Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్UCC: యూసీసీపై ఆచితూచి అడుగులు

UCC: యూసీసీపై ఆచితూచి అడుగులు

విపక్షాల ఐక్యతకు యూసీసీ నిప్పు

ఒకే దేశం ఒకే చట్టం అనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ గురించి తరచూ ప్రస్తావించడం దేశంలో అనేక విధాలైన చర్చలకు, వాదోపవాదాలకు దారితీస్తోంది. రాజకీయంగానే కాకుండా, సామాజిక, మత సంబంధంగా కూడా మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. విచిత్రమేమిటంటే, కేంద్రంలోని బీజేపీని ఓడించడానికి ఒక ఉమ్మడి వ్యూహం రూపొందించడానికి పాట్నాలో సమావేశమైన ప్రతిపక్షాలు కూడా ఈ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ (ఉమ్మడి పౌర స్మృతి) విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఉద్ధవ్‌ థాకరే నాయకత్వంలోని శివసేన పార్టీలు బహిరంగంగానే ఈ సివిల్‌ కోడ్‌ను సమర్థించడం జరుగుతోంది. వారు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44ను ఉటంకిస్తూ, దేశవ్యాప్తంగా ఒకే విధమైన సివిల్‌ కోడ్‌ ఉండడానికి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. ఇతర ప్రతిపక్షాలు మాత్రం శివసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుల అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తున్నాయి.
ప్రతిపక్షాల మధ్య విభేదాలు సృష్టించడానికే ప్రధానమంత్రి ఈ సమయంలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. అదే నిజమైతే, ఆయన ఈ విషయంలో విజయం సాధించినట్టుగానే భావించవచ్చు. అయితే, ప్రతిపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించడం ప్రధాని అభిమతం కాకపోవచ్చు. ఈ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ వ్యవహారం మీద బీజేపీ చాలా ఏళ్లుగా చర్చించడం జరుగుతోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీని ప్రస్తావన ఉంటోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి అంశాలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోందన్న విషయం జగమెరిగిన సత్యం. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని, 370 రద్దు వ్యవహారాన్ని పూర్తి చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ మీద దృష్టి కేంద్రీకరించింది.
ఈ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను తీసుకు రావడానికి వీలైన పరిస్థితుల కల్పన కోసం బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే లా కమిషన్‌ ద్వారా, న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇవి ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణలో నిమగ్నమై ఉన్నాయి. ఈ కోడ్‌ను తీసుకురావడానికి వీలైన న్యాయపరమైన ముసాయిదా తయారు చేయడానికి కూడా ఇవి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే, అందరికీ, అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన చట్టం తీసుకురావడానికి చాలాకాలం పడుతుంది. 2024 ఎన్నికలలోగా ఇది పూర్తయ్యే అవకాశం లేదు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి కీలక విషయాలకు సంబంధించి వివిధ మతాలు, వివిధ గిరిజన వర్గాల పర్సనల్‌ లా లన్నిటినీ కలిపి ఒకే సివిల్‌ కోడ్‌ను, ఒకే చట్టాన్ని రూపొందించాలనేది కేంద్రప్రభుత్వ లక్ష్యం. అయితే, ముస్లింల నుంచి, సిక్కుల నుంచి దీనికి గట్టి వ్యతిరేకత ఎదురవుతోంది.
ఈ మతాలనుంచే కాక, గిరిజన వర్గాల నుంచి కూడా దీనికి వ్యతిరేకత ఎదురవుతోంది. తమ పర్సనల్‌ లా లలో మార్పులు చేయడానికి ఇవి సుతరామూ అంగీకరించడం లేదు. కొన్ని రాష్ట్రాలు కూడా దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ఈ కోడ్‌కు ఏమాత్రం అంగీకరించడం లేదు. దీన్ని వ్యతిరేకిస్తూ మిజోరం రాష్ట్రం శాసనసభలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఆర్టికల్‌ 371 కింద తమకు ప్రత్యేక హోదా ఉన్నందువల్ల తమ ఆచార వ్యవహారాల్లో తలదూర్చవద్దని మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కూడా పట్టుబడుతున్నాయి. ఇక హిందూ అవిభాజ్య కుటుంబం కింద హిందువులకు కల్పించిన పన్ను రాయితీలకు స్వస్తి చెప్పడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను తీసుకురావడానికి రాజ్యాంగపరంగా అవకాశం ఉన్నప్పటికీ, ఈ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం పొంది మతాల మీదా, గిరిజన వర్గాల మీదా, రాష్ట్రాల మీదా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం మాత్రం బెడిసికొట్టే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News