Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Torn clothes a symbol of trend? or poverty?: చింపుకున్న నాగరికం,చిరిగిపోయిన పేదరికం

Torn clothes a symbol of trend? or poverty?: చింపుకున్న నాగరికం,చిరిగిపోయిన పేదరికం

భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ దుస్తులు ప్రపంచానికే ఆదర్శం గా నిలుస్తాయన్నది ఎప్పటికీ నిజం. మనుషుల వేషధారణను బట్టి వారు ఏ దేశానికి చెందినవారో చెప్పవచ్చు. ప్రతి దేశంలో వస్త్ర సంస్కృతి చాలా ముఖ్యమైనది. పూర్వం మన పెద్దలు “కట్టు, బొట్టు” పేర వస్త్రధారణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేటి మన యువత ఫ్యాషన్ రంగంలో అమెరికన్ మరియు యూరోపియన్ సంస్కృతికి ఎక్కువగా ప్రభావితమై మన స్వదేశీ వస్త్ర సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తున్నారని సాంప్రదాయవాదులు చాలా కాలంగా వాపోతున్నారు. మన యువత ఆర్ధిక, వస్త్రధారణ, సంస్కృతీసాంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల లాంటి ఎన్నోఅంశాలలో పాశ్చాత్య పోకడలను అనుకరిస్తున్నారనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మన దేశ సంప్రదాయాలను విస్మరించి పాశ్చాత్య సంప్రదాయాలకు దాసోహం కావడం విచారకరం. మన దేశీయ వస్త్రధారణ పట్ల విముఖత మరియు విదేశీ వస్త్రధారణ పట్ల సుముఖతతో దేశీయ వస్త్ర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలకు ఆదరణ కొరవడి మన నేతకారులు ఉపాధి కోల్పోతున్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ దుస్తులలో సైతం పాశ్చాత్య ఫ్యాషన్ లను తలదన్నే విధంగా అనేక మార్పులు వచ్చాయి. నేడు వస్త్రధారణలో చోటుచేసుకుంటున్న జుగుప్సాకరమైన మార్పుతో డబ్బున్నోడు బట్టలను ఫ్యాషన్‌ అంటూ చించుకుంటుండగా డబ్బు లేనోడు అవే చిరిగిన బట్టలను కుట్టి వేసుకుంటున్నారు.. అంత మార్పు జరిగింది..
ఆ రోజుల్లో ఒక మనిష ధనవంతుడా లేదా పేదవాడా అన్నది ఆ వ్యక్తీ ధరించే బట్టలను బట్టి అంచనా వేసే వారు. కానీ ఈ రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే వెర్రిలో అత్యధిక శాతం యువత చిరిగిన వస్త్రాలు ధరించడం వలన అది సాధ్యం కావడం లేదు.

- Advertisement -

పేద, ధనిక అంతరాలు:
పేదవాడు ఆర్థికంగా ఎదగక పోవడానికి కారణం డబ్బు లేకపోవడమే. పేదవారికి ఏదైనా సాధించాలనే ఆలోచన, తపన, అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడానికి పెట్టుబడి పెట్టే స్థోమత ఉండదు. ధనవంతుడు తన కళ్ల ముందు ఎన్నో అవకాశాలు మరియు తనకు కావలసినది కొనడానికి డబ్బు అందుబాటులో ఉండడంతో మరింత ధనవంతుడు అవుతాడు. అయినప్పటికీ మరింత సంపాదించాలనే ఆలోచనతో నిరంతరం కొత్త మార్గాలను వెతుక్కుంటూ మనశ్శాంతిని కోల్పోతుంటాడు.
“కోటివిద్యలు కూటికొరకే” అన్నట్లు ఇప్పటికీ తినడానికి తిండి లేక నిరుపేదలు అలమటిస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. నిరుపేదలు తిండి దొరకక పస్తులు ఉంటుండగా మరికొంతమంది ధనికులు మాత్రం కడుపునిండా తిన్నా ఎలా అరిగించుకోవాలో తెలియక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే ‘లేనోడు తిండికేడిస్తే. ఉన్నోడు అరగక ఏడ్చిండట’ అనే నానుడి పుట్టిందేమో బహుశా. ఉన్నోడికి అన్ని ఉంటాయి లేనోడికి ఏమి ఉండవు అన్నట్టుగా చాలా విచిత్రం ఏమిటంటే, పేదలకు అందుబాటులో లేని ప్రభుత్వ రేషన్ కార్డులు ధనికులకు లభిస్తున్నాయి, రేషన్ బియ్యం తినని వారికి రేషన్ కార్డులు ఉంటున్నాయి, నిరుపేదలకు మాత్రం రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో అందలేకపోతున్నాయి. ఇది మన దేశంలో పేదలకు జరుగుతున్న అన్యాయం. ఏ ఆపద వచ్చినా నష్టపోయేది పేదలే. ఆకలితో అలమటించేది పేదలే.. నిరుపేదలే ప్రాణాలు కోల్పోతున్నారు. పేద పిల్లలకు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులకు చదివించే స్తోమత ఉండదు. అదే ధనికుల పిల్లలకు చదవాలనే ఆసక్తి లేకున్నా తల్లిదండ్రులు చదువుకోరా బాబు అని ఎంత చెప్పిన చదవడం చేతకాదు. అందుకే ఒక సామెత పుట్టింది ఎద్దున్నోడికి బుధ్ది ఉండదు బుద్ధి ఉన్నోడికి ఎద్దుండదని. డబ్బు లేని వారికి చదువుకోవాలనే కోరిక ఉంటుంది అందుకే డబ్బు లేని వారు కష్టపడి ప్రయోజకులు అవుతారు. జాతీయ స్థాయి సివిల్స్‌ పరీక్షలలో విజయం సాధించిన వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. పైగా వీరంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కావడం గొప్ప విషయం.

భారతదేశంలో పేద రాష్ట్రాల గురించి నీతి ఆయోగ్ కీలక విషయాలను వెల్లడించింది. బీహార్‌లో సగానికి పైగా పేదలు ఉండగా, కేరళలో ఒక్క శాతం కూడా పేదవారు లేరని వెల్లడించింది. భారతదేశం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నప్పటికీ. దేశంలోని పేదలు ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు. మధ్యతరగతి వారు కూడా పేదలుగా మారుతున్నారు. ధనికులు మాత్రమే ధనవంతులు అవుతున్నారు మరియు కొద్దిమంది మాత్రమే ప్రపంచ కుబేరులు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారనే సందేహం అందరిలోనూ కలగడం సహజం. ఈ సందేహాలకు నీతి ఆయోగ్‌ తెరదించుతూ షాకింగ్ గణాంకాలు విడుదల చేసింది.
నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో అత్యంత పేద రాష్ట్రమైన బీహార్‌లో 52 శాతం మంది పేదలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో సగానికి పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. మానసిక ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట గ్యాస్ మరియు విద్యుత్ సౌకర్యాలు లేనివారు బీహార్‌లో ఎక్కువ శాతం ఉన్నారు. బీహార్‌లో పోషకాహార లోపం ఉన్నవారి శాతం అత్యధికంగా ఉంది. ఆ తర్వాత జార్ఖండ్ 42.5 శాతం, యూపీ 32 .67 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 36.65 శాతం, మేఘాలయలో 32.67 శాతం పేదలు ఉన్నారు.
అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో కేవలం 0.71 శాతం మంది మాత్రమే పేదరికంలో ఉన్నారు. అంటే కేరళలో ఒక్క శాతం కూడా పేదలు లేరన్నమాట. పేదలు ఒక శాతం లోపే ఉన్నారు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే అక్కడి ప్రజలందరికీ గుడ్డ, నీడ కొరత లేదు. తర్వాతి స్థానంలో ఈశాన్య రాష్ట్రం సిక్కిం ఉంది. ఆ తర్వాత దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో 4.89 శాతం మంది పేదలు మాత్రమే ఉన్నారు. పంజాబ్‌లో 5.59 శాతం మంది పేదరికంలో ఉన్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో 13.74 శాతం పేదలతో ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఏపీ 20వ స్థానంతో కాస్త మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 12.31 శాతం మంది పేదలున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు తెలంగాణలో 31.10 శాతం కాగా ఏపీలో 26.38 శాతం ఉన్నారు. శిశు మరణాల విషయంలో ఏపీలో 1.82 శాతం, తెలంగాణలో 1.38 శాతం సంభవిస్తున్నాయి.

పేదరిక నిర్మూలన సాధ్యమేనా?

యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ఒకటి 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం. అయితే, ఆ కాలం ముగిసే సమయానికి, ప్రపంచ జనాభాలో ఆరు శాతం మంది అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన ఉంటారని జూలై 2019లో సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు “పేదలకంటే సంపన్నులకు ఎక్కువ అందుతున్నాయని, అందువల్లే భారతదేశంలో పేదలు పేదలుగానే మగ్గుతున్నారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలంటూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదోడి నెత్తిన అధిక భారాన్ని మోపుతున్నారు. ఉచిత పథకాలలో భాగంగా ప్రభుత్వాలు అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. పైగా ప్రజల సొమ్మును ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడం వల్ల పేదరికం మరింత పెరిగే అవకాశం ఉండడమే కాక కొందరు రాజకీయ నాయకుల అవినీతి, స్వార్థచింతన కూడా ప్రధాన కారణమవుతున్నాయని చెప్పవచ్చు. దేశంలో అవినీతి అంతమై పేదలకు సరైన మెరుగైన మౌలిక సదుపాయాలు లభించినప్పుడు మాత్రమే పేదరికం నిర్మూలించబడుతుంది.

-కోట దామోదర్
9391480475

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News