రాష్ట్రంలో సుమారు 30 వేల మంది బాలికలు గల్లంతు కావడానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థే కారణమంటూ జనసేన నాయకుడు, సినీ నటుడు అయిన పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించడమే కాకుండా, వివాదాస్పదం కూడా అయింది. అసలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్నే ఆయన ప్రశ్నించారు. ఇది పాలక వై.ఎస్.ఆర్.సి.పికి కొనసాగింపులాంటిదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ పాలక పక్షానికి అనుకూలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ కూడా అనేక పర్యాయాలు ఆరోపించడం జరిగింది. పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు మాత్రం నిరాధారంగా కనిపిస్తున్నాయి. తమ ఆరోపణకు మద్దతుగా ఆయన కేంద్ర గూఢచారి సంస్థల నుంచి పొందిన సమాచారాన్ని చూపిస్తున్నప్పటికీ ఆయన ఆరోపణలు ఏమాత్రం సమర్థనీయంగా లేవు.
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలందరికీ అందుబాటులోకి వెళ్లేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చీ రాగానే ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే కాక, పట్టణ ప్రాంతాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కొక్కరు 50 నుంచి 70 చొప్పున కుటుంబాలను ఎంపిక చేసుకుని ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. అనేక అంశాలలో వారు ప్రజలకు సేవలు అందిస్తున్నారనడంలో సందేహం లేదు. వారి సేవల కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక విధాలుగా వెసులుబాటు పొందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, సర్టిఫికేట్లు ఇప్పించడం, అనారోగ్యాలకు సంబంధించి సర్వేలు నిర్వహించడం, పింఛను మొత్తాలను అందజేయడం వంటివి ఇళ్లకు వెళ్లి అందజేయడం జరుగుతోంది.
ఈ సేవలకు గాను ఈ వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు 5,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వీరి సేవలు నిరుపమాన మైనవి. అయితే, దాదాపు ప్రతి వ్యవస్థలోనూ లోపాలున్నట్టే ఈ వ్యవస్థలో కూడా లోపాలు ఉంటే ఉండవచ్చు. ఇందులో కొందరు వాలంటీర్లు నేరాలకు పాల్పడితే పాల్పడి ఉండవచ్చు. పవన్ కల్యాణ్ మాదిరిగా లేనిపోని భయాందోళనలను వ్యాప్తి చేయడం మాత్రం సమంజసంగా లేదు. వారిని వాలంటీర్లుగా నియమించడానికి ఒక పద్ధతి ఉంది. ప్రభుత్వపరంగా ఒక ప్రక్రియ పనిచేస్తోంది. పైగా ఇది పూర్తిగా ఒక స్వచ్ఛంద సేవా వ్యవస్థలాంటిది. వారేమీ ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అవినీతి, కాలయాపన, జాప్యం, అలసత్వం వంటి కారణాల వల్ల తమ సొంత ప్రభుత్వ వ్యవస్థ వల్ల ప్రజలు ఇబ్బంది పడడం తప్ప, ఉపశమనం పొందడం జరగడం లేదని ప్రభుత్వం భావించి ఈ వాలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేసింది. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను ఇంటి వద్దే అందించడంతో పాటు, వారి నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించడం కూడా సమర్థనీయమే. విధానాల రూపకల్పనకు ఈ సమాచారం అవసరం అవుతుంది
పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన మరొక ఆందోళన అర్థం చేసుకోదగిండే. వాలంటీర్లు ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచడం జరుగుతోందా? దాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతోందా? ఈ ప్రశ్నలు ఎవరికైనా ఆందోళన కలిగించే అవకాశం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. ఆర్.టి.జి.ఎస్ ను, ఇ-ప్రగతిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా సమర్థమైన పాలనను అందించడం జరుగుతుందని ప్రకటించింది. అప్పుడు కూడా ప్రభుత్వం సమాచారాన్ని లీక్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కొంతమంది వాలంటీర్లు యావత్ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అనేది జరిగే పని కాదు. ఈ సమాచారాన్నంతటినీ భద్రపరిచే వ్యవస్థ ప్రభుత్వం వద్ద ఉందా అన్నదే ప్రశ్న. ప్రతి వాలంటీర్ పదవీ కాలాన్ని పరిమితం చేయగలిగితే ఈ వ్యవస్థ వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. వారిని పాలక పక్షం స్వలాభం కోసం ఉపయోగించుకుంటోందనే అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉండదు.
Volunteers: వాలంటీర్ల వ్యవస్థ మంచిదే!
వాలంటీర్ పదవీ కాలాన్ని పరిమితం చేస్తే మరింత ప్రయోజనం