Saturday, July 27, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: తెలుగు నవలా సాహిత్య వైతాళికుడు 'ఉన్నవ'

Telugu Literature: తెలుగు నవలా సాహిత్య వైతాళికుడు ‘ఉన్నవ’

డిసెంబర్ 4... ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి

గాంధేయ వాదిగా, న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర యోధుడుగా, ఉద్యమ నాయకునిగా, స్త్రీ విద్య ప్రోత్సాహికునిగా, కాంగ్రెస్ నేతగా, దళిత జనోద్దారకునిగా, ప్రధానంగా తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగు వారికి సుపరిచితుడే. ముఖ్యంగా నాటి సాంఘిక దురాచారాలను ప్రతిబింబించే, మాలపల్లి నవల నాడు ఒక సంచలనమే.

- Advertisement -

సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి, కులవ్యవస్థను నిరసించి, అందరూ సమానులే అన్న భావనతో, అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి ఉండాలని కోరుకుంటూ, మాలపల్లి అనే విప్లవాత్మకమైన నవలను రవించడం, తన దృక్పథానికి మద్దతుగా, సహ పంక్తి భోజనాలు నిర్వహించడం ఆ రోజులలో సాహసమే. మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక నూతన ఒరవడిని సృష్టికి, చర్చోప చర్చలకు కారణభూతమైంది.

ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబరు 4వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించి, ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగించాడు. 1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో శిక్షణ పొందాడు. 1916లో బర్లాండ్, డబ్లిన్ ‍లలో బారిష్టర్ చదువు సాధించాడు.

గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర యోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేశాడు. గుంటూరులో శ్రీ శారదా నికేతన్ ను స్థాపించి, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. కందుకూరి వీరేశలింగం పంతులు అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించిన సంస్కర్తగా నిలిచాడు.

1900 లో గుంటూరులో “యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍”ను స్థాపించాడు. 1902లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, 1912 లోను సందర్శించి అనుభవాలను లక్ష్యానికి జోడించారు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి విశాలాంధ్ర పటం తయారు చేశాడు.
లక్ష్మీనారాయణ 1900లో గుంటూరులో ఉపాధ్యాయ వృత్తి, 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని, 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. రష్యాలో 1917లో జరిగిన బోల్షవిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఉన్నవ. కూలీల పక్షం వహించి కవులు రచనలు చేయడానికి ప్రేరణ నిచ్చింది సదరు రష్యా విప్లవ ప్రభావమే.1917 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. 1922లో గుంటూరులో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్య నేర్చుకునే అవకాశం కల్పించాడు. 1922 లో మాలపల్లి నవలను బెల్లంకొండ రాఘవరావు ముద్రించగా, మద్రాసు ప్రభుత్వం మాలపల్లి నవలపై నిషేధం విధించింది. రాజకీయ వాతావరణాన్ని, గాంధీ మహాత్ముని ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ఆ నవలలో సాంఘిక దురాచారాలు, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు, వర్ణ , వర్గ వ్యత్యాసాలు తదితర ఆ నాటి పరిస్థితులను కల గలిపి, కళ్ళకు కట్టినట్లు ఉన్నవ చిత్రించడం విశేషం. ఆనాడు హరిజనుల కుటుంబ గాథను ఇతివృత్తంగా ఎన్నుకొని నవల వ్రాయడమే సాహసం. 1926 లో మద్రాసు శాసన మండలిలో మాలపల్లి నిషేధంపై చర్చలు జరగడం, 1928 లో కొన్ని మార్పులతో మాలపల్లి ప్రచురణకు తిరిగి అనుమతి లభించడం, మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర విశ్వ విద్యాలయం మాలపల్లిని ప్రచురించి, ఆ నవలను పాఠ్య గ్రంథంగా ఎంపిక చేయడం, 1936 లో మద్రాసు ప్రభుత్వం మాలపల్లి నవలపై రెండోసారి నిషేధం తెలిపి ఆ నవలను పాఠ్యగ్రంథంగా తొలగించడం, 1937లో చక్రవర్తుల రాజగోపాలా చారి మద్రాసు ప్రధానిగా ఎన్నికైనప్పుడు తొలి కాంగ్రెసు మంత్రి వర్గంచే మాలపల్లి నవలపై నిషేధపు ఉత్తర్వులను రద్దు చేయించడం క్రమానుగతంగా జరిగి పోయాయి. సామాన్య ప్రజల సంక్షేమం, అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్న లక్ష్యంతో మాలపల్లి నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయ కవితల్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యే నిత్య వాడుక భాషలో జానపద గేయ రీతుల్లో రచించాడు. ఆ నవలకు కాశీనాథుని నాగేశ్వరరావు పీఠిక వ్రాస్తూ, “ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యం అని, తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము, మాలపల్లి నవలకు అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి” అని కొనియాడాడు. అందుకే తెలుగు సాహిత్యంలో వచ్చిన తొలి విప్లవ నవలగా గుర్తింపు పొందింది. మాలపల్లి, నాయకురాలు, బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావ తరంగాలు తదితర రచనలు చేశాడు.

ఇక 1923 లో కాంగ్రెసు స్వరాజ్య పార్టీలో చేరాడు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా ఎన్నికై, పల్నాడు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించాడు.

గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర యోధునిగా తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా కీర్తి పొందిన ఉన్నవ 1958 సెప్టెంబరు 25 న మరణించాడు.

రామ కిష్టయ్య సంగన భట్ల…9440595494

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News