ఆకాశవాణి కేంద్రంలో ఎకౌంటెంట్ గా పదవీ విరమణ చేసిన ఎస్. హనుమంతరావు ఆధునిక భావాలు కల బాలసాహితీవేత్త. వీరి మొదటి బాలల కథల సంపుటి ‘స్నేహధర్మం’ 2020లో ప్రచురించబడింది. 2023లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన వీరి రెండవ బాలల కథల సంపుటి ‘చక్రవర్తి ఏనుగు’.
అనగా అనగా అని చెప్పే కథలు, పూర్తిగా జంతుపాత్రలతో కథలు, ఇప్పటి పిల్లలు చూడని రాజులు, రాణుల కథలు, మనం చూడని దేవుడు, దయ్యాలు, మాయలు, మంత్రాల కథలు రాయటానికి వీరు ఆసక్తి చూపరు. ఐతే ఇప్పటి పిల్లల అవసరాలకూ, పరిస్థితులకూ తగినట్టుగా ఆధునిక బాల సాహిత్యంలో బాలల కోసం కథలు రాయటానికి యిష్ట పడుతారు. అలా వివిధ పత్రికలలో రాసిన 23 కథలే ‘చక్రవర్తి ఏనుగు’. ఇందులో మొదటి కథ
‘సైన్సు మాస్టారు’. చివరికధ ‘ఆచరణ’
‘చక్రవర్తి ఏనుగు’ కథ పేరే తన కథల సంపుటికి పెట్టుకున్నారు. ఈ కథల సంపుటి శీర్షికనే వినూత్నంగా ఉంది. పుస్తక శీర్షిక కథ ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అనే సామెత మనకు తెలుపుతుంది. చక్రవర్తిగారి ఏనుగుకు రోజూ కోటలో ఒక దబరా గిన్నెలో శ్రేష్టమైన బెల్లంతో, ఆవుపాలతో చేసిన సేమ్యాపాయసం పెడతారు. అయినా అది బజారులో ఉన్న ఒక కొట్లోని లడ్డూలంటే ప్రాణం పెట్టేది.లడ్డూలు తనకు పెట్టేవరకు దుకాణం ముందు ఆగి, తన మెడలోని గంట ఊపి పెద్దశబ్ధం చేసేది.
రంజనాసేన్ గుప్తా ‘ఢిల్లీ మెట్రో పాలిటన్’ పుస్తకంలో ప్రస్తావించిన ఒక సంఘటన ఆధారంగా ఎస్.హనుమంతరావు రాసిన కథే ‘చక్రవర్తి ఏనుగు’. ‘లండన్ ఎలుక’ కథలో ‘లండన్‌లో… తన అమ్మానాన్నలతో, మిగతా స్నేహితులతో, ఆటపాటలతో హాయిగా గడిపేది ఒక ఎలుక. ఆ అల్లరి ఎలుక ఆడుతూ, పాడుతూ ఓడలో దూరింది. ఇంతలో ఓడ కదిలి మన వైజాగ్ చేరింది. అక్కడ బ్రడ్, జామ్‌లకు అలవాటు పడ్డ ఎలుక ఇక్కడి మిరపకాయ బజ్జీ కొరికి కారంతో ఎగిరి గంతులు వేసింది. సన్నపడి ఇక్కడి ఎలుకలతో స్నేహం చేసింది. లండన్ ఎలుక వైజాగ్‌లో ఎలాంటి తిప్పలు పడిందో, వలస జీవుల జీవితాలు ఎలా ఉంటాయో చెప్పిన కథే ‘లండన్ ఎలుక’. ఏ రచయితకైనా కథలు రాయాలంటే, మొదలు ఒక కథా వస్తువు కావాలి. ఆ కథా వస్తువులు ఏ దైనా ఒక నిజ సంఘటన చూసినప్పుడో, ఒక విషయం చదివినప్పుడో, ఇతరులతో ముచ్చటించి నప్పుడో రచయితకు దొరుకుతాయి. గ్రంథ రచయిత తన మిత్రుడితో ముచ్చటిస్తున్నప్పుడు వైజాగ్ వీధుల్లో తిరుగుతున్న ఫారిన్ కుక్కల గురించి ప్రస్తావన వచ్చింది. ఆ వినూత్న విషయానికి స్పందించి ఎలుక ను పాత్రగా తీసుకుని కల్పన జోడించి రాసిన కథే ‘లండన్ ఎలుక’.
‘పక్షుల కూతలు’ కథలో నాని బజారు నుండి బూర తెచ్చుకుంటాడు. ఇంటి ముందున్న వేప చెట్టు పై పక్షులు కూతల కచేరి చేస్తుండేవి.నారి బూరను అదేపనిగా ఊదటతో పక్షులు కూయటం మాని వేరే చెట్టు మీదకు పోయాయి. అప్పుడు నానికి నిశ్శబ్ధం వెలితిగా అనిపించింది. అప్పుడు నాని తల్లి ‘శబ్దం పక్షి కూతలా శ్రావ్యంగా వుండాలిరా…. అది చెవులు దిబ్బడపడేట్టు వుండకూడదు…’ అంది. ఆ మాట అమ్మ చెప్పినప్పుడు కంటె, దొడ్లో లేగదూడ కాళ్ళకి నాన్న మువ్వలు కట్టాక అది మామూలు కంటే హుషారుగా గెంతడం నానికి ఇంకా బాగా అర్ధమవుతుంది.
ఇక ‘మొదటి ముద్ద’ కథలో తాతయ్య తాను ఆహారం తినే ముందు ఒక ముద్ద పక్షుల కోసం, చీమల లాంటి చిన్న జీవుల కోసం, కీటకాలకోసం తీసి పక్కన వదిలిపెట్టే పద్ధతిని పరిచయం చేసిన తీరు ఎంతో బాగుంటుంది.
ఈ కథల సంపుటికి ‘ముందు మాట’ లో డాక్టర్ వి.ఆర్ శర్మ పేర్కొన్నట్లు.. ఈ కథల్లో వర్తమాన కాలం వుంది. ఈ కాలపు పాత్రలూ, సంఘటనలూ, విషయాలూ ఉన్నాయి. అన్నీ పిల్లల జీవితాలతో పెనవేసుకుని ఉంటాయి. కనుక పిల్లలు ఈ కథలను తమ సొంతం చేసుకుంటారు.పిల్లలు ఈ కథల్లో తమనూ, తమ చుట్టూ ఉన్న మనుషులనూ, పరిస్థితులనూ, జీవరాశులనూ, వస్తువులనూ పోల్చుకుంటారు. తమ జీవితాలకు పనికి వచ్చే విషయాలు నేర్చుకుంటారు. ఈ కథల నిండా మానవీయత అంతర్లీనంగా అల్లుకుని ఉంది.
ఇంకా ఇందులో తోకలేనిపిట్ట , రెండు గొడుగులు, కప్పల ‘జూ’ సందర్శన, తాబేలు – కుందేలు, రెండు మందారాలు, పాము ప్రార్ధన, కవి చమత్కారం, బహుమానం, పిల్లలు కాదు పిడుగులు, సంబరం, ఏడో ఇల్లు, కోతుల లంచ్, వెన్నెల నిజాయితీ!, లిటిల్ జంటిల్ మేన్, చిలుకలు చెప్పిన కథ వంటి మొత్తం 23 కథలతో అల్లిన ఏనుగు మెడలో దండనే ‘చక్రవర్తి ఏనుగు’. ఈ కథల సంపుటికి అద్భుతమైన ముఖచిత్రం అందించారు పి.ఎస్. బాబు, ఇక లోపల ప్రతి కథకూ అందమైన బొమ్మలు వేసిన వెంకట్‌లకు, రచయిత ఎస్.హనుమంత రావుకు అభినందనలు.
మొత్తం 68 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ.80/-.
- తేజశ్రీ
89197 73272