Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: ఉత్తమ గ్రంథాల్లో ఉత్తమం

Telugu Literature: ఉత్తమ గ్రంథాల్లో ఉత్తమం

త్రిపురనేని గోపీచంద్‌ రాసిన ‘అసమర్థుని జీవయాత్ర’ను చదవని తెలుగు అభిమాని ఉండడు. కొత్త తరం తెలుగు భాషాభిమానులెవరైనా ఉంటే, దీన్ని అనధికారిక పాఠ్య గ్రంథంగా చేసుకోవడం మంచిది. తెలుగు భాషలో మొట్టమొదటి మనో వైజ్ఞానిక నవల ఈ పుస్తకానికి పేరుంది. గోపీచందు తెలుగు నవలా సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టిన అపూర్వ, అపురూప నవల ఇది అనడంలో అతిశ యోక్తేమీ లేదు. ఈ నవలను ఆసాంతం చదివినవారు ఇంత కన్నా అధికాధిక ప్రశంసలు చేసే అవకాశం ఉంది. 1945-46 ప్రాంతంలో రాసిన ఈ నవల ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సీరియల్‌గా ప్రచురితమైంది. ప్రముఖ సాహితీ విమర్శకుడు డి.ఎస్‌. రావు ఈ నవలను ఇంగ్లీషులోకి ‘ఏ బంగ్లర్‌-జర్నీ త్రూ ది లైఫ్‌’ అనే పేరుతో అనువదించారు.
ఈ అసమర్థుని జీవయాత్ర గోపీచంద్‌ రెండవ నవల. ఈ నవలను ఆయన తన తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరికి అంకితమిచ్చారు. రామస్వామి చౌదరి తెలుగు నాట పేరు ప్రఖ్యాతులున్న హేతువాది, నాస్తికుడు. మతాలను, కులాలను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఆయన. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నిర్వహించారు. గోపీచంద్‌ రాసిన అసమర్థుని జీవయాత్ర నవలలలో ఒకప్పటి గ్రామీణ జీవితం, అప్పటి ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, మానవ సంబంధా లన్నీ కళ్లకు డతాయి. సంపన్నులు, పేదవారి మధ్య ఉండే వ్యత్యాసాలు, తర తమ భేదాలు మనకు తారసపడతా యి. జమీందారీ వ్యవస్థలో వేళ్లు పాతుకుపోయిన అనేక వికృతాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. మన సమాజంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించిన బీజాలు ఎలా నాటుకుంటున్నదీ, జమీందారీ వ్యవస్థ ఎలా, ఏ కారణంగా కుప్పకూలుతున్నదీ ఆయన అన్యాపదేశంగా వివరించారు. ఒక తరం జీవితాన్ని అద్భుతంగా మన ముందుంచిన సాహితీవేత్త గోపీచంద్‌.
ఇంతకూ ఈ నవలలోని ప్రధాన పాత్ర అయిన సీతారామారావు పెద్దగా ధైర్య వంతుడు కాదు. ధోరో దాత్తుడూ కాదు. సరైన గుణాలు ఉన్నవాడు కూడా కాదు. అతనో అంతర్ముఖుడు. ఊహాలోకంలో తేలి పోతుంటాడు. ప్రతిదాన్నీ గోరంతలు కొండంతలు చేసి చూస్తుంటాడు. నవల ఆద్యంతం అతని మనో భావాలు వ్యక్తమవు తూనే ఉంటాయి. చివరికి అతని అంతిమ యాత్ర కూడా వీటన్నిటికీ అద్దం పడుతుం ది. మనిషి జీవితంలోని కీలకాంశాలను, చిత్రవిచిత్ర ధోరణులను, అర్థం కాని ఆలోచనల తీరుతెన్నులను రచయిత ఒడుపుగా, అద్భుతంగా పట్టుకోగలిగారు. సీతారామారావు పాత్ర విచ్ఛిన్నమవుతున్న మానవ వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచి పోయింది.
హేతువాద ప్రభావం
బూజుపట్టిన సిద్ధాంతాలను, సూత్రాలను మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకుని, వాటిని నిజ జీవితానికి ఆపాదించుకోవడం, తేడాలేమైనా వస్తే మొండిగా, మూర్ఖంగా తనను తాను సమర్థించుకోవడం ఈ నవ లలో సీతారామారావు పాత్ర ముఖ్య లక్షణం. అతను తన చేతకాని తనాన్ని, అసమర్థతను అసంబద్ధమైన తర్కంతో సమర్థించుకునే తీరు అనేక కుటుంబాలలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. ఈ సమర్థించుకునే తీరు కారణంగానే సీతారామారావు జీవితంలో అనేక దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తాడు. అతని లో ఒక పక్క ఆధిక్యతా ధోరణి కనిపిస్తుంది. మరో పక్క ఆత్మన్యూనతా భావం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు చిత్త ప్రవృత్తులు మారిపోతుంటాయి. ఉద్దేశాలు, అభి ప్రాయాలు మారిపోతుంటాయి. ఆ లక్షణాలన్నిటినీ రచయిత ఎంతో సునిశితంగా ఈ నవలలో పొందుపరిచి, సీతారామారావు పాత్రను రక్తి కట్టించారు. ఈ నవల చదువు తున్నంత సేపూ సీతారామారావుకు సంబంధించిన కొన్ని లక్షణాలను మనకు మ నం ఆపాదించుకుంటాం. లేదా ఇటువంటి వ్యక్తిని మనం మన జీవితంలో ఎక్కడో చూశామే అని ఆలోచిస్తాం. ఫ్రాయిడ్‌ వంటి మనో వైజ్ఞానికుడు కూడా ఒక సామా న్యుడి మనస్తత్వాన్ని ఇంత అద్భుతంగా విశ్లేషించి ఉండకపోవచ్చు.
సీతారామారావు అనే పాత్ర కొద్ది కొద్దిగా అసమర్థుడుగా మారటాన్ని అనేక పాత్రల ద్వారా వ్యక్తపరిచారు రచయిత. భార్య, మేనమామ, అతని ఆదర్శాలు, అతని పని పాటలు వగైరాలన్నీ అతనిలోని అసమర్థుడిని బయటపెడుతూనే ఉంటాయి. అతని మానసిక పరిణామ క్రమాన్ని రచయిత మలచిన తీరు నవలా రచయితలందరికీ మార్గదర్శకం అవుతుంది. ఇటువంటి నవలను చదవకపోవడం అనేది జీవితం గొప్ప వెలితే అవుతుందనడంలో సందేహం లేదు.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News