Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: సాహిత్య విమర్శకు కొత్త బాట తదేక

Telugu literature: సాహిత్య విమర్శకు కొత్త బాట తదేక

విదేశీ ప్రభావంతో వచన వాజ్మయంలో వెలసిన మరో సాహిత్య ప్రక్రియ వ్యాసం. ఫ్రెంచి భాషలో 16వ శతాబ్దంలో ఉన్న రచయిత మాంటెన్ మహాశయుడు తన వచన రచనకు పెట్టిన (Essay) పేరును ఆంగ్ల రచయిత ఫ్రాన్సిస్ బేకన్ స్వీకరించి ఆంగ్ల సాహిత్యంలో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టాడు. ఇది 18వ శతాబ్దం ఉత్తరార్థంలో తక్కిన ఆధునిక ప్రక్రియలన్నింటిలో కన్నా ముందుగా తెలుగులో రూపుదిద్దుకుంది.
తెలుగులో వ్యాసరచనకు వ్యాప్తి కలిగించినవి పత్రికలే. 1865 లో ప్రారంభమైన “తత్వబోధని” పత్రికలో మొదటిగా తెలుగు వ్యాసం ప్రచురించబడింది. వ్యాసాలు అనగానే పానుగంటి లక్ష్మీనరసింహారావు” సాక్షి వ్యాసాలు” గుర్తుకొస్తాయి ఈ వ్యాసాలు సారస్వత లోకాన్ని చైతన్యవంతం చేశాయి.
వ్యాసాలతో నిత్యం సహవాసం చేసే డా. మహమ్మద్ హసేన గారు “తదేక ‘ వ్యాసాల పేరుతో అక్షర సేనను నడిపించాడు. అక్షర శిబిరాన్ని నిర్వహించాడు. వారి వ్యాసాలు సామాజిక చైతన్యంతో నిండిన జననాట్యాలు గాలితనాన్ని గ్లామరైజ్ చేస్తున్న ఈ వ్యవస్థలో వ్యాసాలను తన శ్వాస కోశాలుగా మల్చుకున్న వారు మహమ్మద్ హసేన గారు. వారి పదాలను పలికిస్తే చైతన్య పాదాలతో అవి కదం తొక్కుతాయి. వారి అక్షరాలను తాకితే ఏదో తెలియని తీపి ఆర్ద్రతతో తొణికిసలాడుతాయి. వారి వాక్యాలు చదువుతుంటే
నిజాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలబడతాయి. వారి వ్యాసాలు వాయునాదాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి అక్షరం సత్యశోధన నుంచి పుట్టుకొచ్చిన చైతన్యపు రధాలు. కవిత్వంలో గాని, కథలో గాని రచయితలకు రచనలలో పరిధి విస్తారంగా ఉండదు. కానీ వ్యాసాలకు అది కాస్త ఎక్కువే. పాటిబండ్ల. రజిని గారి కథా కవిత్వాన్ని చూస్తే అర్థమవుతుంది.
“బంగారు పుట్టలోని చీమ
ఎవరిని ముందుగా కుట్టిందో గుర్తుండదు.
ఏడో చేప ఎందుకు ఎండ లేదో
తార్కికంగా యోచించే ఓపిక అస్సలు ఉండదు
లో వోల్టేజ్ ఫ్యాన్ గాలి
వాయుగుండం అవుతుందని
ఏ వాతావరణ కేంద్రం హెచ్చరించదు. “
అని మాత్రమే చెప్పగలం. కవిత్వంలో అంత విస్తారంగా చెప్పలేం. కానీ మహ్మద్ హసేన గారు నిజాలను, ఇజాలను పుస్తకంలో నిక్షిప్తం చేసిన తీరు చూస్తుంటే వ్యాసాలు అత్యంత వివరణాత్మకంగా, శక్తివంతంగా ఉంటాయి. “నాయనయాదిలో” అనే వ్యాసంలో వీరి శైలి విశిష్టతను చూస్తే వారి భావరసస్ఫూర్తిని బహిర్గత పరుస్తుంది. కవితలు, సామెతలు, లోకోక్తులు కుమ్మరించినట్టు కనిపిస్తుంది నాన్న అంటే గుండెలో నిండి ఉండే “ఆర్ద్రత” అని అక్షర రూపం ఇచ్చిన తీరు చూస్తే తెలుస్తుంది. అతి దీర్ఘంగా ఉండదు, అమృతపాయంగా ఉంటుంది. సమగ్రంగా ఉండి సహజస్ఫూర్తిని కలిగిస్తుంది. ప్రత్యేక శీర్షికలతో పదునుగా ఉంటుంది. విషయోద్దేశం నిక్కచ్చికి నిలయంగా ఉంటుంది.
ప్రపంచమంటే నాలుగు గోడలు కాదని విశాల ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది శ్రీలంక రచయిత్రి ఆయా హెచ్ వన్ని యారచ్చి నాన్నను ఉద్దేశించి ఇలా చెబుతుంది “ఒక తండ్రి కన్నీళ్లు భయాలు బయటకు కనిపించవు ప్రేమను బయటకు ప్రకటించడు కానీ అతను ఇచ్చే రక్షణ, మనోధైర్యమే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి”. అమెరికాలో మమ్మీ ట్రెస్ కంటే డాడీ ట్రెస్ ఎక్కువ పెరుగుతుందని పరిశోధనలు శోధించిన విషయమే. నేడు నాన్నలు ఎంత సున్నిత మనస్కులు గా మారారంటే గర్భసంచి ఉంటే మేమే పిల్లలను కనే వాళ్ళం అనేంతగా.డాక్టర్ మహమ్మద్ హసేన గారు నాన్నను ఉద్దేశించి రాసిన వ్యాసం కఠిన హృదయాలను సైతం కన్నీరు పెట్టిస్తుంది. నాకు మాత్రం వర్షపు చుక్క కంటే మా నాన్న కన్నీటి చుక్కలకే విలువ ఎక్కువ. మిరప చేనులో నవ్వుతున్న ప్రతి పువ్వు మా నాన్న నిత్యం మా కోసం పరితపించే పొద్దు తిరుగుడు పువ్వు మా నాన్న. మా కడుపు నిండాలంటే ఆయన కండరం కరగాలి. మేము నిలబడాలంటే ఆయన వెన్నుముక అరగాలి. అలారం కూతకు సైరన్ మోతకు నలిగిపోయే చెమట చుక్క మా నాన్న. ఇప్పుడొక ఒక కొత్త పలక దొరికితే బాగుండు అనే వ్యాసంలో హసేన గారు ఏనుగు నరసింహారెడ్డి గారి “కొత్త పలక” అనే కవితా సంపుటి సమీక్షించారు.
ఇందులో 52 కవితలు గలవు. అందులో బాల్యపు చెరుకు రసం లాంటి తీపి గుర్తులు నెమరు వేసుకుంటాడు ఈ వ్యాసం లో భాష నిర్దిష్టంగా సులభంగా ఉండి మెదడుకు అందించే తీరును చూస్తే నేర్పరితనంతో నిండి ఉంటుంది. పుటలు తిరిగేస్తే బాల్యపు పలకరింపులతో పసందుగా ఉంటుంది. సమగ్రంగా ఉండి చక్కిలి గిలిగింతలు పెడుతుంది. విలక్షణ శైలి తో విహరిస్తుంది. యతి ప్రాసలతో ప్రాణం పోసినట్టుగా ఉంటుంది.
“చూచి రాతలు, ఎత్తి రాతలు
ఎన్ని నేర్పింది పలక!
రాసి రాసి
బండి “ఱ” మీద నుండి దూకితే గాని
కరడాల కాపి కి అర్హత వచ్చేది
ఇప్పుడు ఒక పలక దొరికితే బాగుండు
చెరిపిరాయాల్సిన జీవిత పాఠాలు
చాలా గుర్తొస్తున్నాయి.”
అనే కవితను ఉటంకిస్తూ హసేన గారు వ్యాసం కు అశ్వ వేగానందిస్తాడు . డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు అన్నట్టు పసితనమే ఋషితనం అంటాడు. “కాకి పలక పలగాలి నా పలక ఆరాలి” అనే బాల్యపు జ్ఞాపకాల జాడలను గురించి హసేన గారు హాయిని గొలిపే ఎన్నో ముచ్చట్లు మన ముందు ఉంచుతారు. కార్పొరేట్ చదువుల గురించి బాల్యంని బంది చేసిన అనారోగ్య పోటీ గురించి సూటిగా ప్రశ్నిస్తాడు. ఇసుకతో ఆడుకోవాల్సిన బాల్యం ఇటుక గోడల మధ్య బంది అయింది చేతిలో చెయ్యి వేసి కలపాల్సిన బాల్యం ఇప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పిలుపు అణచివేసింది. తరం మారింది గూగుల్ ఓ గురువయ్యింది. బాల్యానికి ఓ దారి చూపండి ప్రతిరోజు పండుగలా పండు వెన్నెల్ని పంచండి. బాల్యం అంటే సమాధి కాదు బంగారు భవిష్యత్తుకు పునాది అని వివరణాత్మకంగా వ్రాశారు ఆ వ్యాసంలో.
గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు విశ్లేషణ అనే వ్యాసంలో మహమ్మద్ హసేన గారు సృజించిన తీరు వారి సృజనాత్మకతను తెలియజేస్తుంది. పెద్ద వాక్యాలను సంస్కృత సమాసాలను ప్రయోగించకుండానే పాఠకులకు విసుగు కలిగించకుండ జాగ్రత్త పడతారు. వీరి విలక్షణ శైలితో కనువిందు చేస్తారు. ఉపమానాలతో ఉర్రూతలు ఊగిస్తాడు. మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్పి విస్మయపరుస్తాడు. 2004 సంవత్సరంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారి “నా దేశం నా ప్రజలు” అనే కావ్యము నోబెల్ సాహిత్య బహుమతికి నామినేట్ కావటం గురించి చెప్పి ఆశ్చర్యపరుస్తారు. సమాచారాన్ని, జ్ఞానంగా రూపుదిద్దుటంలో వారి అభివ్యక్తి తీరు చూస్తే హసేన గారు అసామాన్య వ్యక్తిలా కనపడతారు.
“ఓ నా ప్రజలారా!
రండి మీకో కొత్త పద్యం ఇస్తా
ఈ పద్యం మీకో కొత్త ప్రాణం ఇస్తుంది.”
అంటూ శేషేంద్ర శర్మ గారి కవిత్వాన్ని కోట్ చేస్తారు.
“నేనంతా కలిపితే
పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే
ఒక దేశం జెండాకున్న పొగరు ఉంటుంది నాకు “
అని గుంటూరు శేషేంద్ర శర్మ గారి అక్షర ఆణిముత్యాలు సందర్భోచితంగా అందిస్తారు.
“నేను చెమట బిందువుని
కండల కొండల్లో ఉదయించే లోక బంధువుని
గుండెలతో నాకు దోస్తీ
నేనుండేది బాధల బస్తీ “
లాంటి కవితా వచనములు తీసుకొని వ్యక్తి ఎటువైపు నిలబడాలి, పేదల పక్షం ఎందుకు వహించాలి అని సమయానుకూలంగా చెప్పేతీరు హసేన గారి విశ్లేషణ శక్తిని విశదపరుస్తుంది. “గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు విశ్లేషణ” అనే వ్యాసంలో ముగింపు ఎలా ఇవ్వాలో హసేన గారు అలాగే ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. శ్రీశ్రీ, శేషేంద్ర ను ఉద్దేశించి “ శేషన్ శేషన్ నీ పోయెమ్స్ చూసెన్ నీది మంచి పద్యమా లేక ఫ్రెంచ్ మధ్యమా” అనే విషయం తో ఇచ్చే ముగింపు ముచ్చట గొలుపుతుంది.
తదేక పుస్తకానికి ముఖచిత్రాన్ని అతి రూపంగా రూపుదిద్దింది కూరెళ్ళ. శ్రీనివాస్ గారు. డీ.టి.పి. అక్షరాలను కూర్చుంది జి.యస్ ప్రవీణ్ గారు ముందు మాటతో ముత్యాలు పరిచినది ఆచార్య దార్ల.వెంకటేశ్వరరావు గారు. మహమ్మద్ హసేనా గారి వ్యాసాల పుస్తకం ప్రతి ఒక్కరి మస్తిష్క మదిలో ఉండవలసిన పుస్తకం. అదేవిధంగా నవల తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారు ఓ మంచి సమాచారంతో కూడిన పుస్తకాన్ని ముద్రించి సాహిత్య పరిశోధకులకు, కవులకు, రచయితలకు అందుబాటులోకి తేవడం మంచి పరిణామం.
(ఈ నెల 13న బుక్ పెయిర్ లో ఈ పుస్తకం ప్రముఖుల ద్వారా ఆవిష్కరింపబడుతున్న సందర్భంగా)

- Advertisement -

సాదే సురేష్
9441692519.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News