Monday, May 20, 2024
Homeఫీచర్స్Beautiful face: అందమైన ముఖం కోసం..

Beautiful face: అందమైన ముఖం కోసం..

మిరియాలు, అల్లం, శనగపిండి, పాలు.. మీ ఫేస్ ను మెరిపిస్తాయి

ముఖాన్ని అందంగా చేసే వంటింటి చిట్కాలు..
మీ ముఖాన్ని అందంగా చేసే వంటింటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. ఇవి చర్మాన్ని సహజ అందంతో మెరిపిస్తాయి. వాటిల్లో మొదటగా చెప్పుకోవాల్సింది నెయ్యి. చర్మానికి కావలసిన సాంత్వనను నెయ్యి ఇస్తుంది. పగిలిన పెదాలపై, పాదాల పగుళ్ళపై నెయ్యి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. వాటిని నాజూగ్గా కనపడేలా చేస్తుంది. పెదాలను మ్రుదువుగా చేయడమే కాదు గులాబీ రంగులో మెరిసేలా చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్యలను నెయ్యి ఎంతో వేగంగా తగ్గిస్తుంది. మరొక వంటింటి బ్యూటీ చిట్కా పసుపు. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటిమైక్రోబియల్ గుణాలు బాగా ఉన్నాయి. పసుపులో యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి రకరకాల చర్మ సమస్యలను ఎంతో శక్తివంతంగా పరిష్కరిస్తాయి.
ముఖ్యంగా యాక్నే, చర్మం ముడతలు పడడం వంటివాటిని పసుపు తగ్గిస్తుంది. ఫేషియల్ హెయిర్ రాకుండా కూడా పసుపు నిరోధిస్తుంది. పసుపులో కాస్త నీరు కలిపి పేస్టులా చేసి రోజూ స్నానం చేసే ముందర ముఖానికి రాసుకుంటే చాలు. అలాగే చంకల్లో జుట్టు పెరగకుండా కూడా పసుపు నిరోధిస్తుంది. నల్లమచ్చలు, ముడతలను పోగొట్టడంలో కూడా పసుపు బాగా పనిచేస్తుంది. పసపును మజ్జిగ లేదా చెరుకు రసంతో కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద నిత్యం రాసుకుంటే నల్ల వలయాలు గాని, చర్మంపై ముడతలు గానీ ఏర్పడవు. మీ ముఖాన్ని అందంగా కనిపించేలా చేసే మరో బ్యూటీ చిట్కా తేనె. ఇది సహజసిద్ధమైన యాంటాక్సిడెంట్. ఇందులో కూడా యాంటిమైక్రోబియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి.
ఇది గాయాలను వేగంగా తగ్గిస్తుంది. చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. యాక్నేను తగ్గించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది.

- Advertisement -

పొడిచర్మం ఉన్న వారు నిత్యం తేనె రాసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గి ముఖానికి మంచి గ్లో వస్తుంది. ముడతలను కూడా తేనె తగ్గిస్తుంది. ఫ్రీరాడికల్స్ ను పోగొట్టి ఫైన్ లైన్స్ నివారిస్తుంది. చర్మాన్ని యంగ్ గా కనిపించేలా చేస్తుంది. కొబ్బరినూనె కూడా మీ ముఖం అందాన్ని రెట్టింపుచేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్లు, యాంటిమైక్రోబియల్, యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. గాయాన్ని తొందరగా మాన్పి చర్మాన్ని మ్రుదువుగా చేస్తుంది. కొబ్బరినూనె మేకప్ రిమూవర్ గా ఉపయోగపడుతుంది. ఒక టీస్పూను కొబ్బరినూనెను తీసుకుని ముఖానికి పట్టించి రెండు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ క్లీన్సర్ తో కడుక్కుంటే మేకప్ పోతుంది. కొబ్బరినూనె మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా కూడా పనిచేస్తుంది.

నిత్యం స్నానం చేసే ముందు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె వేసుకుని స్నానం చేస్తే మీ పొడిచర్మం ఎంతో హైడ్రేటెడ్ గా ఉంటుంది. నిత్యం శరీరానికి, ముఖానికి కొబ్బరినూనె రాసుకుని స్నానం చేయడం వల్ల చర్మం ఎంతో మ్రుదువుగా, పట్టులాంటి మెత్తదనంతో మెరిసిపోతూ కనిపిస్తుంది. నల్లటి వలయాలను కూడా కొబ్బరినూనె పోగొడుతుంది. రాత్రి నిద్రపోయే మందు మీ కళ్ల కింద భాగంలో కొబ్బరినూనెతో నిత్యం కాసేపు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు పోయి కళ్ల కింద చర్మం కాంతివంతమవుతుంది. నిమ్మ కూడా చర్మాన్ని ఎంతో మెరిపిస్తుంది. శుభ్రంగా ఉంచుతుంది. అన్ని రకాల చర్మసమస్యలను పరిష్కరిస్తుంది. యాక్నేను తగ్గిస్తుంది. స్ట్రెచ్ మార్కులను పోగొడుతుంది. వయసు తాలూకా ప్రభావం చర్మంపై కనపడకుండా మీరు యంగ్ లా కనిపించేలా చేస్తుంది. ముడతలు, ఫైన్ లైన్స్ చర్మంపై ఏర్పడకుండా తోడ్పడుతుంది. స్కిన్ కేర్ లో అల్లం సైతం బాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని సహజసిద్ధంగా మెరిసేలా చేస్తుంది. ఇందులో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

హైపర్ ఫిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. అల్లం రసాన్ని హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా పది రోజులు చేస్తే ఆ ప్రదేశంలోని చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే యాక్నే సమస్యను కూడా తగ్గిస్తుంది. మొటిమలను పోగొడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేయడానికి అల్లం పొడిని వాడొచ్చు. రెండు టీస్పూన్ల అల్లం (ఎండబెట్టినది) పొడిని నాలుగు కప్పుల నీటిలో వేసి అది సగం దాకా అయ్యేంతవరకూ బాగా మరగబెట్టాలి. అది బాగా చల్లారిన తర్వాత అందులో ఐదు లేదా ఆరు చుక్కల రోజ్ మేరీ నూనె వేసి బాగా కలిపి దాని కొన్ని చుక్కలను మీ చర్మానికి నిత్యం రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని భద్రం చేసుకుని నిత్యం రాసుకోవచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది.

మరో వంటింటి బ్యూటీ చిట్కా నల్లమిరియాలు. వీటిల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి యాంటి ఏజింగ్ ఏజెంట్. ఛర్మంపై ఏర్పడ్డ ముడతలు, ఫైన్ లైన్స్ ను పోగొట్టడంలో ఇది బాగా పనిచేస్తుంది. నల్లమచ్చలను కూడా నివారిస్తుంది. నిత్యం మీరు తీసుకునే డైట్ లో నల్లమిరియాలు వాడడం వల్ల చర్మం ముడతలు పడకుండా యంగ్ గా కనిపిస్తారు. వంటింట్లో లభ్యమయ్యే నువ్వుల నూనె కూడా చర్మాన్ని అందంగా చేస్తుంది. చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఎన్నో చర్మ సమస్యల పరిష్కారంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇందులో బోలెడు యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. మంచి క్లీన్సర్. చర్మంపై చేరిన మలినాలు పోగొట్టడలో బాగా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి పట్టించి పది పదిహేను నిమిషాల తర్వాత మైల్డ్ క్లీన్సర్ తో కడుక్కోవాలి. నువ్వుల నూనెలో కొద్దిగా నీళ్లు, యాపిల్ సిడార్ వెనిగర్ లను కలిపి రాత్రి పడుకోబోయేముందు ముఖానికి అప్లై చేసుకుని పొద్దున్నే లేచి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. పాదాల పగుళ్లను కూడా నువ్వుల నూనె తగ్గిస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు దీన్ని పాదాలకు రాసుకుని పడుకోవాలి. ఇలా రెండు వారాలు చేస్తే మంచి ఫలితాన్ని చూస్తారు. నూనె రాసుకున్న తర్వాత పాదాలకు సాక్సు వేసుకుని పడుకోవాలి.

వంటింట్లో అందుబాటులో ఉండే శెనగపిండి కూడా మంచి బ్యూటీ సాధనం. మన సాంప్రదాయ స్కిన్ కేర్ బ్యూటీ చిట్కాలలో శెనగపిండిని బాగా ఉపయోగిస్తాం. దీన్ని పసుపుతో కలిపి రాసుకుంటే మంచి క్లీన్సర్ గా చర్మంపై పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల స్కిన్ ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఎక్స్ ఫొయిలేటర్ గా కూడా శెనగపిండిని వాడతాం. చర్మంపై ఉన్న మ్రుతకణాలు, బ్లాక్ హెడ్స్ పోగొట్టడంలో , చర్మ రంధ్రాలకు గాలి తగిలేలా చేయడంలో శెనగపిండి బాగా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడ్డ ట్యాన్ ను కూడా తొలగిస్తుంది. నాలుగు టీస్పూన్ల శెనగపిండిలో ఒక్కొక్క టీస్పూను చొప్పున నిమ్మరసం, పెరుగు, పసుపులు కలిపి ఆ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న మీ ముఖానికి రాసుకోవాలి. అది బాగా ఎండిన తర్వాత
చల్లటి నీళ్లతో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ప్యాక్ ను నిత్యం అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల చర్మంపై ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తవు. అంతేకాదు శెనగపిండిని నిత్యం ముఖానికి, శరీరానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది కూడా. నాలుగు టీ స్పూన్ల శెనగపిండిలో ఒక్కొక్క టీస్పూను చొప్పున పాలు, నిమ్మరసం వేసి కలిపి ఆ పేస్టును ముఖానికి నిత్యం రాసుకోవాలి. ఈ ప్యాక్ ను బాగా ఆరిపోయేదాకా ఉంచుకుని తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని నిత్యం రాసుకోవడం వల్ల నల్లమచ్చలు కూడా పోతాయి.

మీ అందాన్ని పెంచే మరో వంటింటి పదార్థం పాలు. ఇందులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని బిగువుగా చేస్తుంది. మ్రుదువుగా మారుస్తుంది. ఫైన్స్ లైన్స్ , ముడతలను పోగొడుతుంది. యాక్నే వంటి వాటిని తగ్గిస్తుంది. పాలతో చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. రెండు టీస్పూన్ల పాలలో ఒక టీస్పూను పసుపు, ఒక టీస్పూను నిమ్మరసం వేసి కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. చర్మం మెరియాలంటే బాదం పప్పులను మెత్తగా చేసి అందులో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి ప్యాక్ లా రాసుకోవాలి. ఇది చర్మానికి ఇన్ స్టాంట్ మెరుపును ఇస్తుంది. మెత్తగా చేసిన బాదం పొడి ఒక టేబుల్ సూను, అలాగే మెత్తగా చేసిన కమలాపండు తొక్కల పొడి ఒక టీస్పూను, రెండు లేదా మూడు చుక్కల ఆలివ్ ఆయుల్ ఈ మూడింటినీ కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో కడుక్కొని చర్మంపై ఐస్ ముక్కతో రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది. పొడి చర్మానికి కావలసిన మాయిశ్చర్ ని పాలు అందిస్తుంది. మెత్తగా చేసిన అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె, కొన్నిపాలు కలిపి ఆ పేస్టును పొడిచర్మంపై రాసి అది ఆరిపోయే వరకూ అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఆతర్వాత పాలతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మానికి పూర్తిస్థాయిలో మాయిశ్చరైజ్ అందుతుంది. చర్మానికి మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా కూడా పాలు ఉపయోగపడతాయి. పాలు చర్మంపై ఉండే మ్రుతకణాలను పోగొడుతుంది. మరుగుతున్న నీళ్లల్లో చిటికెడు ఉప్పు వేసి అందులో మూడు కప్పుల పాలు కలపాలి. అలాగే అరకప్పు గోరువెచ్చటి నీళ్లు కూడా అందులో కలపాలి. ఆ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ముఖానికి, శరీరానికి రాసుకోవాలి. దీనివల్ల చర్మంపై ఉండే మ్రుతకణాలు పోతాయి. ఈ మిల్క్ స్క్రబ్ ను వారానికి రెండుసార్లు వాడితే చర్మంపై మంచి ఫలితాలు చూస్తారు. మరి వీటిని మీరూ చేసి నేచురల్ అందంతో మెరిసిపోండి….మంచి చర్మ సౌందర్యంతో అందరి మెప్పూ పొందండి..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News