తెలుగు సాహిత్యం ఒక అనంత సముద్రం. ఈ సముద్రంలో కథలు అనేవి అలలులాగా ఆటలాడుతూ, మనసులను తాకుతూ ఉంటాయి. కథలు మన జీవితాలకు అద్దం వంటివి. మన చుట్టూ జరిగే సంఘటనలు, మన మనోభావాలు, మన ఆశలు, ఆకాంక్షలు అన్నీ కథలలో ప్రతిబింబిస్తాయి. కథలు మన జీవితానికి అద్దం వంటివి. మనం ఎదుర్కొనే సమస్యలు, ఆనందాలు, బాధలు అన్నీ కథలలో చూడవచ్చు. కథలు మన మనోవికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం కథలను చదువుతున్నప్పుడు, మన మనస్సు వివిధ రకాల భావాలను అనుభవిస్తుంది. కథల ద్వారా మనం ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. కథలలోని పాత్రలను అనుకరిస్తూ, మనం మంచి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవచ్చు. ఇలాంటి మనసులను మెచ్చే మనసుకు నచ్చే కథలను మనకు అందించారు ప్రముఖ డాక్టర్ అంజని. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ తన జీవితకాలంలో జీవన గమనములో జరిగిన అనేక అంశాలను మనసుకు అతుక్కునేలా కథలు రూపంలో మనకు అందించారు. ప్రతి ఒక్క కథ నిజంగా మన ఇంట్లో మన జీవితంలో మన చుట్టూ జరుగుతున్నట్టు అనిపించేలా కనిపించేలా అత్యంత సులభమైన తెలుగు భాషలో మనసుకు అతుక్కునేలా రచించారు “కథల అర”
“మదినిండిన గది”ఔను కులమతాల తేడాలు లేని గది. ధనిక బీదా అంచనాలు వేయని గది. అందాల భరణకానీ, అనాకారి కానీ, మాటకారీ కానీ, మూగ కానీ, ఎవరికైనా ప్రసూతి బాధ ఒకటే! ప్రసవ వేదనను సంతోషంగా మలచటం గురించే నా ఏకాగ్రత.”ఆ గది నా మది వదలదే! నా మది ఆ గది నుండి కదలదే! అంటూ నిజాన్ని వాస్తవాన్ని చక్కనైన కథ రూపంలో మలిచిన తీరు నిజంగా మనసులను ఆకట్టుకుంటుంది. కోరిక అనే కథలో మేఘమాల మా ఇంట్లో పనికి వచ్చి ఇవాల్టికి పదేళ్లు పూర్తయ్యాయి. మేఘమాల ముందుగా పరిచయం అయ్యుంటే దానికి బాల్య వివాహం రద్దు చేయించి ఉండేదాన్ని. నా దగ్గరికి వచ్చేవరకు పది హేనేళ్ల పిల్ల. మూడు నెలల గర్భిణీ. దాని ఇద్దరు పిల్లలూ నా చేతులోనే మా హాస్పటల్ లోనే పుట్టారు. పిల్లలతో పాటు అది పెద్దయింది. అలుపు లేకుండా అది పనిచేయటం, అలసట రాకుండా నేను చూసుకోవటంతో గడిచిపోయాయి. మేఘమాల ఈరోజు ఒక “కోరిక” కోరింది. విన్న నాకు చాలా ఆశ్చర్యమేసింది. తనకు నచ్చిన పనిలోకి తాను వెళ్ళింది. ఆ పనితనంలో మేఘమంత ఎత్తు ఎదిగింది. నా ఆసుపత్రిలోనే! ఆ ఎత్తు నుంచి నన్ను చూసింది! ఆ మేఘం నా మనసుపై ఆనందాన్ని, విషాదాన్ని వర్షించింది! ఈ కథలో మానవత్వం సామాజిక స్పృహ రెండింటిని మేలవించి డాక్టర్ అంజని తన జీవితంలో జరిగిన వాస్తవికతను కథగా మలిచారు. “నిజానికి పసి అద్దం”ఇంటర్ కమ్ మోగింది.. మళ్లొక సృష్టికి పిలుపు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రసూతి గది తలుపు తట్టింది డాక్టర్. పెద్ద విస్పోటనం.. ఉమ్మనీరు చిమ్మింది… పుట్టిన పిల్లను స్వరూపకు చూపించింది. స్వరూప మౌనం భయపెడుతున్నది. బి.పి. చూడు అని సిస్టర్ ను కంగారు పెట్టింది. అంతా నార్మల్ మేడమ్. బేబి కూడా బాగుంది. 24 గంటలు కాలేదు, ఆ సంతోషానికి అడ్డు కట్ట పడటానికి. రెండో రోజు పొద్దున్నే ఆయా ఊరుకుంటూ వచ్చి… అమ్మా..! స్వరూప బిడ్డ నీలంగా అయ్యింది. అంతా అయిపోయింది డాక్టరమ్మా! పాలు తాగుతూ పోయిందంటున్నారు. యాస్పిరేషన్ డెత్? విరక్తిగా వెనక్కి తిరిగింది వనిత. కాన్సిక్వెన్సెస్ ఏమిటి అని ఆలోచిస్తూ… నెల గడిచింది. ఒకరోజు ఓ.పి. ఆయా వచ్చి “స్వరూప భర్త వచ్చాడు మాట్లాడతాడట” అంది. స్వరూప భర్త ఎంకన్న చెప్పిన విషయానికి చాలా ఆశ్చర్యపోయింది. అసలు మీ అతే చేసిందని మీకెలా తెలుసు? అడిగింది వనిత. ఇదిగో నా ఎడపిల్ల సాక్ష్యం! డాక్టర్ నివ్వెరపోయింది. ‘సాక్షి’ఐదేళ్ల పిల్ల. కళ్ళు, చేతులు తిప్పుతూ, ఆగి ఆగి మాట్లాడుతూ ఆ దృశ్యాన్ని వివరించింది. ఈ కథలో గుండె తరుక్కుపోయే విషయాన్ని చదివితే కన్నీళ్లు ఆగవు. “అమ్మ ఆత్మ శాంతి”! కథలో నా పిల్లలు చిన్న వాళ్లు. తండ్రి లేడు, ఆర్థికంగా ఎదగలేదు, నీవైనా నాకో చిన్నగది కట్టించయ్య. మా అమ్మమ్మ అల్లుడిని అడిగింది.ఆ అల్లుడు ఎన్నో రకాలుగా అత్తగారికి రుణపడి ఉన్నాడు.
అందరూ సలహాలు పాటించి, బెంగళూరు పెంకు కప్పు మొదలు పెట్టించారు. సగం కప్పు వేయగానే గోడలు కూలినవి తలబరువై, పునాది బక్కదై, అడ్డం పెట్టుకొని, వంట వడ్డనం చేసింది అమ్మమ్మ. మళ్లీ ఇల్లు మార్పులు చేసి, గృహప్రవేశం చేసే లోపు అమ్మమ్మ గాఢనిద్రలో పోయింది. ఓ పది రోజులు అమ్మ నాన్న 80 యేట నా దగ్గర ఉండటానికి వచ్చారు. మా ఇంటి ముందు ఇల్లు అమ్మకానికి ఉందని తెలుసుకొని మా ఇంటి డాబా పై నుండి చూసింది అమ్మ! అమ్మకు చాలా నచ్చింది. కాలం వారం రోజులని మింగేసింది. నేను నాలుగు అన్న మొత్తం సిద్ధం చేసి వెళ్లే వరకు… మేడం ఆరు లక్షలకు నిన్ననే అమ్మేసాం అన్నది జవాబు! అమ్మ నిరుత్సాహాన్ని చూడలేకపోయా! ఇప్పుడు అమ్మ లేదు! అదే ఇంటిని ఎంత పెట్టైనా కొందాంమంటున్నాడు నా కొడుకు ఇప్పుడు అమ్మమ్మ ఆత్మ శాంతిగా…
ఎంత ఇచ్చిన మేము అమ్మం”అన్నారు ఆ ఇంటి వాళ్ళు! కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకోవాలి. అవకాశాలు చేయి దాటితే తిరిగిరావు. తరువాత ఎంత పశ్చాత్తాపడినా ఏం లాభం? అంటూ రచయిత తన జీవితంలో జరిగిన అనేక విషయాలను కథల రూపంలో వివరించారు. ఏవేవో భావాలు దొర్లుతాయి, కొన్ని అక్షరాలై సాహిత్యం అనిపిస్తాయి. ఈ కథలకు మొదటి అభినందన ప్రశాంత! నా పేషెంట్ బోధన్ నుండి. రెండవది, పద్మ-నా మేనల్లుడు శేఖర్ భార్య. అంటూ పసి పాప తొలి అడుగుల లాంటి నా ఈ చిన్ని చిన్ని కథల చిన్న పుస్తకం మీ ఆదరణ కోసం.. ఈ ‘కథల అర!’ మన చేతిలో ఉంచిన రచయిత్రి డాక్టర్ అంజని కలం నుంచి మరెన్నో కథలు రావాలని ఆశిద్దాం.
కవి సాహితీ విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి
9912197694