Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Elections and violence: శాంతిభద్రతలకు కొత్త సవాళ్లు

Elections and violence: శాంతిభద్రతలకు కొత్త సవాళ్లు

వైవిధ్యభరిత సంస్కృతిలో ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ

ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే శాంతిభద్రతలకు సంబంధించి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు టెన్షన్లు, అల్లర్లు, దారుణాలతో ముగుస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాల అల్లర్లు చోటు చేసుకోవడం గమనిస్తే 2024లో జరగబోయే లోక్‌ సభ ఎన్నికల పరిస్థితి ఎలా ఉండబోతోందో నన్న భయాందోళనలు ఇప్పటి నుంచే చుట్టుముడుతున్నాయి. అనేక చోట్ల మతపరమైన, జాతి పరమైన ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నాయి. మతపరంగా, జాతిపరంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా, కులాలపరంగా వైవిధ్యం కలిగి ఉన్న భారతదేశంలో ఎన్నికల నిర్వహణ రాను రానూ ఒక సవాలుగా పరిణమిస్తోంది. వీటన్నిటిని బట్టి చూస్తే 2024 ఎన్నికలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవిగా ఉండే అవకాశం ఉంది. ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు, సవాళ్లు, సమస్యలు కూడా పెరిగి ఎన్నికల నిర్వహణ ఒక క్లిష్ట వ్యవహారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు కాంగ్రెస్‌ నాయకత్వంలో ఐ.ఎన్‌.డి.ఐ.ఏ (ఇండియా) పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కేంద్రంలో మూడవసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు సహజంగానే దేశంలో అనేక ప్రాంతాలలో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. 1977లో ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేసిన దానికంటే ఈసారి ఎన్నికలు తీవ్రంగా ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు. ప్రతిపక్షాలు చావో రేవో అన్న రీతిలో ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది.
ఈ రాజకీయ విస్ఫోటనంలో హర్యానా, మణిపూర్‌ లలో ప్రస్తుతం కొనసాగుతున్న మతపరమైన, జాతిపరమైన హింసా విధ్వంసకాండల లాంటివి ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకునే అవ కాశం ఉంది. ప్రత్యర్థులను చిత్తు చేయడమే ఏకైక లక్ష్యంగా జరగబోతున్న ఈ ఎన్నికల్లో పార్టీలు ఎంతటి సాహసానికైనా, ఎంతటి నైచ్యానికైనా తెగబడే సూచనలు కూడా ఉన్నాయి. మతపరమైన లేదా జాతిపరమైన హింసా విధ్వంసకాండలు వాటంతటవే ప్రారంభం కావు. వాటి వెనుక ఒక వ్యూహం, ఒక ప్రణాళిక, లక్ష్యం ఉంటాయి. కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఈ కలహాలు, అల్లర్లకు ఎవరు కారణమైనప్పటికీ, వీటికి సంబంధిం చిన మచ్చ మాత్రం అనివార్యంగా పాలక పక్షం మీద పడుతుంది. ఎవరు రెచ్చగొట్టారో, ఎవరు ప్లాన్‌ చేశారో వారి మీద ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ ఎటువంటి ప్రభావమూ ఉండకపోవచ్చు. ప్రస్తుతం మణిపూర్‌, హర్యానాలలో అదే జరుగుతోంది.
భారతదేశం వంటి వైవిధ్యభరిత సంస్కృతిలో ఇటువంటివి జరగడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. రాజకీయ కారణాలతో, రాజకీయ లబ్ధి కోసం అల్లర్లను సృష్టించడం, వివాదాలను రేకెత్తించడం అనేవి పార్టీల చేతుల్లో బ్రహ్మాస్త్రాలవుతాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ చుట్టూ కథనాలు అల్లడం, ఆ పార్టీనే బాధ్యురాలిని చేయడం వంటివి జరుగుతాయి. తప్పుడు కథనాలు, నిరాధార కథనాలు, కల్పనలు అల్లడానికి బదులుగా రాజకీయ పక్షాలు మతపరంగా, భాషాపరంగా, జాతులపరంగా, కులాల పరంగా కథనాలు అల్లి ప్రజలలో ప్రచారం చేస్తుండడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రజలు ఇటువంటి ప్రమాదాల పట్ల, అసత్య ప్రచారాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఇటువంటివి అల్లర్లు జరిగిన రాష్ట్రాలకే కాదు, యావద్దేశానికి ముప్పు తెచ్చిపెడతాయి. దేశంలో శాంతిభద్రతలను, ప్రశాంతతను, ప్రజల మానప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల ప్రయోజనం ఉండదని పార్టీలు గ్రహించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News