్పుడు హైదరాబాద్‌ నగరానికి బదలీ అయింది. ఒక్క ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐ.టి) రంగంలోనే కాదు, ఇతరత్రా అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా దూసుకుపోతోందని తేటతెల్లమైంది. వివిధ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా సమాన పీట వేస్తూ, సమాన ప్రాధాన్యం ఇస్తూ ఈ రెండు కీలక అంశాలకు సంబంధించినంత వరకూ ఎక్కడా ఎవరూ వేలు పెట్టి చూపించనవసరం లేకుండా తెలంగాణలో కేసీఆర్‌ పాలన సాగుతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని కొద్ది కాలం క్రితం రాష్ట్రాన్ని సందర్శించిన నెదర్లాండ్‌ పార్లమెంట్‌ సభ్యుల బృందం కూడా వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ముస్లింలు, క్రైస్తవులు, మహిళలు, శిశువులు, వ్యవసాయం, కార్మికులు, ఉద్యోగులు, రైతుల సంక్షేమంలో దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణ రాష్ట్రం గురించి పలుమార్లు కేంద్ర మంత్రులు సైతం పార్లమెంట్‌లోనే కితాబు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నేటి రాష్ట్రావతరణ దినోత్సవంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న దశాబ్ది ఉత్సవాలు కూడాఆసక్తిదాయంగా మారాయనడంలో సందేహం లేదు.

- Advertisement -

రాజసుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News