Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్US image graph falling: దిగజారుతున్న అమెరికా ప్రతిష్ట

US image graph falling: దిగజారుతున్న అమెరికా ప్రతిష్ట

ట్రంప్, బైడెన్ గ్రాఫ్ తో పాటు దేశం ఇమేజ్ మటాష్

ప్రపంచదేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ పొలిటికల్‌ గ్రాఫ్‌ పడిపోతోంది. అమెరికా రాజకీయాల్లో దుమారం రేపిన రహస్య పత్రాల అంశం బైడెన్‌ ఇమేజ్‌ను ఘోరంగా దెబ్బతీసింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అయితే ఒక వివాదాల పుట్ట. వివాహేతర సంబంధం బయటపడకుండా పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణ ట్రంప్‌ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసింది. తాజాగా అమెరికా చరిత్రలో తొలిసారి ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్ధీని బలవంతంగా పదవి నుంచి దించేశారు.
యావత్‌ ప్రపంచం తన కనుసన్నల్లోనే నడవాలని అమెరికా కోరుకుంటుంది. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. నిన్నమొన్నటి వరకు ప్రపంచ దేశాల రాజకీయాలను అమెరికా శాసించింది. ప్రపంచ పటంపై అగ్రరాజ్యం ఒక నియంతలా వ్యవహరించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా దూకుడుతో అమెరికా ప్రభ తగ్గిందన్నది వాస్తవం. ఈ సంగతి ఎలాగున్నా మిగతా దేశాల్లో అమెరికాకు ఒక ప్రతిష్ట అంటూ ఉండేది. అయితే కొంతకాలంగా అమెరికా ప్రతిష్ట మసకబారుతోంది. దీనికి కారణం అమెరికా ప్రజలు కాదు. అగ్రరాజ్యాన్ని నడిపించిన, నడుపుతున్న రాజకీయ నాయకులే. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీని పదవి నుంచి తొలగించారు. ఇలా ఒక స్పీకర్‌ను బలవంతంగా కుర్చీ నుంచి దించేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. కిందటేడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్‌ ఎగువసభ సెనేట్‌ను అధికార డెమోక్రటిక్‌ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ప్రజా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్‌ పార్టీ విజయం సాధించలేక పోయింది. దిగువ సభలోని మొత్తం 435 సీట్లకు డెమోక్రాట్లు 213 సీట్లు గెలిస్తే, ప్రతిపక్ష రిపబ్లికన్లు 222 సీట్లతో మెజారిటీ పక్షంగా నిలిచారు. అయితే స్పీకర్‌ను ఎన్నుకునే విషయంలో రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో నాలుగురోజుల పాటు చర్చోపచర్చలు జరిగాయి. చివరకు కెవిన్‌ మెకార్థీని స్పీకర్‌గా ఎన్నుకున్నారు. అయితే ఈ సమయంలో స్పీకర్‌ పదవి కోసం పార్టీ నేతలతో కెవిన్‌ మెకార్థీ ఒక ఒప్పందం చేసుకున్నారు. తన ఉద్వాసనకు ఒక్క రిపబ్లికన్‌ సభ్యుడు డిమాండ్‌ చేసినా, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు సమ్మతిస్తాన్నారు. ఇప్పుడు అదే ఒప్పందంతో కెవిన్‌ మెకార్థీపై రిపబ్లికన్‌ నేత మ్యాట్‌ గేజ్‌ అవిశ్వాసం తీసుకొచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానంపై ప్రిసైడింగ్‌ అధికారి చర్చ చేపట్టారు. తరువాత ఓటింగ్‌ చేపట్టగా 216-220 ఓట్లతో అవిశ్వాసం నెగ్గింది. దీంతో కెవిన్‌ మెకార్థీని స్పీకర్‌ పదవి నుంచి తొలగించారు.
డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ వివాదాల పుట్ట
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ ప్రస్థానమంతా వివాదాలే. తన వివాహేతర సంబంధం బయట పెట్టకుండా ఉండేందుకు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారనేది డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణ. ఈమేరకు తన మాజీ న్యాయవాది మైఖేల్‌ కొహెన్‌ ద్వారా స్టార్మీ డేనియల్స్‌కు 1,30,000 డాలర్లు చెల్లించారన్నది ఆరోపణ. స్టార్మీ డేనియల్స్‌కు సొమ్ములు చెల్లించిన విషయాన్ని ఇటీవల మైఖేల్‌ కొహెన్‌ అంగీకరించారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్‌ ట్రంప్‌పై నేరాభియోగాల నమోదుకు మన్‌హటన్‌ గ్రాండ్‌ జ్యూరీ తాజాగా అనుమతించింది. స్థూలంగా ఇదీ డోనాల్డ్‌ ట్రంప్‌ పై నమోదైన తాజా కేసు. ఈ వివాదం అమెరికాలో దుమారం రేపుతోంది. అమెరికా చరిత్రలో నేర విచారణను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ప్రజల ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ నిలబడనున్నారు. కాగా 2021 జనవరి ఆరో తేదీన పార్లమెంటు భవనంపై జరిగిన దాడి డొనాల్ట్‌ ట్రంప్‌ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది. ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్‌ పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ కమిటీ సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. పార్లమెంటు భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్‌ రెచ్చగొట్టారని ఈ కమిటీ తేల్చిచెప్పింది. ఇదొక్కటే కాదు అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు కూడా డొనాల్డ్‌ ట్రంపే. ఇంతటి అపఖ్యాతిని డొనాల్డ్‌ ట్రంప్‌ మూటగట్టుకున్నారు.
రహస్య పత్రాల వివాదంలో జో బైడెన్‌!
అమెరికా రాజకీయాల్లో దుమారం రేపిన రహస్య పత్రాల అంశం దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఇమేజ్‌ను ఘోరంగా దెబ్బతీసింది. బారక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా జో బైడెన్‌ పనిచేశారు. అలనాటి సర్కార్‌ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపరచినవే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిన సీక్రెట్‌ డాక్యుమెంట్స్‌. అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమ హయాం నాటి కీలక సమాచారాన్ని రహస్య పత్రాల్లో పొందుపరుస్తారు. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలో ఉన్న అతి కొద్దిమందికి మాత్రమే రహస్యపత్రాలు అందుబాటులో ఉంటాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరైనా తమ పదవీకాలం పూర్తి కాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్‌కు అప్పగిస్తారు. అమెరికా ప్రభుత్వాల రహస్యాలను కాపాడుకోవడానికి దీనినొక నిబంధనగా చేశారు. అయితే అంతటి కీలకమైన రహస్య ఫైళ్లు దాదాపు ఏడాది కిందట జో బైడెన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి పాత కార్యాలయాల్లోనూ అలాగే ఆయన నివాసంలోనూ గుట్టలుగుట్టలుగా దొరికాయి. దీంతో వివాదం మొదలైంది. జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ ల్యాప్‌ టాప్‌ ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకంగా మారింది. ఈ ల్యాప్‌ టాప్‌ లోని సమాచారాన్ని విశ్లేషించేకొద్దీ అందరూ ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. అంతిమంగా, జో బైడెన్‌ ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని అప్పట్లో ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడన్న తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇవేమీ ఉత్తుత్తి ఆరోపణలు కావు. ఈ ఆరోపణలను బలపరిచే అనేక కీలక ఆధారాలు హంటర్‌ బైడెన్‌ ల్యాప్‌ టాప్‌ లో దొరికాయి. ప్రతిపక్షమైన రిపబ్లికన్‌ పార్టీకి ఈ సీక్రెట్‌ డాక్యమెంట్స్‌ ఎపిసోడ్‌ ఒక వరంలా దొరికింది. అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో రహస్య పత్రాల అంశం ఒక కీలకాంశంగా మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 78 ఏళ్ల వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కు వ్యక్తిగతంగా అమెరికా సమాజంలో గుడ్‌ విల్‌ ఉంది. నిజాయితీపరుడన్న పేరుంది. అయితే ఈ రహస్య పత్రాల వ్యవహారంతో బైడెన్‌ నిజాయితీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పైపెచ్చు రహస్య పత్రాల బాగోతం 2022 లోనే బయటపడ్డా మధ్యంతర ఎన్నికల్లో లబ్ది కోసం ఆ విషయాన్ని జో బైడెన్‌ తొక్కి పెట్టారన్నది మరో ఆరోపణ. ఇదంతా సగటు అమెరికన్లకు మింగుడుపడ లేదు. ఏమైనా నేతల వ్యవహారాలతో ప్రపంచ దేశాల్లో అమెరికా తన పరువు పోగొట్టుకుంటోంది.

- Advertisement -

ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌

  • 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News