భారతదేశంలో అతి తక్కువ ధరకు ఎలక్ట్రికల్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సంబంధించి టెస్లా సంస్థ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ చర్చలు జరిపే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను, అత్యంత ఆధునిక మోడల్స్ ను ఉత్పత్తి చేయడంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఎలాన్ మస్క్ కు చెందిన ఈ టెస్లా కంపెనీ ధరల విషయంలో పట్టుదలతో వ్యవహరించే భారతీయులకు ఓ ఆశాజ్యోతిగా కనిపిస్తోంది. ఈ కంపెనీ ఇరవై లక్షల రూపాయల ధర దగ్గర నుంచి కార్ల ఉత్పత్తిని చేపట్టడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు మోడల్ 3 కార్లను అరవై లక్షల రూపాయల ధరతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు రాబోతోంది. చౌక ధరకు భారతీయులకు కార్లను విక్రయించబోవడం అనేది టెస్లా విషయంలో ఘనకార్యమేమీ కాదు. అది తన అవసరాల కోసం తన విధానాన్ని మార్చుకోవడం జరిగింది. టెస్లా కంపెనీ తన కార్ల ధరలను 50 శాతం వరకూ తగ్గించబోతోంది. కార్ల ఉత్పత్తిని పెంచుకుని, వాటి విక్రయాలు పెరిగేటట్టు చేయడంతో పాటు, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు) ఉత్పత్తి చేసే ఇతర సంస్థల నుంచి పోటీని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
టెస్లా సంస్థ కనుక భారతదేశంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభించే పక్షంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఈవీల వాడకం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే, టెస్లా కోసం తన నియమ నిబంధనలను సవరించడానికి ఎలాన్ మస్క్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వస్తుండడం మాత్రం సహించరానిది. పూర్తిస్థాయి దిగుమతి పరికరాల కోసం తాము దిగుమతి సుంకం వ్యవస్థను మార్చే ప్రసక్తి లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఇక్కడ ఉత్పత్తి చేయాలన్న ప్రణాళికలను టెస్లా గత ఏడాదే ఉపసంహరించుకుంది. ముందుగా భారత మార్కెట్ ను పరీక్షించడానికి టెస్లా సంస్థ తమకు అవసరమైన పరికరాలను షాంఘై నుంచి దిగుమతి చేసుకోవాలని భావించింది. సాధారణంగా 40 లక్షల రూపాయల కంటే తక్కువ ధర ఉన్న కార్లకు 60 శాతం సుంకం విధిస్తుండగా దాన్ని తమకు 40 శాతానికి తగ్గించాలని ఈ సంస్థ డిమాండ్ చేయడం ప్రారంభించింది.
భారతదేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి వీలుగా తాము తమ దిగుమతి సుంకం విధానాలను రూపొందించు కున్నామని కేంద్రం ఆ సంస్థకు స్పష్టం చేసింది. ఈ సంస్థ తనకు కావాల్సిన పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశానికి ఏ విధంగానూ ప్రయోజనం లేదని కూడా వాదించింది. అయితే, గత జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎలాన్ మస్క్ అమెరికాలో కలుసుకుని చర్చలు జరిపిన తర్వాత టెస్లా కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇది ఇలా ఉండగా, మొత్తం భారత్‌లో ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీల వాటా ప్రస్తుతానికి రెండు శాతం మాత్రమే. అయితే, ఈవీల వాడకం వేగంగా పెరుగుతున్న మాట నిజం. బి.ఎం.డబ్ల్యు ఈవీ రూ. 1.2 కోట్లు, టాటా నెక్సన్ ఈవీ రూ. 14.4 లక్షలు, ఎం.జి కామెట్ ఈవీ 8 లక్షలకు విక్రయం అవుతున్నాయి. వీటికి భారత్ రాయితీలు కల్పిస్తోంది. అయితే, టెస్లా మాత్రం తాము కార్ల విడి భాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పటికీ తమకు దిగుమతి సుంకంలో రాయితీని ఇవ్వాలని పట్టుబడుతోంది. నిజానికి, టెస్లా కంపెనీ ఏకఛత్రాధిపత్యం ప్రస్తుతం చెల్లుబాటు కావడం లేదు. అనేక ఈవీ కార్ల కంపెనీల్లో ఇదొకటి అనే స్థాయికి ఇది ఎప్పుడో చేరుకుంది.
Tesla in India: టెస్లాకు మార్గం సుగమం అయ్యిందా?
ఈవీ వెహికిల్స్ లో టెస్లా మోనోపలీ ఎప్పుడో పోయింది, మిగతా కార్లలో ఇదీ ఒకటి అంతే