Monday, May 20, 2024
Homeనేషనల్ఉగ్రవాదానికి అండ ఆర్థిక టెక్నాలజీ

ఉగ్రవాదానికి అండ ఆర్థిక టెక్నాలజీ

అక్రమ మార్గాల ద్వారానే కాకుండా, అతి పెద్ద నెట్వర్క్ కలిగిన ఆన్ లైన్ లావాదేవీల ద్వారా కూడా ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్త రకం హవాలా మార్గాల్లో ఉగ్రవాదులు ఎంతగానో లబ్ది పొందుతున్నారని భారత్ వెల్లడించింది. ఆన్ లైన్, బోగస్ లావాదేవీలు, ఆర్థిక ప్రయోజనాల దుర్వినియోగం వంటి పద్ధతుల ద్వారా కొందరు వ్యక్తులు ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తున్నట్టు భారత్ తెలియజేసింది. లాభాపేక్ష లేని సేవా సంస్థల పేరుతో కొన్ని సంస్థలు అవతరించి, ప్రజల నుంచి సేకరించిన నిధులను ఉగ్రవాదులకు మళ్లిస్తున్నారనే అభిప్రాయాన్ని No money for terror మొదటి రోజు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు నిధులు అందించటానికి కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు ఎప్పటికప్పుడు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నాయని ప్రభుత్వానికి చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అనే అంశంపై రెండు రోజులగా ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశ భద్రతను అస్థిరం చేయడానికి ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటున్నట్టు స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థీకృత నేరాలను, ఉగ్రవాదాన్ని వేర్వేరుగా చూడలేమని ప్రధాని తెలిపారు. మారిషస్, ఆస్ట్రేలియా, మరికొన్ని యూరప్ దేశాలు లాభాపేక్ష లేని సేవా సంస్థలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ లాభాపేక్ష లేని సేవా సంస్థలను కొందరు దుర్వినియోగం చేయడం, స్వల్ప లాభానికి, స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయని, తమ విప్లవాత్మక సిద్ధాంతాలను ప్రచారంలోకి తీసుకు రావడానికి ఉగ్రవాదులకు సహాయ పడటానికి వాడుకుంటున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ సమావేశంలో హవాలా, హుండీ లావాదేవీలపై కూడా చర్చ జరిగింది. వివిధ రకాల నగదు బదిలీలపై కూడా లోతైన చర్చ జరిగింది. అంతేకాదు, ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంతర్జాతీయ నేరాలకు మధ్య లింకు ఉండటంపై కూడా విస్తృత చర్చ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. “ఉగ్రవాదం మీద పోరాటంలో వ్యవస్థీకృత నేరాలపై చర్యలు తీసుకోవటం అన్నది అతి ముఖ్యమైన భాగం. నగదు మళ్లింపులు, ఆర్థిక నేరాలు వంటి మార్గాలతో కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ సహకారం చాలా అవసరం” అని ప్రధాని వివరించారు.

“ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి, ఉగ్రవాదలను తయారు చేయడానికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసండార్క్ నెట్, ప్రైవేట్ కరెన్సీ వంటివి ఉద్భవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సరికొత్త ఆర్థిక టెక్నాలజీని ఎదుర్కోవటానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంది” అని ప్రధాని సూచించారు. రకరకాల మార్గాల ద్వారా తమకు ఇబ్బడిముబ్బడిగా నిధులు అందుతుండటంతో ఉగ్రవాదులు ఆధునిక అస్త్రాలను సమకూర్చుకోవటం, వాటిని లాఘవంగా వాడుకోవటంలో నిష్ణాతులవుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. సైబర్ నేరాల వంటి ఆధునిక టెక్నాలజీ సంబంధమైన అక్రమాల్లో కూడా ఆరితేరుతున్నారని షా వెల్లడించారు. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం అవసరమని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క మతానికో, వర్గానికో, జాతీయతకో ఆపాదించటం సబబు కాదన్నారు షా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని బలోపేతం చేయటమే కాక, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ను శక్తిమంతం చేసిందని షా వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News