Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Violin maestro: ‘ద్వారం’ వారి వయొలిన్ పరిమళం ఆమె

Violin maestro: ‘ద్వారం’ వారి వయొలిన్ పరిమళం ఆమె

వయొలిన్ వాద్యమనగానే సంగీత ప్రియులకు ద్వారం వెంకటస్వామినాయుడుగారు గుర్తుకువస్తారు. ఆయన సంతానం కూడా తండ్రికి తగ్గ బిడ్డలుగా పేరు తెచ్చుకున్నారు. వారు కూడా వయొలిన్ వాద్య పరిమళాలను ప్రపంచమంతా వ్యాపింపచేశారు. ఇటీవల కన్నుమూసిన ద్వారం మంగతాయారు ద్వారం వెంకటస్వామినాయుడుగారి కుమార్తే. తండ్రి కళా వారసత్వాన్ని నిండుగా పరిమళింపచేసిన గొప్పవయొలిన్ కళాకారిణి ఆమె. అటువంటి గొప్ప కళాకారిణి కనుమరుగవడం కళా ప్రపంచానికి తీరనిలోటు. తండ్రికి మల్లే వయొలిన్ తీగల శబ్దరహస్యం, సొబగులు, రాగ, భావతరంగాలు బాగా తెలిసిన వయొలినిస్టు మంగతాయారు. ఆమె నాయుడుగారి కూతురు మాత్రమే కాదు ఆయన అనుంగుశిష్యురాలు కూడా. తండ్రితో పాటు దేశ విదేశాల్లో పలు వయొలిన్ వాద్య కచేరీలు ఇచ్చారు. తండ్రి కళా వారసత్వాన్నే కాదు ప్రపంచంలోని ఎందరో సంగీత ప్రియుల కళా హ్రుదయాలను సైతం గెలుచుకున్నారామె. ద్వారం వెంకటస్వామినాయుడుగారిది తరతరాలుగా కర్ణాటక సంగీత కళా నేపథ్యం ఉన్న కుటుంబం కావడం మరో విశేషం.

- Advertisement -

చిన్నవయసులోనే మంగతాయారు ప్రముఖ వీణా కళాకారుడు జనార్దనాచారి వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నారు. పాఠశాలలో సంగీతం స్పెషల్ సబ్జక్టుగా తీసుకుని చదివారు. ఆమె ఎంత ప్రతిభావంతురాలంటే 14 ఏళ్ల ప్రాయంలోనే విజయనగరంలో జరిగిన చెంబై వైద్యనాధ భాగవతార్ సంగీత కార్యక్రమంలో ఆయనకు సహవాద్యకారిణిగా పాల్గొని తన ప్రతిభతో శ్రోతలను ఆశ్చర్యపరిచారు. వాల్తేరులో వయొలిన్ వాద్యంలో డిప్లొమా చేశారు. 1950ల్లో ద్వారం కుటుంబం మొత్తం మద్రాసుకు వెళ్లి అక్కడ స్థిరపడింది. అప్పుడే తండ్రి వెంకటస్వామినాయుడు గారి దగ్గర మంగతాయారు వయొలిన్ లో బాగా శిక్షణ పొందారు. చిన్నతనం నుంచి తండ్రితో కలిసి అతిరథమహారధుల ముందు ఎన్నో వయొలిన్ వాద్య కచేరీలు ఇచ్చారు.

తండ్రి వెంకటస్వామి నాయుడుగారితో కలిసి బాబూ రాజేంద్రప్రసాద్, రాధాక్రుష్ణన్, నీలం సంజీవరెడ్డి వంటి భారత రాష్ట్రపతుల ముందు వయొలిన్ కచేరీలు చేశారు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధి, రాజీవ్ గాంధీ వంటి దేశ ప్రధానుల ముందు ప్రదర్శనలిచ్చారు. అంతే కాదు మరెందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ఎదుట సైతం వయొలిన్ వాద్య కచేరీలు ఇచ్చారామె. వయొలిన్ వాద్యంలో తండ్రికి ఏమాత్రం తీసిపోని తనయుగా ప్రశంసలు అందుకున్నారు. వయొలిన్ లో నిష్ణాతురాలైన మంగతాయారు సంధ్యావందనం శ్రీనివాసరావుగారి దగ్గర గాత్రసంగీతాన్ని అభ్యసించారు. కొన్నేళ్లు విజయనగరం మహారాజా కళాశాలలో కర్ణాటక సంగీత ఆచార్యులుగా ఉండి ఎందరో విద్యార్థులకు సంగీత పాఠాలు బోధించారు. తర్వాత పదిహేనేళ్లకు పైగా ఆకాశవాణిలో వయొలిన్ కళాకారిణిగా సేవలు అందించారు. ఆ తర్వాత చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో శాఖాధిపతిగా వయొలిన్ పాఠాలను విద్యార్థులకు నేర్పారు.

అంతేకాదు ప్రముఖ కళాకారులకు ప్రొఫెషనల్ సహవాద్యకారిణిగా సేవలు అందించడమే కాదు సోలోగా వయొలిన్ వాద్య కచేరీలను కూడా ఇచ్చారు. దేశ విదేశాల్లో ఆమె ఇచ్చిన ప్రదర్శనలు ఎన్నో. టిఆర్ మహాలింగం వంటి సంగీత స్రష్టకు పలు కచేరీల్లో సహవాద్యకారిణిగా పనిచేశారు. అంతేకాదు సంగీతంలో లబ్దప్రతిష్టులైన డికె పట్టమ్మాళ్, ఎంఎస్ఎస్, వీణా దొరైస్వామి అయ్యంగార్, జయరామన్ , బాలమురళీక్రుష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, ఎస్ రామనాథన్, రాధాజయలక్ష్మీ, బొంబయి సోదరీమణులు, ప్రేమా హరిహరన్, మణిక్రుష్ణస్వామి ఇలా సంగీతంలో అతిరథమహారథులైన ఎందరితోనో కలిసి వాద్యకళాకారిణిగా సేవలు అందించారు.

సోదరుడు సత్యనారాయణమూర్తితో కలిసి పలు వయొలిన్ వాద్య కచేరీలు ఇచ్చారు. అమెరికా, జర్మనీ వంటి పలు దేశాల్లో తన వయొలిన్ కచేరీతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆమె దగ్గర వయొలిన్ వాద్యంలో శిక్షణ పొందిన వారిలో స్వదేశీయులే కాదు విదేశీ విద్యార్థులు కూడా ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులకు గురుకుల సంస్క్రతిలో బోధన జరగాలనేవారు ఆమె తరచూ. ఒక సందర్భంలో మాట్లాడుతూ‘ మా నాన్నగారిని విజయనగరంలో ఫిడేల్ నాయుడుగారు అంటూ ఎంతోమంది ప్రియంగా పిలిచేవారు. వయొలిన్ కోసమే ఆయన పుట్టారనిపిస్తుంది. నేను ఆయనకు కూతురును మాత్రమే కాదు శిష్యురాలిని, ఆయన వెంట ఎప్పుడూ ఉండే ఎస్టార్ట్ ను కూడా.

ఆయన కంటిచూపు బలహీనంగా ఉన్నా అది ఎప్పుడూ ఆయన వయొలిన్ సాధనకు ఆటకం కాలేదు’ అని తండ్రితో తన అనుబంధం గురించి మంగతాయారు చెప్తుండేవారు. సంగీత శిఖామణి, కలైమామణిగా పేరొందిన మంగతాయారు అవివాహితగానే ఉండిపోయారు. సంగీతాన్నే తన జీవిత భాగస్వామిగా చేసుకుని బతికారు. నేడు ఆమె భౌతికంగా మనముందు లేకపోయినా ఆమె వయొలిన్ తీగల శబ్ద తరంగాలు, శోభ, లాలిత్యం సంగీతం బతికున్నంత కాలం ప్రజల గుండెలను అంటిపెట్టుకునే ఉంటుంది.

ఆమెకు కళాభివందనాలు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News