Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్వెర్రి వెయ్యి విధాలా? ఇది నిజమా? ఉన్మాద సహస్రం అదేగా

వెర్రి వెయ్యి విధాలా? ఇది నిజమా? ఉన్మాద సహస్రం అదేగా

వెర్రికి వేయి విధాలంటూ ఇంట్లో పెద్దలు తరచూ వ్యాఖ్యానించడం మనం వినే వింటాం. ఎవరైనా తెలివి తక్కువ పనులు చేసినప్పుడు ఆ మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. విజయనగరం జిల్లాలో దొడ్డంపేట అనే ఓ ఊరులో క్రొత్తపల్లి సూర్యారావు అనే తెలుగు పండితుడు కూడా తన ఇంట్లో పెద్దవాళ్లు మధ్య మధ్య ఇలా అంటూండడం గమనించాడు. ఇది 1920 దశకంలోని సంగతి, ఆయన ఓ ఉపాధ్యాయుడు. నిజంగా వెర్రికి వేయి విధాలా లేక పెద్దవాళ్లు ఊరికే ఓ సామెత లాగా అంటున్నారా అని తెగ ఆలోచించాడు. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదనుకున్నాడు. లోతులోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నాడు. మెల్లగా విచారణ సాగించాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే “ఎంతటి అల్పజ్ఞానియైన తానొక బుద్ధిశాలియనీ, తాను లేకున్న ప్రపంచమునకు ఒక గొప్ప లోటని తలంపక మానడు”, అందువల్ల ఈ వెర్రితో తన గ్రంథం ప్రారంభించాలని అనుకున్నాడు విస్తృతంగా పుస్తకాలు తిరగేశాడు. సమయం దొరికినప్పుడల్లా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రంథాలయాల చుట్టూ తిరిగాడు. మేధావుల్ని, రచయితల్ని, ఉపాధ్యాయుల్ని, పండితుల్ని కలిశాడు. తన పరిశోధన గురించి గానీ, సేకరణ గురించి గానీ ఒక్క ముక్క ఎవరికీ చెప్పకుండా, రెండేళ్ల తరువాత మొత్తానికి అనుకున్నది సాధించాడు.

- Advertisement -

నిజానికి సూర్యారువుకు వెయ్యిని మించిన వెర్రులే లభ్యమయ్యాయి. ఈ సామెత ఊరికే పుట్టలేదు అని అర్థం చేసుకోవడానికి అతినికి మరీ ఎక్కువ కాలం పట్టలేదు. ఆయన సహజంగానే తెలుగు పండితుడు కదా! ఆ వెయ్యి విధాలనీ వెయ్యి పద్యాలుగా మార్చాడు. అచిర కాలంలోనే అవి సీస పద్యాలుగా, కంద పద్యాలుగా, ఆటవెలదులుగా మారిపోయాయి. ఇంకేముంది! అనుకున్నది సాధించాడు. ఈ వేయి విధాల వెర్రులూ తనకొక్కడికే తెలిస్తే ఏం బాగుంటుంది! ఇది ప్రపంచానికంతటికీ తెలిస్తే అందులో మజాయే వేరు! ఈ వెయ్యి పద్యాలతో ఒక మంచి పుస్తకం వేయాలనుకున్నాడు. కొందరు స్థానిక సహ పండితులకు మచ్చుకి ఒకటి రెండు పద్యాలు వినిపించాడు. వాళ్లు వహ్వా అన్నారు. సూర్యారావులో హుషారు పెరిగిపోయింది. కానీ, పూస్తకంగా వేయాలంటే డబ్బులేవీ? ఊరికే ఎవరూ అచ్చువేయరు కదా? కానీ, సూర్యారావు పెద్దగా డబ్బున్నవాడు కాదు. అందువల్ల ఒకరిద్దరు జమీందార్లను ఆశ్రయించాడు. మొదట కొందరికి విషయమేమిటో అర్థం కాలేదు. కొందరు వేళాకోళం చేశారు. ఎద్దేవా చేశారు. ఏతావాతా మొండి చెయ్యి చూపించారు. సూర్యారావు సహజంగానే పట్టువదలని విక్రమార్కుడు.

బొబ్బిలిలో ఒక సంస్థానాధీశుడు ముందుకు వచ్చాడు కానీ, ఈ మహత్తర గ్రంథాన్ని తనకే అంకితమివ్వాలని షరతు పెట్టాడు. కానీ, సూర్యారావుకి వేరే ఆలోచనలున్నాయి. ఫలానా ఆయన తనకు ఆర్థిక సహాయం చేశాడని మహా అయితే ఉపోద్ఘాతంలో రాద్దామనుకున్నాడు కానీ, ఆయనకే అంకితమివ్వడం ఎలా అని తెగ ఆలోచించాడు. విచిత్రమేమిటంటే, ఉన్మాద సహస్రం గురించి ఆనోటా

ఈనోటా జిల్లా అంతా పాకిపోయింది. పలువురు జమీందార్లే కాక, సంస్థానాధీశులు, ప్రచురణకర్తలు సైతం ఆయనకు కబురు చేయడం ప్రారంభించారు. తాము అచ్చు వేస్తామంటే తాము అచ్చు వేస్తామని పోటీలు పడ్డారు.

ఇంటి ముందు బారులు తీరారు. సిఫారసు లేఖలు కూడా పట్టుకొచ్చారు. సూర్యారావు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్న వారిలో దొడ్డంపేట జమీందారు శ్రీరాజా వాడ్రేవు విశ్వ సుందరరావు బహద్దురు వారు, శ్రీకాశీనాథుని నాగేశ్వర రావు పంతులు గారు, శ్రీవావిళ్ల వెంకటేశ్వర శాస్త్రి గారు, శ్రీజయంతి రామయ్య పంతులు గారు, శ్రీచెలికాని అప్పారావు దొరగారు (బొబ్బిలి) వంటి వారున్నారు. ఎవరికి అంకితమిచ్చినా మరొకరికి కోపం కట్టలు తెంచుకోవడం ఖాయం అని సూర్యారావుకు అర్థమైపోయింది. ఆ జిల్లాలో వారే అతిరథ, మహారథులు మరి! వారి మాట కాదని అక్కడ బతకడం కష్టం. పైగా సూర్యారావు ఓ చిన్న బడిపంతులు. నిర్ధనుడు.

నిజంగానే సూర్యారావుకు ఒక కొత్త సమస్య, చిక్కు సమస్య వచ్చిపడింది. ‘ వెర్రికి వేయి విధాలు’ అనే పుస్తకానికి ఇంత గిరాకీ ఉంటుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. ప్రాధేయపడి, రాయబారాలు నడిపి చివరికి వారందరినీ ఒక్క తాటి మీదకు తీసుకు వచ్చాడు. తాను అందరి నుంచి తలో కొంత విరాళం తీసుకుంటానని, ‘ఉపోద్ఘాతం’ అందరి పేర్లూ రాస్తానని వారికి వినమ్రంగా చెప్పి ఒప్పించాడు. పుస్తకాన్ని అచ్చువేయడానికి మొత్తం 116 రూపాయలు ఖర్చయ్యాయి. పుస్తకం విలువ ఒక రూపాయి. చెన్నపట్నంలోని బ్రిటిష్ మాడెల్ ముద్రాక్షరశాలలో 1924లో వెయ్యి ప్రతులు ముద్రించారు. మొత్తానికి అలా ‘వెఱ్ఱికి వేయి విధములు’ అను ‘ఉన్మాద సహస్రం’ అనే ఈ అపూర్వ గ్రంథం వెలుగు చూసింది. ఆ వెయ్యి పుస్తకాలు ఒక్క రోజులో అమ్ముడుపోయాయంటే ఆశ్చర్యం వేస్తుంది. చెన్నపట్నం ముద్రాక్షరశాల ఆ తర్వాత పది వేల ప్రతులు ముద్రించాల్సి వచ్చింది. సూర్యారావు పేరు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కాక, ఇతర జిల్లాల్లోనూ, చెన్నపట్నంలోనూ మార్మోగిపోయింది.

మూఢాచారాలు, దురాచారాలు, చాదస్తాలు, అలవాట్లు, వరకట్నాలు, కొన్ని రకాల ఆచారాలు, సంప్రదాయాలు వగైరాలన్నీ ఈ వెర్రికి వెయ్యి విధాలులో ప్రతిఫలించాయి. మచ్చుకు ఒకటి: ‘ఇదొక వెఱ్రి గాదె వెఱ్ఱివారల వెఱ్రులు వ్రేలు వంచి లెక్కపెట్టుట తన వెఱ్రి యొక్కడైన గానలేకుంట నాబోటితాడు జగమ’. ఆయన చివరలో, తాను ఈ విధంగా వెర్రుల్ని సేకరించి పుస్తకం వేయడాన్ని కూడా వెర్రిగా అభివర్ణించుకున్నారు. ఈ పుస్తకం కోసం తాను పడ్డ పాట్లు ఒక వెర్రి కాగా, అతిరథ మహారథులంతా ఆ పుస్తకం కోసం తన వెంట పడడాన్ని కూడా ఆయన ఒక పెద్ద వెర్రిగానే వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News