Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Village life: పల్లె జీవన సౌందర్యం మాఘం

Village life: పల్లె జీవన సౌందర్యం మాఘం

మాఘం తెలంగాణలో జాతరల మాసం

తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలోని జాతరలన్ని జానపదుల జీవన విధానానికి, విశ్వాసాలకు ధార్మిక జీవనానికి అద్దం పడతాయి. తెలంగాణ పల్లెల్లో ప్రతి ఏడాది సంక్రాంతి తరవాత మాఘమాసం నుండి పెద్ద ఎత్తున జాతరలు జరుగుతుంటాయి. తెలంగాణలో ఏ జాతరైన ప్రకృతి సౌందర్యం ఒడిన వాగులు, వంకలు, గుట్టలు, పచ్చని ప్రకృతిలో, నది తీరాన వెలిసిన దేవుళ్ళతో జాతర్లు జరుగుతుంటాయి. నాగోబా జాతర, గొల్లగట్టు జాతర, సమ్మక్క సారక్క జాతర, కొండగట్టు జాతర, కొమురవెల్లి జాతర, ఏడుపాయల జాతర, అయినవోలు జాతర, గంగమ్మ జాతర, సింగరాయ కొండ జాతర,
చెరువుగట్టు జాతర, పుల్లూరు బండ జాతర, కూడవెల్లి రామలింగేశ్వర జాతర వంటివి తెలంగాణలో అనేక చోట్ల చాలా జాతరలు జరుగుతుంటాయి. ఒక్కొక్క జాతర మధురమైన అనుభూతి ఇస్తుంది. దైవారాధనా, ఆధ్యాత్మిక జానపద జీవన విశ్వాసం జనంతో పెనవేసుకుంటాయి. ఈ మాఘ మాసం నుండి రెండు నెలలు జాతరలు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో జరుగుతాయి. ప్రకృతి అందాల మద్య కొండ కోనల్లో వెలిసిన దేవతమూర్తులను దర్శించుకోవడం కోసం అనేక ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తారు.

- Advertisement -

తెలంగాణలో ఏ జాతరకు వెళ్లిన ఎంతో కోలాహలంగా జరుగుతుంటాయి. ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిల్, కార్లు, ఆటోలు, కాలి నడకన చుట్టూర ఊర్లకు ఊర్లె తరలి వచ్చి జాతర వైభవాన్ని కనుల నిండా నింపుకుని, సంతోష సంబరాలు జరుపుకుంటారు. ఎక్కడేక్కడో దూరం ప్రాంతాల నుండి వచ్చే చుట్టాలు, ఆత్మీయులు, దోస్తులు ఒక్కచోట కలిసినట్లు జాతరలో కలుసుకొని మంచి చెడులను, చిన్ననాటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. కొన్ని జాతర్లు ఒక రోజు మరికొన్ని రెండు, మూడు ఐదు రోజుల పాటు జాతర సంబురాలు జరుగుతాయి.. కొందరు ఎక్కువ రోజులు జరిగే జాతర వద్దకు వంట సామానుతో వస్తారు.. దైవ దర్శనం చేసుకొని జాతర అంత తిరుగుతూ సంతోషాన్ని హృదయంలో నింపుకుంటూ చీకటి పడగానే మళ్లీ ఇంటిదారి పడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జాతర సంతోషం ముచ్చట్లను తలుచుకుంటు వచ్చే ఏడాది జాతరకు ముస్తాబై వెళ్లాలని సంతోషపడతారు.

అతిపెద్ద జాతర మేడారం. మేడారం సమ్మక సారలమ్మ జాతర గిరిజన, ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింభం. ఈ సారి జరిగే మేడారం జాతరకు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి సీతక్క దగ్గరుండి మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణలోని దేవాలయాలు, జాతర ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటక కేంద్రాలుగా గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కృషి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దేవాలయాల, జాతర ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి.

అటు ఏడు పాయల జాతర మహా శివరాత్రి నుండి ఘనంగా ప్రారంభం కానుంది. మాఘమాసం రోజున సిద్దిపేట పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి జాతర, కూడవెళ్లి శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అనేక జాతరలు జరగనున్నాయి.. ఎములాడ రాజన్న, కొమురెల్లి మల్లన్న జాతర, ఐనవోలు జాతర, కొత్తకొండ, గంగమ్మ జాతర, ఏడుపాయల, వేలాల జాతర, గద్వాల్, మల్డకల్ జాతర, మాన్యంకొండ జాతర, కేతికి సంగమేశ్వర జాతర, మునీశ్వరులు జాతర, అడవి దేవునిపల్లి జాతర వంటి అనేక ముఖ్యమైన జాతర్లు ఈ మాఘమాసం నుండి పారంభమవుతాయి.

తెలంగాణలో ఎక్కడ చూసినా జాతర్ల పండుగలతో భక్త జనం కోలాహలంగా మారనుంది..తాతల కాలంలో జాతరకు పోవాలంటే కచ్చరాల బండ్ల మీద పోయేవారు, నాయనల కాలం ఎడ్ల బండ్ల మీద పోదురు. ఎడ్లను మంచిగా కడిగి కొమ్ములకు పసుపు నూనె రాసి బంతి పూల దండలు, గల్లు గల్లుమనే గంటలు ఎడ్ల మెడలో కట్టి, బండికి బంతి పూలతో అలంకరించి బండి కొయ్యల పై నుండి అటు రంగుల చీరలు నీడనిచ్చే విదంగా ముస్తాబు చేసి ఒకటేనక ఒక్కటి ఊర్లోని బండ్ల మీద జనం జాతరకు పోదురు, ఇప్పటికీ కూడా ఎడ్ల బండ్లు కట్టుకుని జాతరకు వెలుతారు.. కొందరు కాలినడకన, సైకిళ్ల మీద పోదురు.. అమ్మ, బాపు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, చుట్టాలు, దోస్తులు జాతర చేరుకుందురు.. ఇక జాతర పోయినంక ఆ సంతోషం వేరు.. దైవ దర్శనం చేసుకొని జాతరంత కలియ తిరుగుతూ రంగుల రాట్నం, గుర్రాల రాట్నం మీద ఎక్కుదురు. పచ్చిసా పేర్లు మెడలో వేసుకుని సప్పరిస్తూ గరం గరం జిలేబి తింటూ, మిర్చి కొనుక్కుని తినడం. ప్యాలల ప్రసాదం చిరుతిళ్లు తింటూ, రికార్డు డాన్స్ డ్రామా ఆర్టిస్టులు నృత్యాలు చేస్తుంటే యువకులు కేరింతలు, కేకలు జాతర ప్రాంతం మారుమోగుతుంటాయి.

ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి వంటి హీరోలు సినీమా పాటలతో ప్రదర్శనలు జరుగుతుంటే ఒక్కటే యువత హంగామా ఉండు. వీటితోపాటు జానపదుల ఆటపాటలు, రాముడు, కృష్ణుడు వేషధారణలతో కళాకారుల ప్రదర్శన. సర్కస్ లో జంతువులు విన్యాసాలు, పెద్ద డ్రమ్ములో యువకుల బైక్ గిర్రున తిప్పటం వంటి ఎన్నో అద్భుతమైన సాహస విన్యాసాలు కన్పిస్తుంటాయి..

మహిళలు కూడా జాతరను చుట్టేస్తూ వారికి నచ్చిన గాజులు వేసుకుంటారు. తీరైన బొమ్మలు, దేవుళ్ల ఫొటోలు కొనుకుంటారు. జాతరలో ఫొటోలు దిగుతారు. అక్కడ హీరోల పక్కన నిలబడి ఫొటోలు దిగితే అచ్చం హీరోతో కలిసిపోయి ఫొటో దిగినట్టు ఉంటది. దిగిన ఫొటోలు ప్రేమ్ కట్టించుకున్న సందర్భాలు అనేకం.. ఇక తిరిగి తిరిగి అలిసి పోయి వాగుల చెలిమే తోడి నీళ్లు తాగడం… చెప్పుకుంటపోతే జాతరతో జనం అనుబంధం అంతా ఇంతా కాదు.ఆ సంతోషం, ఆ అనుబంధం, ఆత్మీయత తెలంగాణ పల్లెలోని ప్రతి ఒక్కరికీ కూడా మాఘమాసం ఇస్తుంది. సిద్ధిపేట జిల్లాలో కూడా ఈ సమయంలో కొమురవెల్లి మల్లన్న జాతర, ఐనవోలు, కూడవెళ్లి రామలింగేశ్వర స్వామి తీర్థం, అల్వాల వాగుల తీర్థం, పుల్లూరు బండ తీర్ధం, కొహెడ సింగారాయ కొండ జాతర ఎంతో వైభవంగా జరుగుతాయి. జానపదంతో జాలువాలే జన జీవన స్రవంతి తెలంగాణ జాతరలు.

చిటుకుల మైసారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, వ్యాసకర్త. సెల్:9490524724


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News