Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Tensions: భయపెట్టడం భావ్యం కాదు

Tensions: భయపెట్టడం భావ్యం కాదు

భయాందోళనలు కలిగించే వాతావరణ సృష్టించవద్దంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి)ను సుప్రీంకోర్టు సుతిమెత్తగా మందలించింది. అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన వారి విషయంలో ఇ.డి తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది.పాలక పక్షం తమ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి, పగ సాధించడానికి ఇ.డిని ఉపయోగించుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఆబ్కారీ శాఖకు చెందిన ఉద్యోగులు కొందరు ఒక మద్య కుంభకోణంలో అక్రమ ద్రవ్య మార్పిడి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చినప్పుడు ఇ.డి ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో ఇ.డి ఆ ఆబ్కారీ ఉద్యోగులను భయపెడుతోందంటూ ఒకరు కేసు వేయడంతో సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. నిందితులకు భయం కలిగించే విధంగా ఇ.డి వ్యవహరించే పక్షంలో అసలు ప్రయోజనం దెబ్బతింటుందని, తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఈ దర్యాప్తు సంస్థ తరచూ తన హద్దులను అతిక్రమిస్తోందని, నిందితులను భయపెట్టడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి, ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతోందని పిటిషన్‌దారు (ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం) ఆరోపించడం జరిగింది. ఈ సంస్థ తన ఇష్టానుసారం వ్యవహరిస్తోందని, మంత్రుల్ని, అధికారుల్ని వీలైనంతగా భయపెడుతోందని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ను ఈ కేసులో ఇరికించే ఉద్దేశంతోనే ఇ.డి ఈ విధంగా మంత్రులు, అధికారులను బెదరిస్తోందని కూడా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఆరోపణల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ, నిందితులను ఏ విధంగా ప్రశ్నించి వాస్తవాలను రాబట్టాలనేది మాత్రం అర్థం కాని విషయంగా కనిపిస్తోంది. ఈ ఇ.డి గత కొంత కాలంగా ఎక్కువ సంఖ్యలో అవినీతిపరులను విచారించడమనేది కాకతాళీయం కాకపోవచ్చు. ప్రతిపక్షాలు ఇ.డి రాజకీయమయం అయిపోతోందంటూ ఆరోపణలు సాగిస్తున్నాయి. మనీ లాండరింగ్‌ చట్టాన్ని కూడా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు కోసం ఉపయోగించుకుంటున్నట్టు అవి ఆరోపిస్తున్నాయి. నిజానికి చాలా ఏళ్లుగా మనీలాండరింగ్‌కు సంబంధించిన నేరస్థుల జాబితా కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంది. అయితే, తగిన ఆధారాలు లేకుండా ఎవరిని ప్రశ్నించినా, ఎవరిని విచారించినా అది కక్ష సాధింపుగానే కనిపిస్తుందని, అందువల్ల ఇటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందనిసుప్రీం కోర్టు కూడా అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఇ.డికి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి 2018లో రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్స్‌టెన్షన్‌ మీద ఉన్నారు. ఆయన కోసం సంబంధిత చట్టాన్ని కూడా సవరించి, ఆయనకు ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వడం జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్‌ తర్వాత ఆయన పదవీ కాలం ముగుస్తుందని, ఆయనకు పొడిగింపు ఇవ్వడం జరగదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ సంస్థ చట్టబద్ధంగానే దర్యాప్తు చేస్తోందని, అది తన విధులను సక్రమంగానే నిర్వర్తిస్తోందని, నిందితులు, నేరస్థులకు దీని దర్యాప్తుపై బురదజల్లడం సహజమేనని ప్రభుత్వం వివరించింది. ఇది ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్రంగానే పనిచేస్తోందని కూడా తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News