Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: చైతన్య కిరణాలే ఈ చిటికెన వ్యాసాలు

Telugu literature: చైతన్య కిరణాలే ఈ చిటికెన వ్యాసాలు

సమాజంలో ఆడవాళ్ళు ఎన్ని పాత్రలను పోషిస్తున్నారో వివరించిన రచయిత

మన తెలుగు సాహిత్య చరిత్రలో వ్యాసాలకు ముఖ్య స్థానం ఉంది. ఈ వ్యాసరచనలు మన జ్ఞానానికి, మనలో ఉన్నటువంటి సృజన శక్తికి, తార్కికతకు అద్దం పడుతుంటాయి. ఈ వ్యాస రచనా ప్రక్రియ అనేది మన సాహిత్యంలోని ఒక భాగమే. సాహిత్యం అనేది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? అది మన చుట్టూ ఉన్న సమాజం నుంచే. మన చుట్టూ అనేక సంఘటనలు జరగడాన్ని మనం కళ్ళారా చూస్తుంటాం. ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవడం, ఎన్నో రకాల బాధలు మన కళ్ళముందు కదలాడడం చూస్తుంటాం.. వీటన్నింటికి ఒక హితాన్ని చేకూర్చుతూ అంతరంగంలోని భావాలకు అక్షర రూపాలన్నందిస్తూ, సమాజాన్ని తట్టి లేపే దిశగా ఎంతో మంది కవులు తమదైన శైలిలో అనేక రచనలను చేస్తుంటారు. ఈ సాహిత్యమనేది సామాజిక మార్పు కోసం ఒక అత్యంత శక్తి వంతమైన సాధనము. సమాజంతో పాటు ఇది మారుతూ వాటికనుగుణంగా అనేక ప్రక్రియలు. సృష్టించబడడం జరుగుతుంది. అవి పద్య, గద్య, వచన, నవల, కథ, వ్యాసం ఇలా ఏ ప్రక్రియయైనా సామాజిక స్పృహనే ప్రధాన లక్ష్యంగా ఉండేలా అక్షరాలకు పురుడు పోస్తూ రచనలను చేస్తూ ఉంటారు అనేక మంది కవులు. అలా, సామాజిక స్పృహను అణువణువునా నింపుకొని, తన రచనల ద్వారా సమాజాన్ని ఉద్దరించాలనే తాపత్రయ మనసు కలిగిన వాడు మన రాజన్న సిరిసిల్లా జిల్లా చేనేత కుటుంబంలో జన్మించిన డాక్టర్‌ చిటికెన కిరణ్‌ కుమార్‌.
కవిగా, కథకునిగా, వ్యాసకర్తగా, లఘుచిత్ర కథకునిగా, సమీక్షకునిగా, అంచెలంచెలుగా ఎదుగుతూ, సాహిత్య సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న ఇంటర్నేషనల్‌ బెనెవోలెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సభ్యుడు డాక్టర్‌ చిటికెన కిరణ్‌ కుమార్‌. అభ్యుదయ భావజాలంతో, సమాజాన్ని చైతన్య పరుస్తూ. తాను రాసిన వ్యాసాలను పాఠకులకు అందించాలనే నేపంతో వాటిన్నంటిని కూర్చి ‘చైతన్య స్ఫూర్తి ‘పేరిట’ పుస్తక రూపంలో తీసుకువచ్చారు. దీనిలో మొత్తం 24 వ్యాసాలున్నాయి. ఇవన్నీ కూడా వివిధ దిన పత్రికలలో ప్రచురింపబడి పాఠకుల ఆదరణ పొంది నవే. ఈ వ్యాస సంపుటి ‘వనితా నీకు వందనం’ అంటూ ప్రారంభమై, ‘యుద్ధ అనాధల వ్యదార్ధ జీవితాలు’ అనే వ్యా సంతో ముగుస్తూ… ప్రతి వ్యాసంలో ఏదో ఒక సందేశా న్నందిస్తూ దేని కదే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈ పుస్త కానికి మాజీ మంత్రి వర్యులు మండలి బుద్ధప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు ముందు మాటలను అందిం చడం మరో గొప్ప విశేషము.
ఇక పుస్తక విషయానికి వస్తే ‘చైతన్య స్ఫూర్తి’ చిటికెన వ్యాసాలంటూ తన వ్యాస సంపుటిలో మొదటి వ్యాసమైన ‘వనితా నీకు వందనం’లో సమాజంలో ఆడవాళ్ళు ఎన్ని పాత్రలను పోషిస్తున్నారో, ‘పెళ్ళి’ అనే బంధంతో అత్తారిం టికి వచ్చిన ‘స్త్రీ’కి కొత్త జీవితం ప్రారంభమౌతుందని… అక్కడ ఎదురయ్యే కష్టాల కడగళ్లను. ఎంతో సహనంగా ఎదుర్కొంటూ, తన బాధ్యతని తాను నిర్వర్తిస్తూ కుటుం బాన్ని కాపాడుకుంటుందని ఎంతో చక్కగా వివరించారు. ఇంకా నేటి సమాజంలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమ స్యల గురించి, వారికి ఎన్ని చట్టాలు వచ్చినా అణిచి వేయ బడుతున్నారని తన ఆవేదనను వ్యక్తం చేశారు కిరణ్‌… (ప్రతి మానవతా మనుగడకు ‘స్త్రీ’ పాత్ర ఎంతగానో ఉన్న దని, ‘స్త్రీ’ కి మన దేశ చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉన్నదన్న విషయాన్ని అందరూ గుర్తెరిగి వారిని గౌరవించాలని సూచించారు.
‘భారతదేశమే గొప్ప’ అనే వ్యాసంలో ప్రపంచ దేశా లను అబ్బుర పరిచే విధంగా దేశ సంస్కృతి సాంప్రదాయా లున్నాయని, కొన్ని తరాల వరకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నదని, ఆ కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయాలకే అం దరూ కట్టుబడి ఉండే వాళ్ళని వివరించడం జరిగింది. మన తెలుగు భాష గొప్పతనం గురించి, తెలుగు ప్రజల వంట కాల గురించి కూడా వివరించారు.
‘సామాజిక చైతన్యమే సమ సమాజ నిర్మాణ’ మంటూ మానవులందరూ సమిష్టిగా పరస్పర సహాయ సహకారా లందించుకోవాలని, స్త్రీ, పురుషులంటూ సంఘటితంగా ఏర్పడిన, జన్యుపరమైన లోపం గల ‘ట్రాన్స్‌ జెండర్స్‌’ను ఈ సమాజం వింతగా చూస్తుందని వారు ఎన్నో అసమాన తలను ఎదుర్కొంటూన్నారని, అయినా ఎంతో మనోధైర్యం తో ముందుకెళ్తూ తమ జీవన విధానాన్ని సాగిస్తున్నారని కిరణ్‌ చక్కటి పదజాలంతో చెప్పినారు.
‘విజయానికి సంకేతం స్వామి వివేకానందుడు’ అనే వ్యాసంలో వివేకానందుడు గొప్ప తాత్వికుడని, దేశ ఔన్న త్యాన్ని నలువైపులా చాటినవాడని, ఆయన గొప్పతనాన్ని, ఆయన చేసిన ప్రభోదాలను, స్ఫూర్తి వచనాలను కొన్నింటిని ఈ వ్యాసంలో మనకందించారు.
‘యువత మాదక ద్రవ్యాలను వీడాలి’ అనే వ్యాసంలో నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో ‘మాదక ద్రవ్యాల‘ సమస్య ఒకటి.. ఈ మాదక ద్రవ్యాలకు యువత బలై పోతున్నారని, వారి ఉజ్జ్వల భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుంటున్నారని, కొన్ని మాఫియాలు చిన్న పిల్లలను సైతం ఈ కుంపటిలోకి లాగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఈ సమస్య పరిష్కారానికి యువత నడుంబిగించాలని, తమ భవిష్యత్తును కాపాడుకున్నప్పుడే దేశ ప్రగతికి తోడ్పడతారని, అప్పుడు దేశం ముందడుగులో ఉంటుందని సూచించారు చిటికెన.
‘ప్రతి గుండెను కదిలించిన రూట్స్‌’లో ‘రూట్స్‌’అనేది ఓ అద్భుత రచన అని, అది ఏడు తరాల చరిత్రను తెలియ జేసి, ప్రపంచంలో ఎంతమందినో ఆశ్చర్య చకితుల్ని చేసిందని, ‘అలెక్స్‌ హేలీ’ తన తరాన్ని, తన సంతతిని తెలుసుకునే క్రమంలో ఏడు తరాల చరిత్రను తెలుసుకొని ప్రపంచానికి తెలియజేసిన రచన అని పేర్కొన్నారు.
‘నేటి రచయితలకు స్ఫూర్తి ప్రధాత ‘దాశరథి’ వ్యాసం లో ఆ మహనీయుని జీవిత విశేషాలను, అందుకున్న అవా ర్డులను వివరిస్తూ ఆయన జీవితమే ఈ ప్రపంచానికి ఓ దిక్చూచి యని తెలియపరుస్తూ… ‘రచయిత‘ అనే పదానికి చక్కటి నిర్వచనాలనిచ్చి, మనిషి జీవితంలో ఆ మనిషిని తేజోవంతం చేయడానికి రచనలు దోహదం చేస్తాయనే విషయాన్ని వివరించారు. అంతేగాక ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న ప్రతి వ్యక్తిలో నిగూఢమైన ఆస్తి, వారికున్న ఆయుధం ‘పుస్తక పఠనం’ అనే విషయాన్ని కూడా తెలియ జేసారు.
‘సమాజ శాంతి తోనే ప్రపంచశాంతి’ అనే వ్యాసంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం’ ఎప్పుడు, ఎందుకు జరు పుకుంటామో దాని ఆవశ్యకత ఏమిటో, ‘శాంతి‘ కోసం ఐక్యరాజ్యసమితి చేస్తున్న కార్యకలాపాల గురించి, ఈ ప్రపంచశాంతి అన్ని దేశాల్లో పరిఢవిల్లాలంటే యుద్ధం లేని, అణ్వాయుధాలు లేని, క్షిపణి దాడులు లేని , ఆకలి బాధలు లేని ప్రపంచం నిజమైన శాంతికి మార్గం తెరుస్తుం దని, దీని కోసం’ సమస్త ప్రజానీకం ఎదురు చూస్తుందని తన రచనతో తెలియజేశారు.
‘స్త్రీ‘ విద్య దేశానికి ప్రామాణికమని, ఒక దేశ మను గడకు విద్య ఎంతో ఆవశ్యకమని, యవత అన్ని రంగాలలో పరిణతి చెందినట్లయితే దేశం ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందని, దీనికి తోడు ‘స్త్రీ’ విద్య కూడా అవసరమని, ‘స్త్రీ’లు చదువుకుంటే కుటుంబ ప్రగతితో పాటు, దేశ ప్రగతి, సమాజ శ్రేయస్సుకు పునాది అవుతుందని ఎంతో చక్కగా అక్షరికరించారు.
‘బతుకమ్మలో గౌరమ్మ’ అనే వ్యాసంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ఆడపడుచు లందరూ ఆనందంగా జరుపుకునే అద్వితీయమైన పండుగ ‘బతుకమ్మ‘ని…ఆ పండుగ విశిష్టతను, దానిని పేర్చే విధానాన్ని, జరుపుకునే విధానాన్ని గురించి చక్కటి పదజాలంతో వివరించారు.
‘కాలుష్యం నియంత్రణ బాధ్యత మనదే’ అనే వ్యాసం లో నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రజలంతా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో దేశం మొత్తం కాలుష్యం బారిన పడుతున్నదని, వాతావరణంలో అనేక మార్పులు జరగడం వలన ఓజోన్‌ పొర క్షీణించి పోతున్న దని, దాని ఫలితంగా వచ్చే నష్టాల గురించి ప్రజలందరికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని చక్కటి వివరణతో ముందుకొచ్చారు కిరణ్‌.
‘ఓ యువతరమా, నవతరమా మేలుకో’ అంటూ నేటి కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న ఆఘాయిత్యాల గురించి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరిస్తూ, ప్రతి తల్లిదండ్రులు పిల్లల చదువుల గురించి, వారి ప్రవర్తనా తీరు గురించి గమనిస్తూ, వారితో సన్నిహితంగా ఉంటూ, ప్రేమను పంచుతూ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా కాపాడుకునేలా చేయాలని చెప్పారు.
‘భవితకు రూపం పుస్తకం’ వ్యాసంలో యాంత్రిక ప్రపంచంలో పుస్తక పఠనం యొక్క అవసరాన్ని, గొప్ప తనాన్ని సమాజం విస్మరిస్తుందని ఈ పఠన ప్రభావం ఉంటే వ్యక్తుల మానసిక పరిధి విస్తరిస్తుందని, లోకజ్ఞానం తో పాటు సామర్థ్యాలను మెరుగు పరచుకునే ప్రతిభను కనబరుస్తారని, ‘పుస్తక పఠనం’ వలన ఎందరో విజ్ఞాన వంతులై మహానుభావులయ్యారని, దాని ఆవశ్యకతను ప్రతి ఒక్కరు తెలుసుకొని పుస్తకాలను విరివిగా చదువాలని కోరారు.
‘సమాజ అభివృద్ధిలో భాగమైన రచయితలు’ వ్యాసం లో సమాజంలో కీలక మార్పులు తీసుకురావడానికి సాహితీ వేత్తలు తమ రచనల ద్వారా కృషి చేస్తున్నారని, భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలాలను తమ కలాల నుంచి దిశా మార్గ దర్శకాలను చూపించే అద్భుతమైన వారధి ‘రచయిత’ అని చక్కగా వివరించారు.
‘అంతర్జాలంతో అంతర్మధనం’ లో అంతర్జాల మాయ లో పడి, మనిషి రోజులో సగటు జీవితాన్ని మాధ్యమాలపై సమయాన్ని వెచ్చిస్తున్నారని, దీని వలన లాభ, నష్టాలు న్నాయని, వాటిలో మంచిని మాత్రం గ్రహించి, చెడును విస్మరించాలని సూచించారు.
‘చేనేతన్నకు పండుగ బతుకు’ అనే వ్యాసంలో తెలం గాణలో ఆడపడుచుల పండుగైన బతుకమ్మ కు ప్రభుత్వం ‘చీరల పంపిణీ‘ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చి, రెక్కాడితే డొక్కాడని జీవితం గడిపే నేతన్నలకు ఎంతో ఉపాధిని కల్పిస్తుందని పేర్కొన్నారు.
‘ఆ… కమ్మని పలుకే అమ్మ’ వ్యాసంలో ‘సృష్టి’ మను గడకు అపురూపమైన పాత్ర పోషించేది ‘అమ్మ ‘ అని, ప్రతి వ్యక్తికి అమృతాన్ని పంచి పెట్టేది ‘అమ్మ’ ఒక్కటేనని, అమ్మ గొప్పతనంను వివరిస్తూ, ‘ అమ్మా’ అనే పిలుపే ఓ కమ్మని పలుకు అని చెబుతూ సినీ ప్రపంచంలో అమ్మ మీద రాసిన పాటలను కొన్నింటిని వివరించి, లోకంలో అమ్మ పాత్ర మరువలేనిదని… ప్రతి అమ్మకు అనంతకోటి వందనాలను అర్పించారు కిరణ్‌ గారు..
‘ఆత్మ విశ్వాసం ముందు ఏదైనా ‘బానిస’ కాక తప్పదని, ప్రపంచ మానవాళి మొత్తం ‘ఆత్మ విశ్వాసం’తో ఉంటే ఎటువంటి మహమ్మారినైనా, దేనినైనా ఎదురించ గలమని, మనిషికి ఆత్మవిశ్వాస మనేది ‘ఓ దివ్వౌషధం’ అని, దానిని అందరిలో నింపగలగాలని చక్కటి సందేశాన్ని సూచించారు.
‘వ్యాయమం’ అనే వ్యాసంలో ప్రతీ మనిషి తన ఆరో గ్యాన్ని తన చేతులలోనే మలుచుకోవాలని అందుకోసం పోషకాహారంతో పాటు, ప్రతి రోజు వ్యాయమం చేయా లని, వ్యాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని, అలాగే శారీరక అందాన్ని పెంపొందించుకోవచ్చని, క్రమం తప్ప కుండా వ్యాయమం చేస్తే మన మానసిక ఒత్తిడులు కూడా మాయమౌతాయని అన్ని రకాల రోగ సమస్యలకు ‘వ్యా యమం’ ఓ చక్కటి పరిష్కార మార్గమని సూచించారు కిరణ్‌.
మన జీవన శైలితో పర్యావరణం కాలుష్యం చెంద డంతో ఈ భూగోళం వేడెక్కి జీవ వైవిధ్యం దెబ్బతింటు న్నదని, ఎన్నో రకాల జీవరాశులు అంతరించి పోతున్నా యని తన ఆవేదనను వ్యక్త పరుస్తూ … పంచభూతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మన జీవనశైలిలో మార్పులు రావాలని, కాలుష్యాన్ని అరికట్టడా నికి మొక్కలని బాగా పెంచాలని సూచించారు.
చివరి వ్యాసమైనటువంటి ‘యుద్ధ అనాధల వ్యదార్ధ జీవితాలు’లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరుగు తున్నాయని, వాటి కారణంగా సర్వం కోల్పోయి ఎంతో మంది చిన్నారులు అనాధలుగా మారుతున్నారని, అలాం టి వారి జీవితం చాలా బాధాకరమని అలాంటి వారిని చేర దీసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దె సంకల్పంతో ఎన్నో స్వ చ్ఛంద సంస్థలు వారి సంక్షేమం కోసం పాటు పడుతున్నా యని వాటికి విరాళాలు ఇవ్వడం ద్వారా ఆదుకున్న వారమౌతామని రచయిత కిరణ్‌ గారు తమ అభిప్రా యాన్ని చెప్పినారు.
ఇలా ఈ ‘చైతన్య స్ఫూర్తి’ వ్యాస సంపుటిలో ప్రతి వ్యాసం ఏదో ఒక చక్కటి సందేశాన్నిస్తూ అందరిని ఆకట్టు కునే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చదివి, వారిలో ఎంతో కొంత చైతన్యాన్ని కలిగించుకుంటారని ఆశిస్తు న్నాను. సాహిత్యం ద్వారా సమ సమాజ పరివర్తనను తీసు కురావచ్చని అహర్నిశలు అన్ని ప్రక్రియలలో కిరణ్‌ గారు చేస్తున్న కృషి అమోఘం. అతనికి అనేక జాతీయ, అంత ర్జాతీయ పురష్కారాలతో పాటు, ముఖ్య మంత్రులు, గవ ర్నర్లు, ప్రముఖులచేత, సాహితీ సంస్థల చేత సన్మానాలను, సత్కారాలను అందుకున్నారు. ఇంకా తన నుండి అనేక రచనలు రావాలని, ఎప్పటికప్పుడు తన కలాన్ని కదిలించి అక్షర పోరాటాన్ని చేస్తూ సమ సమాజానికి తన రచనలే చైతన్య కిరణాలు కావాలని ఆశిద్దాం.

  • చిలువేరు నాగమణి
    మిర్యాలగూడ
    9959943131
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News