Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Who is responsible for Hamas? హమాస్‌ పాపం ఎవరిది?

Who is responsible for Hamas? హమాస్‌ పాపం ఎవరిది?

ఇజ్రాయిల్ చెల్లిస్తున్న మూల్యం భారీగా ఉంది

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనడానికి తాజా ఉదాహరణ ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం. ఇటీవల ఇజ్రాయెల్‌ మీద దాడి చేసి వందలాది మందిని బలి తీసుకోవడమే కాకుండా, వందలాది మందిని కిడ్నాప్‌ చేసిన హమాస్‌ ఉగ్రవాదులు ప్రస్తుతం ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కల్పిస్తున్నారు. అయితే, పాలస్తీనాలోని ఈ హమాస్‌ ఉగ్రవాదులను సృష్టించిందెవరు, వీరిని ప్రోత్సహించిందెవరు, వీరి ఎదుగుదలకు కారణమైందెవరు అన్న ప్రశ్నలను పరిశీలించి చూడాల్సిన అవసరం ఉంది. నేరుగా ప్రోత్సహించక పోయినా, ఆరంభ దశలో దీనికి పాలుపోసి, నీళ్లుపోసి, జవసత్వాలు సమకూర్చిందెవరు? ఈ ఉగ్రవాదులను ప్రోత్సహించింది పాలస్తీనానో, అరబ్‌ దేశాలో, సిరియానో, ఇరానో, జోర్డానో అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఇరాన్‌ ప్రోత్సహిస్తుంటే ప్రోత్సహిస్తుండవచ్చు. కానీ, ప్రారంభ దశలో హమాస్‌ ఉగ్రవాదులను ప్రోత్సహించినవారు, పోషించినవారు సాక్షాత్తూ ఇజ్రాయెల్‌ పాలకులు. ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది నూటికి నూరు పాళ్లూ వాస్తవం. ఈ సంస్థ గాజాలో ప్రారంభం అయినప్పుడు ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా ప్రారంభం అయింది. ఈ కార్యకలాపాలతో పాటు కొద్దిగా మత ప్రచారాన్ని కూడా చేపడుతూ ఉండేది.
ఈ సంస్థను 1978లోయ షేక్‌ మహమ్మద్‌ యాసిన్‌ అనే వ్యక్తి రిజిస్టర్‌ చేశాడు. అతను ఆ సంస్థను రిజిస్టర్‌ చేయడానికి ఇజ్రాయెల్‌ చేయవలసిన సహాయమంతా చేసింది. అతనికి ఒక కన్ను కనిపించదు, ఒక కాలు పని చేయదు. మొదట్లో అతను మత ప్రచారానికే పరిమితం కావాలని భావించాడు. అయితే, అతన్ని ఇజ్రాయెల్‌ చేరదీసింది. ఇజ్రాయెల్‌ అతన్ని ప్రోత్సహించడానికి, పోషించడానికి ఒక కారణం ఉంది. అప్పటికే వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతంలో యాసిర్‌ అరాఫత్‌ నాయకత్వంలో ‘అల్‌ఫతా’ అనే పేరుతో పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పి.ఎల్‌. ఓ) అనే సంస్థ బలంగా పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రాబల్యాన్ని, ప్రాభవాన్ని దెబ్బతీయడం కోసం, బలహీనపరచడం కోసం ఇజ్రాయెల్‌ ఒక పథకం ప్రకారం, ఈ హమాస్‌ సంస్థను రిజిస్టర్‌ చేయించడమే కాకుండా, అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చింది. ఈ సంస్థకు ఇజ్రాయెల్‌ గూఢచారి వ్యవస్థ ఇతోధికంగా సహాయ సహకారాలు అందించింది. ప్రపంచ వ్యాప్తంగా పలుకుబడి కలిగి ఉండి, గల్ఫ్‌ దేశాలలోనే కాక, ఐరోపా దేశాలలో సైతం బలం కలిగి ఉండి మకుటం లేని మహారాజులా చెలామణీ అవుతున్న యాసిర్‌ అరాఫత్‌ ను దెబ్బ తీయడమే ఇజ్రాయెల్‌ లక్ష్యం. గాజాకు అప్పట్లో గవర్నర్‌ గా ఉన్న బ్రిగేడియర్‌ జనరల్‌ ఇక్జాక్‌ సెకేవ్‌ను కూడా తమ వైపునకు తిప్పుకోవడం జరిగింది. వాస్తవానికి యాసర్‌ అరాఫత్‌ పాలస్తీనా కోసం పోరాడినప్పటికీ అతను నిఖార్సయిన లౌకికవాది. విచిత్రమేమిటంటే, అరాఫత్‌ ప్రారంభించిన పి.ఎల్‌.ఓలో క్రైస్తవులు కూడా ఉండేవారు.
ఈ యాసిర్‌ అరాఫత్‌ ను ఏదో విధంగా బలహీనపరచడం కోసమే ఇజ్రాయెల్‌ ఈ హమాస్‌ దశను, దిశను మార్చేసింది. అయితే, ఆ తర్వాత ఇజ్రాయెల్‌ పాలకులకు తామొక పాముకు పాలు పోసి పోషిస్తున్నామని, భస్మాసురుడిని సృష్టిస్తున్నామని ఇజ్రాయెల్‌కు చాలా త్వరగానే తెలిసి వచ్చింది. చివరికి షేక్‌ మహమ్మద్‌ యాసిన్‌ నాయకత్వంలోని హమాస్‌ ఇజ్రాయెల్‌ నెత్తినే చేయి పెట్టడానికి సిద్ధమైంది. మూడు సందర్భాలలో, అంటే 2009, 2012, 2014 సంవత్సరాలలో, హమాస్‌ ఇజ్రాయెల్‌పైన చాలా భయంకరంగా పోరాటాలు సాగించింది. ఈ క్రమంలో హమాస్‌ ఒక సేవా సంస్థ స్థాయి నుంచి క్రమంగా పోరాట సంస్థగా, ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. నిజానికి ఇది ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించే, ఆదరించే దేశాలకు ఒక పెద్ద గుణపాఠమని చెప్పాలి. నిప్పుతో చెలగాట మాడడం అంటే ఇదే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలన్నీ ఇప్పుడు అష్టకష్టాలు పడుతు న్నాయి. అమెరికా కూడా ఇదే విధంగా అఫ్ఘానిస్థాన్లో రష్యాను దెబ్బతీయడం కోసం ఒసామా బిన్‌ లాడెన్‌ అనే సాధారణ వ్యాపారవేత్తను ఉగ్రవాదిగా మార్చింది. అతను చివరికి ఏకు మేకై కూర్చున్నాడు. ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్‌ లోనే తాలిబాన్లను కూడా సృష్టించింది. ఈ తాలిబాన్లకు పాకిస్థాన్‌ నుంచి కూడా ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహం, పోషణ లభించాయి. అమెరికా మీద లాడెన్‌ మదాడి చేయడం జరిగింది. ఇప్పుడు తాలిబాన్లు పాకిస్థాన్లో కనీవినీ ఎరుగని అస్థిర పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇందిరా గాంధీ కూడా పంజాబ్‌ లో అకాలీదళ్‌ ను బలహీనపరిచేందుకు ఖలిస్థాన్‌ ఉద్యమాన్ని సృష్టించడం జరిగింది. ఉగ్రవాదుల్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు, దేశాధినేతలకు ఇది ఒక గుణపాఠంగా భావించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News