నేటి తరానికి, రాబోయే తరానికి అందరికీ అర్థమయ్యే విధంగా, భావానికి ఎలాంటి నష్టం కలగకుండా పాఠకులకు అందించాలనే సంకల్పంతో అద్భుత ప్రతిభతో ముందుకు వచ్చిన హుస్నాబాద్ వాస్తవ్యురాలు అయిన నేటి మేటి కవయిత్రి,, ప్రభుత్య ఉపాధ్యాయ వృత్తిలో బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం 2021 అందుకొన్న ఇంజపురి వసంత. తన కవనం ఒక ప్రత్యేకతతో రచించిన ‘వసంత సుమాలు’ పుస్తకం తెలిచిచూస్తే చివరి పేజీ వరకు చదివించింది. అన్ని విషయాలను స్పృశించి ‘అక్షర భావ సుమాలు’గా ఆకట్టుకుంది. సాహిత్యం ద్వారా లఘు ప్రక్రియల్లో తేనియలు, మధురిమలు, హరివిల్లు, కైటికాలు, చిమ్మీలు, శతాక్షరి, శ్రీపదాలు, మెరుపులు ఇలా చాలా ప్రక్రియల్లో కవనాలు చేస్తున్న వసంత తన తొలి కవితా సంపుటి పుస్తకానికి నా నుండి సమీక్ష కావాలని కోరగా….నా పరిశీలనలోకి వచ్చిన కొన్ని తన కవితల్లోని భావాన్ని తెలియజేస్తూ….
అలసిన కన్నులకు
కలలే ఓదార్పు
కష్టపడే మనసుకు
గెలుపే తుది తీర్పు
(విజయం శ్రమకు ఫలితం అవుతే అది ఉత్సాహం గా మారి నూతన అడుగుకు నాంది పలుకుతుంది అంటుంది కవయిత్రి వసంత )
ఉప్పు కర్పూరం వేరు
రంగులు మాత్రం తెలుపు
ఒకటి రుచిని తెలుపు
మరొటి పవిత్రత గొలుపు
(ఉప్పు కర్పూరం రెండు కూడా కళ్ళకు సమానంగా కనిపించినా గానీ దేని లక్షణం అది అంటూ ఆనాటి ఉప్పు కప్పురంబు చూడు ఒక్క పోలికనుండును మళ్లీ తలపిం చింది )
రాజు తలుచుకుంటే
రాళ్లు కోటలవుతాయి
సుకవి తలుచుకుంటే
కావ్యాలు జనిస్తాయి
(జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యా యాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవనం విలువ కవి ప్రత్యేకతను తెలియజేసిన హరివిల్లు)
జనని ఋణము తీర్చడం
జన్మలో సాధ్యమా
మాతృమూర్తి సేవలో
ధరించాలి సుమా
(కుటుంబము లోని సంతానాన్ని పెంచి పోషించే తల్లితండ్రులలో వీరిలో స్త్రీ తన ప్రధాన పాత్రగా పోశించిన తల్లి ఋణము తీర్చలేనిదని, సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. అని, కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిదని తెలియజేసింది)
రాగం తీయనిదే
పాట కాలేదు
గళం లేనిదే
శృతి చేరలేదు
(సాధన చేయనిది ఏది తనంతట తానై తన దరికి రాదని మరోసారి తెలియజేసి రాగ గళాన్ని వినిపించింది)
ప్రకృతి బడిలోన
నేర్వాలి పాఠాలను
బతుకు బడిలోన
దిద్దుకో జీవితాలను
(ఆకుపచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, వైవిధ్య మైన జీవులు, కొండలు, లోయలు ఇలా వివిధ ప్రదేశాల్ని చాలా మనోహరంగా కనిపించే ప్రకృతికి విద్యాలయానికి ఆపాదించి అందించిన కవన హరివిల్లు)
పదాలు దొరకాలంటే
భాషనే ప్రేమించాలి
కవనాలొకాలంటే
ఊహ రెక్కలు తొడగాలి
(ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసు కోవడానికి ఉపయోగించుకునే భాష, ప్రదానంగా మాతృ భాష భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యము ముఖ్య మైన అంశాలు తెలిసినపుడే కవనం పరిమలిస్తుందండి చెబుతుంది)
మంచి మాటలకే
మనసు స్పందిస్తుంది
మధుర స్నేహమే
మదిన నిలుస్తుంది
(ఒక మంచి మాటతో ప్రతి మనసుని ప్రార్థించండి. ఆ ఫలితం చిరస్థాయిగా నిలిచే ఒక మంచి స్నేహబంధం అందించక తప్పదు అంటుంది)
నిస్సహాయతే
ధైర్యాన్ని చంపుతుంది
అహంకారమే
ఒంటరిని చేస్తుంది
(నిరుత్సాహం, నిస్సహాయత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది అని తెలుపుతూ చేసిన ఈ కవనం అంతే మొత్తం గా అహంకారం ముఖ్యంగా ఒంటరిని కూడా చేస్తుంది అని తెలిపింది )
కాలంతో అడుగులను
కలిపి ముందుకేయాలి
అందని అవకాశాలు
అంది పుచ్చుకోవాలి
( మనిషి ఆలోచనలు ఎన్ని రకాలు అయినా గాని తన ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో బంధించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం చేసే బృహత్తర ప్రణాళికను సొంతం చేసుకొని జీవిత యాత్రలో ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపింది )
వసంత సుమాలులో 216 హరివిల్లు కవితలతో ఈ పుస్తకం మొత్తం కూడా చాలా సులభ, సరళ భాషా ప్రయోగం చేస్తూ విశ్లేషణాత్మకంగా హరివిల్లు ప్రక్రియలో రచన చేయడం కవయిత్రికి వెన్నతో పెట్టిన విద్యలా అగు పిస్తుంది. తన సాహితీ ప్రతిభను గుర్తిస్తూ వివిధ సాహితీ సంస్థలు ప్రశంసా పురస్కారాలు అందించాయి. ఇలా అక్షర దీపికను భద్రపరచడం శుభ సూచికం. చెప్పాలను కున్న ప్రతి విషయాన్ని సూటిగా పఠితలకు అర్థమయ్యే విధంగా, పిల్లలకు, నేటి యువతకే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేసే విధంగా ఈ పుస్తక రచన కొనసాగింది. ఇంకా మెరుగైన కవిత్వం, పద సంపత్తితో వసంత సుమా లుకు తోడు కోసం మరో అక్షర వసంత సుమాలు వెలు బడాలని సాహితీలోకం వేచిచూస్తుందని తెలియజేస్తూ అక్షరాభినందనలందజేస్తున్నాను.
డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్
– 9490841284