Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Viswakarma Yojana: వెనుకబడిన వర్గాలకు ఆర్ధిక భరోసా పీఎం విశ్వకర్మ యోజన

Viswakarma Yojana: వెనుకబడిన వర్గాలకు ఆర్ధిక భరోసా పీఎం విశ్వకర్మ యోజన

భారత ఆర్థిక వ్యవస్థ సమూలంగా మార్పు చేసే శక్తి ఈ పథకానికి ఉంది

మన దేశలోని కులవృత్తులను, చేతివృత్తులను బలోపేతం చేయటానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లాంటి ఒక బృహత్తరమైన పథకాన్ని విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 17న ప్రారంభించి, గురు-శిష్య పరంపరను లేదా చేతులు మరియు పనిముట్లతో పని చేసే చేతి వృత్తులు, కళాకారులచే సాంప్రదాయ నైపుణ్యాల కుటుంబ ఆధారిత అభ్యాసాన్ని బలోపేతం చేయడం, పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న కొత్త కేంద్ర ప్రభుత్వ పథకం. దేశంలో పేద, మద్య తరగతి సంప్రదాయ చేతి వృత్తి కుటుంబాల ఆర్ధిక స్థితిగతులు మారుస్తుందనే విధంగా ఉంది. భారతదేశంలోని ఈ చేతి వృత్తులు, కళాకారులు, వ్యవసాయ కార్మికుల తర్వాత రెండవ ఉండే అతి పెద్ద ఉపాధి సమూహం. మన దేశంలో వ్యవసాయేతర రంగంలో 2030 నాటికి దాదాపు 90 మిలియన్ల కొత్త ఉద్యోగాల అవసరమవుతాయని అంచనా. ఆ దిశగా సూక్ష్మ మరియు చిన్న సంస్థల పాత్రను పరిశీలించాల్సి నటువంటి సమయం నేడు ఆసన్నమైంది. భారతదేశంలో 200 మిలియన్లకు పైగా జీవనోపాధి ప్రత్యక్షంగా లేదా పరీక్షంగా చేతివృత్తుల ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది, 50% కంటే ఎక్కువ మంది చేతివృత్తుల కళాకారులు మహిళలు, అట్టడుగు వర్గాలు చెందినవారు ఉన్నారు. పనికి ఆహార పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఒక విప్లవాత్మకమైన విధానాన్ని తీసుకొచ్చి ఉపాధిని కల్పిస్తే, ఈ విశ్వకర్మ పథకం కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చేతి వృత్తులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసేలా ఉంది, ఎందుకంటే మహాత్మా గాంధీ వంద రోజుల ఉపాధి హామీ పధకం దేశవ్యాప్తంగా అమలు జరిగి దేశంలో ఉన్న ప్రజలందరికి వేతన ఉపాధి అందించి దోహదపడింది. ఆ తరువాత దేశంలో అంతటి ఆర్ధిక పరిస్థితులను ప్రభావితం చేసే పధకంగా ఈ పధకం దాదాపు ముప్పై లక్షల కుటుంబాలను లక్షంగా పెట్టుకొని ముందుకు సాగితే తప్పకుండ దేశ చేతివృత్తుల, హస్త కళల ప్రజల ఆర్ధిక స్థితిగతులు మారుస్తుంది.
విశ్వకర్మ యోజన అనేది సాంప్రదాయిక చేతిపనులు, నైపుణ్యాలలో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడిన భారత ప్రభుత్వ దూరదృష్టితో కూడిన కార్యక్రమం. ఈ పథకం హస్తకళా కారులకు బలమైన మద్దతు వ్యవస్థను అందించడానికి, భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో కూడా దోహదపడుతుంది. చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం విశ్వకర్మ యోజన గొడుగు కింద, దేశవ్యాప్తంగా 18 చేతివృత్తుల కులాల సాధికారత కోసం 13,000 కోట్ల రూపాయల ప్రత్యేక కేటాయింపులను కేటాయించారు. విశ్వకర్మ యోజన ద్వారా దాదాపు 30 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం హస్తకళాకారులకు రూ. 3 లక్షల వరకు సబ్సిడీ రుణాలను అందజేస్తుంది, వారి కళాత్మక కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ఆర్థిక పరిమితులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అనుకూలమైన వడ్డీ రేట్లతో దశలవారీ రుణ పంపిణీ ప్రారంభ దశలో, విశ్వకర్మ పథకం చేతివృత్తుల వారికి 5% తక్కువ వడ్డీ రేటుతో రూ. 1 లక్ష వరకు రుణాలను అందజేస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రస్తుత మార్కెట్‌ రేట్ల కంటే గణనీయంగా తక్కువగా ఉంది, కళాకారులు అధిక వడ్డీ ఛార్జీల భారం లేకుండా క్రెడిట్‌ని పొందగలుగుతారు. తదుపరి దశలో, ఈ పథకం 5% వడ్డీ రేటును కొనసాగిస్తూ రూ. 2 లక్షల వరకు క్రెడిట్‌ మద్దతును అందిస్తుంది. సమగ్ర నైపుణ్యం పెంపుదల వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను గుర్తిస్తూ, విశ్వకర్మ యోజన అధునాతన శిక్షణా కార్యక్రమాల ద్వారా చేతివృత్తుల వారి నైపుణ్యాలను పెంపొందించడంపై పని చేసేలా ఉంది.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద, సాంప్రదాయ కళాకారులకు సమగ్ర శిక్షణా కార్యక్రమం ద్వారా తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి అమూల్యమైన అవకాశాన్ని అందుకుంటారని, ఈ శిక్షణ వడ్రంగులు, టైలర్లు, బుట్టలు అల్లేవారు, క్షురకులు, స్వర్ణకారులు, కమ్మరి, కుమ్మరులు, మిఠాయిలు, చెప్పులు కుట్టేవారు మరియు ఇతరుల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించబడి వారికి అధునాతన సాంకేతికతలు మరియు జ్ఞానంతో సాధికారత కల్పిస్తుందని పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ఉపాధి మార్గాలను సృష్టించేందుకు ఒక ఉత్ప్రేరకంగా ఉంటుందని, ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించడం ద్వారా ఉపాధి కల్పించడం దీని లక్ష్యంగా పెట్టుకు న్నారు. విశ్వకర్మ పథకం కింద వివిధ శిక్షణా కార్యక్రమాల మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని వల్ల చేతివృత్తిదారులు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నాణ్యత శిక్షణ పొందగలుగుతారు.
సాంప్రదాయ కళాకారుల ఆదాయాలను పెంచడం, సాంప్రదాయ కళలు మరియు చేతిపనుల రంగంలో కొత్త ఉద్యోగాలు, అవకాశాలను సృష్టించడం, భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రచారం చేయడం అలాగే సాంప్రదాయ భారతీయ కళలని, చేతిపనులను ప్రపంచ మార్కెట్‌లో మరింత పోటీగా మార్చడం లక్ష్యాలుగా పెట్టుకొని పని చేస్తే గ్రామీణ స్థాయిలో సాంప్రదాయ వృత్తులలో కొత్త అవకాశాలని సృష్టించవచ్చు. నేటి ఆధునిక కాలంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి అవకాశాల కోసం ఎక్కువగా నగరాలకు వలస వస్తున్న ఈ తరుణంలో కుల వృత్తులపై ఆధార పడిన వారికీ ఇతర వృత్తులపై ఆధారపడకుండా సొంత వృత్తిని కొనసాగించటానికి దోహద పడుతుంది. సామజిక శాస్త్రంలో వృత్తి చలనశీలత (Occupational mobility) అనే భావన ఉంటుంది, అనగా వ్యక్తిగత వృత్తి స్థితిలో మార్పులు రావడం. నేడు ఒక కులానికి సంబంధించిన వృత్తిని ఇతర కులాల వారు చేయడం, ఉన్న కులవృత్తిని వదిలి ఇతర రంగాలపై ఉపాధి అవకాశాలపై ఆధారపడటం జరుగుతుంది. ఈ వృత్తి చలనశీలత ఎక్కువ జరిగితే ముఖ్యంగా గ్రామాల ఆర్ధిక సామజిక స్థితి మారిపోతుంది. ఆ విధంగా మారకుండా ఉండటానికి ఈ పధకం కూడా కొంతవరకి ఉపయోగపడుతుంది. ప్రపంచీకరణ ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాలలో చేతివృత్తులు ధ్వంసం అవుతున్నాయి కాబట్టి వాటి నైపుణ్యాన్ని పెంచడం వాటికి మార్కెటింగ్‌ కల్పించడం వాటిని బలోపేతం చేయటం లక్ష్యంగా నేడు ఈ పధకం దేశంలో ఉన్న చేతి వృత్తులు, హస్త కళాకారులకు ఉపయోగపడి వారి సామజిక ఆర్ధిక పరిస్థితులు మార్చే దిశగా ఉంటుదని భావిస్తున్నారు. ప్రపంచీకరణ దేశీయ సాంప్రదాయ చేతి వృత్తి, హస్తకళా పరిశ్రమలపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను చూపింది. ఫలితంగా, ఈ పరిశ్రమలపై ఆధారపడిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా తగ్గి, వారు నేడు అనేక ఆర్థిక మరియు మానసిక సమ స్యలను ఎదుర్కొంటున్నారు.
చేతివృత్తుల వారికి సులభంగా రుణాలు అందేలా చూడటం, నైపుణ్యాన్ని మెరుగుపరచడం, అధునాతన సాంకేతికతలు మరియు పరిజ్ఞానంతో కళాకారులను సన్నద్ధం చేయడం. ఆధునిక సాధనాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందించడం, డిజిటల్‌ లావాదేవీలను స్వీకరించడానికి చేతివృత్తుల వారిని ప్రోత్సహించడం, చేతివృత్తుల వారి చేతిపనులను సమర్థవంతంగా మార్కెటింగ్‌ చేయడంలో వారికి సహాయం చేయడం లాంటివి ఇందులో ప్రధానంగా ఉన్నా వారికీ ఈ అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలి, అప్పుడే పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిధులు విశ్వకర్మ యోజనకు మొత్తం ఆర్థిక మద్దతు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది. ఈ పథకం యొక్క పునాది కేంద్ర మద్దతుతో నిర్మించబడినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం దాని సమర్థవంతమైన అమలులో కీలకం. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఈ విధంగా 18 కులాలకు సంబంధించినటువంటి వారికి 3 లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా లోన్లు మంజూరు చేయడం వల్ల వారు కొంత ఆర్థికంగా సహాయం చేసినట్లు అవుతుంది. అదే విధంగా వారు కులవృత్తులలో నూతన ఉత్పత్తులను తయారు చేయడానికి కావలసినటువంటి శిక్షణను కూడా ఇవ్వడం వల్ల వారు కొంత ఆర్థికంగా ఎదిగి పేదరిక సూచి కంటే మెరుగైన స్థానంలో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉత్పత్తులు కాకుండా స్వదేశీ వస్తువులు, ఉత్పత్తులు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం పలు కులవృత్తులకు ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల నగదు ప్రకటిస్తున్నారు కానీ లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వారికిస్తున్నటువంటి ఆర్థిక సహాయం చాలా తక్కువ. ఏది ఏమైనా కులవృత్తులను ప్రోత్సహించడానికి దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వెనుకబడిన బిసి వర్గాలను, సాంప్రదాయక కులవృత్తులపై ఆధారపడుతున్న వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని ప్రజల ఆశిస్తున్నారు. అయితే ఎటువంటి పైరవీలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క కులవృత్తి చేస్తున్న వారికి ఈ పథకం వర్తింప చేస్తే తప్పకుండా ఆర్థికంగా, సామాజికంగా కొంతవరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పటివరకు దేశంలో వచ్చిన పథకాలలో కంటే ఇది అతి పెద్ద నైపుణ్యాలు పెంచే, సాంప్రదాయ వృత్తులను కాపాడే, కింది స్థాయి వర్గాల ప్రజలకు ఉపయోగపడే పథకం. కానీ కేవలం కులాల సంబంధించిన కులాల వారికే కాకుండా భవిష్యత్‌ లో అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజల కుటుంబాలకు కూడా చేరేలా అమలు పరచాలి. అదే విధంగా ఆర్ధిక సహాయంగా ఇచ్చే డబ్బుని రాయితీగా కాకుండా ఒక పూర్తిస్థాయి గ్రాంటుగా ఇస్తే మరింత లబ్ది చేకూరుతుంది. ఎక్కువగా చేతి వృత్తి మరియు హస్త కళలు సంబంధించి నటువంటి వృత్తిపై ఆధారపడేవారు మెజారిటీ బీసీ వర్గాల చెందిన ప్రజలుగా ఉండటం వల్ల ఈ పథకం వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే నేడు మెజారిటీ బీసీలు మాత్రమే ఆర్థికంగా ఎక్కువగా వెనుకబడి ఉన్నారు.

  • డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ కందగట్ల
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News