ఆధునిక తెలుగు సాహిత్యంలో మరెవ్వరూ అందుకోలేని హిమాలయ శిఖరం విశ్వనాథ సత్యనారాయణ. నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడి వంటి ప్రాచీనాంధ్ర సాహిత్య ఉద్దండుల శకం ముగిసిన తర్వాత ఆధునిక సాహిత్యంలో తెలుగు కావ్యాలకు అటువంటి స్థాయిని కల్పించిన విరాట్ స్వరూపం విశ్వనాథ సత్యనారాయణ. కథ, కథానిక, నవల, నాటకం, గేయ కావ్యం, విమర్శ, వ్యాసం, పద్యం, శతకం ఇలా తెలుగు సాహిత్యంలో చేపట్టిన ప్రక్రియ లేదు. స్పృశించని అంశం కూడా లేదు. శ్రీమద్రామాయణ కల్పవృక్షం అనే మహా కావ్యంతో ఆయన రుషుల కోవలో చేరిపోయారు. ఆయన రచనల్లో సమాజ హితం, చైతన్యం అంతర్లీనంగా కనిపిస్తాయి. మనస్తత్వ విశ్లేషణలతో ఆయన రాసిన నవలలన్నీ ఆణిముత్యాలుగా భాసిల్లాయి. భాష పట్ల ఆయనకు గల అనురాగం, భాషపై ఆయనకున్న అధికారం, భాషను ఆయన వాడిన తీరు న భూతోన భవిష్యతి. ఒక జీవిత కాలాన్ని వెచ్చించినా ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం కష్టం. ఆయన ‘లోకం పట్టనంతటి కవి.’
విశ్వనాథ రచనల్లో స్త్రీ పాత్రలు వివేకవంతంగానూ, జ్ఞానవంతంగానూ, సంస్కార పూరితంగానూ చైతన్యంతో నిండి ఉంటాయి. అర్ధాంగి పట్ల అంతులేని ప్రేమ ఆయన రాతల్లో కనిపిస్తుంది. మాస్వామి శతకం, శాకుంతలం, విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, దమయంతీ స్వయంవరం, స్నేహఫలం, వీరపూజ వంటి రచనలు ఆయన జ్ఞానానికి, విజ్ఞానానికి అద్దం పడతాయి. భారత సంస్కృతికి సంబంధించిన సరైన కాల నిర్ణయం నేపథ్యంగా, మహా భాగవతంలోని భవిష్యత్ పురాణం ఆధారంగా కొనసాగిన అపూర్వ స్రవంతి-మహాభారత యుద్ధం ముగిసిన కాలం నుంచి శాలివాహన చక్రవర్తి వరకూ- పన్నెండు నవలల పురాణ వైరి గ్రంథమాల నిజంగా రసవత్తరం, విజ్ఞానదాయకం. ఇక ఆధునిక భారత చరిత్రనంతా అన్యాపదేశంగా చెప్పిన గొప్ప నవల ‘సముద్రపు దిబ్బ.’ సుతిమెత్తని అనురాగాలు, అనుబంధాలతో, విధి విలాసపు విషాద నవల ఏకవీర. పరాయి పాలనతో వెన్ను విరిగిన వైనాలను కళ్లకు కట్టిన నవల వేయి పడగలు. ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర ప్రశస్తి వంటి తెలుగువారు రొమ్ము విరుచుకుని చెప్పుకునే పద్యకావ్యాలు, నర్తనశాల, వేనరాజు, అనార్కలి వంటి విభిన్న నాటకాలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి వంటి తీయని అచ్చ తెనుగు పాటల మూటలు తెలుగువారు మరచిపోలేనివి.
ఆయన సంస్కృత భాషను కూడా ఔపోశన పట్టారు. ఆయన రాసిన గుప్త పాశుపతం గొప్ప నాటకం. ఇంకా కొన్ని నాటకాలూ, దేవీ త్రిశతి వంటి మహా స్తోత్రాలూ సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఆయన ఇంగ్లీషు భాషలో కూడా మహా పండితుడు. జ్ఞానపీఠ్ అవార్డును అందుకుంటూ ఆయన ఇంగ్లీషులో ఇచ్చిన ఉపన్యాసం, ఇంటర్వ్యూలు చిరస్మరణీయమైనవి. మహా దేవి వర్మ ఆయనకు ఇష్టమైన హిందీ కవయిత్రి. ఆర్ష సంప్రదాయ విలువలను తన సాహిత్యంలో మేళవించి భారతీయ సాహిత్య ప్రమాణాలను నిలబెట్టారు. తెలుగువారి పలుకుబడిని సజీవంగా నిలబెట్టిన విశ్వనాథ వారి జయంతి గత సెప్టెంబర్ 10న తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరిగింది. విశ్వాసాలు వ్యక్తిగతమని, ఇవి సామరస్యంగా జీవించడానికి ఆటంకాలు కానక్కర లేదని ఆయన నమ్మేవారు. విద్యార్థులకు జీతాలు కట్టడం మొదలు, దళిత కవులను దీవించి పైకెత్తడం వరకూ ఆయన, ఒక యువ వితంతువును చేరదీసి, ఆమెకు పునర్వివాహం చేయడం వరకూ ఆయన కార్యకలాపాలు అనంతమైనవి.
Viswanatha Sathyanarayana: తెలుగు సాహిత్యంలో విశ్వనాథ రూటే వేరు!
విరాట్ స్వరూపం విశ్వనాథ..