Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Telugu Sahithyam: ప్రయోగశీలి ‘మాధవీసనారా’

Telugu Sahithyam: ప్రయోగశీలి ‘మాధవీసనారా’

శిలపరశెట్టి సత్యనారాయణ కలం బలం

శిలపరశెట్టి సత్యనారాయణ ‘మాధవీసనారా’ అనే కలం పేరుతో సాహిత్య లోకంలో ప్రసిద్ధులు. వీరు 1947 వ సం: నవంబర్ 11 వ తేదీన అప్పటి విశాఖపట్నం జిల్లా గవర్ల అనకాపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి రాములు నాయుడు, తల్లి అప్పల నరసమ్మ. తండ్రి పశ్చిమబెంగాల్లోని ఖర్గపూర్ లో రైల్వే ఉద్యోగిగా స్థిరపడటంతో సనారా బాల్యం అక్కడే గడిచింది. తొలి కవిత 1968 లో రాశారు. బెంగాల్ నుండి వెలువడిన తొలి తెలుగు వార్తాపత్రిక ‘మా వార్త’ కు సంపాదకత్వం వహించారు. తదుపరి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త పత్రికలకు విలేకరిగా పనిచేశారు. సుమారు 58 ఏళ్ల పాటు ఖరగ్పూర్ లోనే జీవితం గడిపారు. ప్రస్తుతం అనకాపల్లిలో నివసిస్తున్నారు. తన షష్టిపూర్తి సందర్భంగా అభిమానులు ఒక సావనీరును ప్రచురించారు. ఈయన రాసిన కొన్ని సంపుటాలలోని కవితా వ్యాసాంగాన్ని గురించి స్థాలీపులాకంగా వివరిస్తాను.
1988లో రాసిన ‘చందమామ’ అనే ఒక చిన్న కవితా సంపుటిలో సనారా ఇలా అంటారు. ‘ఆకాశ జలధిలో/వెన్నెల విహారాలు/చేసే వారి కోసం/ఏటి ఒడ్డున/నిలిచిన నావ/జాబిలి మావ’ అదే ఏడాది రాసిన ‘అగ్గిపుట్ట’ మినీ బుక్కులో ఇలా అంటారు. ‘ఆకాశవృక్షానికి/మొగ్గ లెయ్యకుండానే/ప్రతి ఉదయం పూచే/అగ్నిపుష్పం (సూర్యుడు)’1998లో రాసిన మరో చిరు కవితా సంపుటి ‘ఊయల’లో ‘ఊగుదమా ఊగుదమా/ఊయల కట్టి ఊగుదమా/ఆకాశానికి అంటేలాగా/ఆనందంగా ఊగుదమా’ ఈ సంపుటిలో తూరీగ, పిట్టబావ, కోతిబావ, భోగిమంటలు, ఏనుగమ్మ ఏనుగు మొదలైన 17 చిన్న కవితలు ఉన్నాయి. ‘వెన్నెలపిట్ట’ అనే మినీ కవితలో ‘ఆకాశం ఆల్చిప్ప/పున్నమి నాడు ప్రసవించిన/వెన్నెల ముత్యం’ అని అంటారు. 2001లో రచించి, ప్రచురించిన ‘అధరం మధురం’ అనే కవితా సంపుటిలో 34 పేజీలలో 68 ముద్దుల గురించి వర్ణించారు. ‘నీ పెదవి షహనాయి/నా మోవిని తాకితే/ముద్దుల మధుర రాగాలు/రాగాంబుధిలో/ఓలలాడిస్తాయి’ అని సనారా మృదు మధురంగా అంటారు. ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం రీడర్ డా: టి.గౌరీశంకర్ గారు ‘పెదవులపై ఇన్ని రకాలుగా రాయవచ్చా’అని విస్మయాన్ని వెలుబుచ్చారు. ఇదే పుస్తకానికి నృత్య సాహిత్య శేముషీ ధురంధరులు వి.ఎ.కె రంగారావు గారు వెనుకపాట రాశారు. ‘సనారా కవితలో శృంగారం రంగు ఉంది. లిబిడో రుచి ఉంది. హౌసుకాని సొగసు సౌరభం ఉంది. రాధ మనసు మెత్తదనం ఉంది’ అని ప్రశంసించారు.
2003లో ‘హైకూదీవి’ అనే మినీ కవితా సంపుటిలో 162 హైకూలు ఉన్నాయి. ఈ సంపుటికి ఖరగ్పూర్ వాస్తవ్యులు డా: రాజా విజయసారథి గారు కెలైడోస్కోపు పేరుతో పీఠిక రాశారు. హైకూ పుట్టింది జపానులో. జపాను ఒక దీవి. హైకూను ఐదు, ఏడు, ఐదు అక్షరాల్లో క్రమంగా మూడు పాదాల్లో రాయాలి. ఇది హైకూ లక్షణం. హైకూల్లో ఎక్కువగా ప్రతీకాత్మత ప్రతిబింబిస్తుంటుంది. సింబాలిక్ ఇమేజెస్ కి హైకూలు పెట్టింది పేరు. ‘ఊహాత్మక పద చిత్రాలు చిత్రించడానికి హైకూ ఓ మంచి సాధనం’ అని కైకూని నిర్వహించారు. ‘హైకూదీవి’లోని కవితా సౌందర్యాన్ని ఉగ్గడిస్తూ ఆయన మళ్లీ ఇలా అంటారు. “ఈ హైకూలను చదివిన పాఠకుడిని పలుకు బడులు పలకరిస్తాయి. జాతీయాలు పులకింపజేస్తాయి. నుడికారాల నయాగారాల్లో, సూక్తి సుధల్లో, సామెతల ఆమెతల్లో స్నానం చేస్తాడు పాఠకుడు” అని ప్రశంసించారు. మచ్చుకు రెండు మూడు కైకూలు ఇక్కడ ఉదహరిద్దాం. “విమానం నుండి/చూస్తుంటే వీధయ్యింది/పట్టణమంతా; ఇంటి చూరుపై/చుట్టాలొస్తున్నారహో/కాకి దండోరా; తెల్లారిందని/మేజాపై గడియారం/కోడై కూసింది” ఇలా. పుస్తకం అట్ట వెనుక ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు డా: తలతోటి పృథ్వీరాజు గారు ‘హైహై’ పేరుతో కవి పరిచయం చేశారు.
వీరి మరో మినీ కవితా సంపుటి ‘తంకాలు’ 2004లో ప్రచురించారు. 28 పేజీల పుస్తకంలో 56 తంకాలు ఉన్నాయి. తంకాలు కూడా జపాను లోనే పుట్టాయి. ప్రప్రథంగా తంకా (టంకా) లను తెలుగు వారికి పరిచయం చేసింది డా: ఎన్. సంజీవదేవ్. ‘శబ్దం పుట్టిస్తా/భాషా డమరుకంతో/కలం బలంతో/భావాలు కురిపిస్తా/నృత్య భంగిమలుగా’ అంటూ ప్రతిజ్ఞ లాంటి రచయిత వాక్యాలతో ఈ కవితలు ప్రారంభమవుతాయి. ‘‘ఎన్నెన్ని కోట్లు/ నేల మీది మంచులా/ కుంభకోణాల ఎండకి తడి ఎండి/ ఆనవాళ్లూ ఉండవు; నది వంతెన/ఎంత భరిస్తూ ఉంది/నిత్యం తొక్కినా/బాధే దానికి సౌఖ్యం/సేవే దానికి ముఖ్యం’’ విజయసారథి గారు రాసిన ముందుమాటలో ‘ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయా రూపంతో మెరిసిపోయే స్వరూపిణీ తంకా. కల్పనాశక్తికి వివేకమే శరీరం. కల్పనే వేషం. ఆవేశమే ప్రాణం. ఊహే ఆత్మ’ అని ఉద్ఘాటించారు.
2005లో ‘శ్రీ శేషసాయి శతకం’ పేరుతో 108 వచన పద్యాల పుస్తకం రచించారు.’సాయి పేరులోనే సాయం ఇమిడుంది/సాయపడుట సాయి సహజ గుణము/సాయికన్న సాయపడువారు వేరెవరు/షిరిడి పుర నివాసి శేష సాయి’ అని షిరిడీసాయి భక్తి సుధార్ణవంలో మునిగితేలారు సనారా. 60వ దశకంలో హైదరాబాదులో దాశరథి గారి అధ్యక్షతన అఖిల భారత తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. ఆ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో ఆరుద్ర గారు ‘కొత్త వరవడి’ అనే కవిత చదివారు. ‘కవిత కోసం నేను అట్టేను/కాంతి కోసం కలం పట్టేను’ అంటూ వారణమాలా ఛందస్సులో రాసిన ఆ కవిత సనారాని ఆకట్టుకుంది. దాని ప్రభావంతోనే ‘తల్లి ఒడిలో నేను పెరిగాను/తండ్రి ఆజ్ఞను మీరకున్నాను’ అని రాసుకున్నారు. సనారా రాసిన ‘మనోగవాక్షం’ అనే కవితా సంపుటిలో 22 వచన కవితలు ఉన్నాయి. అందలి అవతారికలో తన కవితా రచనకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడించారు. ‘జీర్ణం కాని వాతాపి’ అనే కవితలో ‘అది తేలుతూ మనల్ని ముంచి కుళ్ళిన శవం పాలథీన్’ అంటారు. ‘శ్వేతాంబరధారులు’ అన్న కైత కుహనా వైద్యులకు చేసే హెచ్చరిక వంటిది. ‘గ్లోబల్ వ్యాపారి’ అనే కవితలో ‘వాడికి అవకాశం చిక్కాలే కాని/సూర్యుడి కిరణాల్ని పక్షిరెక్కలు విరిచినట్టో/మధ్యతరగతి మనిషి నడ్డి విరిచేసినట్టో/విరిచెయ్యగల వేటగాడు వాడు’ అని నిష్టూరమాడుతాడు. సనారా మరో కవితా సంపుటి రెక్కల గుర్రం. ఇందులో 216 హైకూలున్నాయి. ‘వరాలే తప్ప/శపించని వేల్పులు/తల్లిదండ్రులు. అమ్మానాన్నలు గుడి లేని దైవాలు/వరదాతలు; ఎన్ని దశలో/మెతుకవడానికి/పండిన వరి. భూమి పొత్తంపై/మేఘం చేసిన సంతకం/కురిసే వాన’ ఇలా అందంగా సాగుతాయి. ‘అమ్మమ్మ చేతి కడియాలు’అనేది 100 పేజీల గ్రంథం. ఇందులో 62 కవితలు ఉన్నాయి. ‘అమ్మమ్మ చేతి కడియాలు/ చూసేవాళ్ళకు భయపెట్టే ఆయుధాల్లా కనిపించేవి/అవి ఆమె వెంట నడిచే బాటసారులు/ఆమె ఊపిరిలో ఊపిరై కదిలిన ప్రాణ స్పందనలు’ అంటూ తన చిన్ననాటి మధుర స్మృతులను అక్షరీకరించారు సనారా. ‘ఎవడి కవిత్వమయితే/మధురంగా ఉండి/దాహ బాధ రెట్టింపు చేస్తుందో/అటువంటి కవిత్వమే రావాలి’ అని అంటారు. 2018లో ‘బాపూజీకో నూలుపోగు’ అనే 20 కవితల చిన్న పుస్తకాన్ని గాంధీజీ మూడు యాభైల జయంతి సందర్భంగా ఆవిష్కరించుకున్నారు. ఇంకా ‘రెక్కలల్లార్చి’అనే సంపుటిలో 100 రెక్కల మినీ కవితలు రాసి ప్రచురించుకున్నారు. ప్రతి రెక్కలోనూ నాలుగు పంక్తుల తరువాత ఒక సర్ప్రైజ్ ను, ఒక సస్పెన్స్ను సనారా సృష్టించారు. ‘ప్రయాణించి/ప్రయాణించి/అవతరించింది/ పల్లె ఇప్పుడు; సంతోషపెట్టే వాళ్లే/కాదు/బాధ పెట్టే వాళ్ళూ ఉంటారు/ప్రపంచం వెలుతురూ చీకటి’ ఇలా రెక్కలు పాఠకులను ఆకట్టుకుంటూ ముందుకు కదులుతాయి. సనారా మరో రచన ‘అమల అంతరంగం’. ఇందులో 23 చిన్న కథలు ఉన్నాయి. సహజమైన వ్యంగ్య పూరిత హాస్యధోరణితో ఈ కథలు నడుస్తాయి. ఇందులో కథాకథనం పాఠకులను చదివిస్తుంది. దీనితో సనారా కథకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.
‘మాధవీసనారా’ తొలుత మినీ కవితలు రాశారు. తర్వాత వ్యంగ్య కథలు రాశారు. విదేశీ కవితా ప్రక్రియలైన హైకూ, తంకా మొదలైన లఘురూప కవితలతో అనేక ప్రయోగాలు చేసారు. ఆయా ప్రక్రియల్ని పరిపుష్టం చేయడానికి విశ్వప్రయత్నం చేసి సఫలుడయ్యారు. వచన కవితా స్రవంతిలో తాను చెప్పదలుచుకున్న భావాలను నిర్దిష్టంగా, నిష్కర్షగా చెప్పి తన సాహిత్య పిపాస తీర్చుకున్నారు. ఒకపక్క వృత్తి ఉద్యోగాల్లో ఉన్నా, కవిత్వాన్ని తన రెండో ప్రాణంగా భుజాన వేసుకుంటూనే ముందుకు వెళ్లారు. సనారాకు ప్రఖ్యాత అభ్యుదయ కవులు ఆరుద్ర, అనిసెట్టి, దాశరథి మొదలైన వారితో సన్నిహిత సంబంధాలుండేవి. రజనీ-కుందుర్తి పురస్కారం, లాయర్ పత్రిక వారి, భావవీణ పత్రిక వారి, శరత్ కళా స్రవంతి వారి, స్పందన వారి కథల పోటీలో బహుమతులు గెలుచుకున్నారు. మినీ కవిత్వంలో తనదైన శైలిలో సాహిత్య సృజన చేసిన ‘మాధవీ సనారా’ గారి రచనలపై పరిశోధన జరగాల్సి ఉంది. పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నించగలరని ఆశిస్తున్నాను.

- Advertisement -

సీరపాణి…8790232565

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News