భారతదేశం విషయంలో గతంలో మానవ హక్కులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన అగ్రరాజ్యాలు ఇప్పుడు వాటినన్నిటినీ పక్కనపెట్టి వాణిజ్య సంబంధాల మెరుగుదల కోసం తాపత్రయపడుతున్నాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయేల్ మ్యాక్రాన్ ఘనాతిఘనమైన స్వాగతం పలకడానికి కారణం ఇదే. ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి, అభ్యున్నతి కోసం భారత్ తో దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాల కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బైడెన్, మ్యాక్రాన్‌ల ప్రయత్నాలకు ప్రపంచంలో అతి పెద్ద పెట్టుబడి సంస్థలలో ఒకటి అయిన ‘క్యాపిటల్ గ్రూప్’ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ 2.2 ట్రిలియన్ డాలర్ల సంస్థ తన తాజా నివేదికలో ఇందుకు కారణాలను కూడా పేర్కొంది. అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్ లతో పాటు అనేక దేశాలకు భారత్ ఇప్పుడు ఇతర అన్ని దేశాల కంటే ఎక్కువగా ఒక ప్రధాన పెట్టుబడుల గమ్యంగా మారిందని అది స్పష్టం చేసింది.
ఇతర అనేక దేశాలతో పోలిస్తే భారత్ లో రాజకీయ సుస్థిరతకు ఢోకా లేదని, ప్రాథమిక సదుపాయాలు కూడా ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందుతున్నాయని, ఉత్పత్తి రంగం పెరిగి పెద్దదవుతోందని, ఉత్పత్తి రంగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈక్విటీ మార్కెట్ కూడా పురోగతి చెందుతోందని ఈ పెట్టుబడుల సంస్థ తన నివేదికలో వివరించింది. భారతదేశంలో చెల్లింపులకు సంబంధించిన యూనిఫ్్ైడ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యు.పి.ఐ) చెల్లింపుల వ్యవస్థను విప్లవీకరించడంతో పాటు డిజటలీకరణ చేసిందని, ఆధునిక విమానా శ్రయాలు, రైల్వేలు, సముద్ర రవాణా సౌకర్యాలు అనూహ్యంగా అభివృద్ధి చెందడమే కాకుం డా, కనెక్టివిటీని పెంచి, ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించి వేశాయని కూడా అది తెలి యజేసింది.
ఈ సంస్థ తన నివేదికలో చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ అయిన ఎం.ఎస్.ఎం.ఇ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీని కింద లక్షలాది చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాయని, ఫలితంగా ఉత్పత్తి రంగం విస్తరించిపోయిందని అది పేర్కొంది. అభివృద్ధితో పాటు సరికొత్త ఆవిష్కరణలకు కూడా ఇవి ఆలవాలమయ్యాయని అది తెలిపింది. ఆర్థిక మాంద్యం వల్ల పాశ్చాత్య దేశాల నుంచి నైపుణ్యం కలిగిన ప్రతిభా వంతులైన ఉద్యోగులను తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడడంతో, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి భారతదేశంలో అన్వేషణ సాగిస్తున్న బహుళ జాతి సంస్థలు కూడా ఈ పెట్టుబడుల సంస్థకు భారత్ అనుకూల నివేదికలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల రిక్రూట్మెంట్‌కు సంబంధించిన అతి పెద్ద సంస్థ ‘ఎక్స్ ఫెనో’ అందించిన సమాచారం ప్రకారం, భారతదేశంలోని ఈ బహుళజాతి సంస్థలు (ఎం.ఎన్.సిలు) వివిధ పద్ధతులు, మార్గాల ద్వారా సుమారు అయిదు లక్షల మంది ఉద్యోగులను తాజాగా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్మా, రిటైలింగ్, రిటైల్ ఎనర్జీ, టెలికామ్, ఆటోమోటివ్ రంగాలు ఎక్కువ సంఖ్యలో రిక్రూట్ చేసుకోవడం, ఈ రంగంలో ఎక్కువ పెట్టుబడులకు అవకాశాలు పెరగడం జరుగుతోంది.
భారత్‌లో అవకాశాలు, సౌకర్యాలు పెరుగుతున్న మాట నిజం కావచ్చు. ఇందుకు పటిష్ఠమైన పునాదుల ఉంటే ఉండవచ్చు. అయితే, ఈ సానుకూల ధోరణులపై బురద చల్లడానికి కొన్ని శక్తులు తీవ్ర స్థాయిలో పని చేయడాన్ని కూడా కాదనలేం. మణిపూర్ లో అల్లర్లను రెచ్చగొట్టడం, మత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం వంటి సంఘటనలను తోసిపారేయలేం. వీటిని సాకుగా తీసుకుని భారత్‌ను ఇబ్బంది పెడుతున్న దేశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి విషయాల పట్ల భారత్ ప్రత్యేక శ్రధ్ధ చూపించాల్పి ఉంటుందనడంలో సందేహం లేదు.
Trade relations: మెరుగుపడుతున్న వాణిజ్య సంబంధాలు
ఈ సానుకూల ధోరణులపై బురద చల్లడానికి కొన్ని శక్తుల ప్రయత్నాలు