పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన హింసాకాండ అడ్డూ ఆపూ లేకుండా విజృంభిస్తోంది. గత నెల రోజుల నుంచి ఈ హింసాకాండ కొనసాగుతోంది. ఈ హింసాకాండకు ఇంతవరకూ 36 మంది బలైపోయారు. జూలై 8న ఎన్నికలు జరిగిన రోజునే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. సరైన చర్యలు తీసుకోని పక్షంలో ఎన్నికల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని ప్రతిపక్షాలు మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. కోల్ కతా హైకోర్టు అనేక పర్యాయాలు కల్పించుకోవడం కూడా జరిగింది. కేంద్ర భద్రతా దళాలను రప్పించి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీటన్నిటినీ బేఖాతరు చేయడం జరిగింది. ఆయన నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండిపోయారు. మూడంచెలుగా 61,636 పోలింగ్ కేంద్రాలలో నిర్వహించవలసిన పంచాయతీ ఎన్నికలను ఆయన ఒకే రోజున నిర్వహించడం ఆయన చేసిన పెద్ద తప్పిదం. హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా కేంద్ర దళాలను రప్పించడంలో ఆయన విఫలం అయ్యారు. తీరా ఆలస్యంగా కేంద్ర దళాలను పిలిచే సరికి జరగవలసిన దారుణాలు జరిగిపోయాయి. చాలా ఆలస్యంగా రాష్ట్రంలో అడుగుపెట్టిన కేంద్ర దళాలకు చివరి నిమిషంలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
ఈ విధంగా హింసాకాండ చెలరేగడానికి ప్రధాన కారణం పాలక తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు. పాలక పక్ష అభ్యర్థులకు పోటీగా గట్టి ప్రతిపక్ష అభ్యర్థులు నిలబడడం కూడా హింసాకాండకు కారణం అయింది. అటువంటి స్థానాలలో పాలక పక్షం ఒకవైపు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ మరొక వైపు చేరి హింసాకాండకు, పోరాటాలకు దిగడం జరిగింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఎదురు లేకుండా గెలుస్తూ వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనేక స్థానాల్లో గట్టి పోటీ ఏర్పడడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఘర్షణలకు దిగడం జరిగింది. ఈ ఘర్షణల్లో పాలక పక్షానికి చెందిన మద్దతుదారులే ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2018లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ 34 శాతం స్థానాలను పోటీ లేకుండా చేజిక్కించుకుంది. ఈసారి 12 శాతం స్థానాలలో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పోటీ లేకుండా ఎన్నికయ్యే అవకాశం ఉంది.పంచాయతీ సంస్థలపై అదుపాజ్ఞలు కలిగి ఉన్న పక్షంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీదా, స్థానిక వ్యవస్థల మీదా పట్టు ఉంటుంది. కండబలం, గుండె బలం ఉన్న కార్యకర్తలకు మున్ముందు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ఏనాడూ శాంతియుతంగా జరగలేదు. సుమారు రెండు లక్షల మంది అభ్యర్థులు రంగంలో ఉన్నందువల్ల పాలక పక్షం ఏ విషయంలోనూ రాజీపడదలచుకోలేదు. ఎన్నికల కమిషనే కాదు, ఇందులో పాలక పక్షం తప్పిదం కూడా ఎక్కువగానే ఉంది. స్థానికసంస్థల ఎన్నికలను చావో రేవో అన్న స్థాయికి తీసుకు వెళ్లింది పాలక పక్షమే. పశ్చిమ బెంగాల్ లో అట్టడుగు స్థాయి ఎన్నికలు సైతం హింసాత్మకంగా మారడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతుండడం, వ్యవ సాయ కార్యకలాపాలేవీ లేకపోవడం వంటి కారణాల వల్ల యువకులు రాజకీయాల్లో ప్రవేశించడం ఎక్కువైంది. ఇందులో ఎక్కువ మంది బలవంతపు వసూళ్లకు, దౌర్జన్యాలకు, అవినీతికి పాల్పడుతుంటారు. రాష్ట్ర పరిస్థితే దిగజారుతోంది. గత 8వ తేదీన జరిగిన హింసా విధ్వంసకాండలు పాలక పక్షానికి కనువిప్పు కావాలి.
Violence in Mamata state: మమత రాష్ట్రంలో హింసాకాండదే రాజ్యం
బెంగాల్ లో ఎన్నికలు ఏనాడూ శాంతియుతంగా జరగలేదు