Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Rajasthan Assembly Elections: రాజస్థాన్‌ రాజు ఎవరు ?

Rajasthan Assembly Elections: రాజస్థాన్‌ రాజు ఎవరు ?

ఉచితాలు, కుల సమీకరణాలను నమ్ముకున్న పార్టీలు

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. రాజస్థాన్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికలు జరుగుతున్న రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి కావడం విశేషం. మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. సిద్ధాంత వైరుధ్యాలతో పాటు కులాల కుంపట్లు కూడా రాజస్థాన్‌లో ఎక్కువే. అధికారపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ ఎడాపెడా ఉచితాలు ప్రకటించింది. కాగా కిందటిసారి ఎన్నికల్లో పోగొట్టుకున్న ఓటు బ్యాంకును ఎలాగైనా రాబట్టుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

- Advertisement -

ఈసారి ఎలాగైనా రాజస్థాన్‌ లో పాగా వేయడానికి భారతీయ జనతా పార్టీ అస్త్రశస్త్రాలు ప్రయోగించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్ షా సహా కమలం పార్టీ పెద్దలంతా అనేకసార్లు రాజస్థాన్‌లో పర్యటించారు. అశోక్ గెహ్లాట్ సర్కార్‌ను తూర్పారబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే పదే పదే డబుల్ ఇంజన్ సర్కార్ తో కలిగే ప్రయోజనాలను ఏకరువు పెట్టారు. రాజస్థాన్ ప్రజల సమస్యలు పరిష్కరించడం మానేసి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు నిధులు సేకరించడంపైనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రత్యేక దృష్టి పెట్టారని కమలం పార్టీ పెద్దలు తీవ్ర ఆరోపణలు చేశారు. కిందటిసారి ఎన్నికల్లో పోగొట్టుకున్న ఓటుబ్యాంకును ఎలాగైనా రాబట్టుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సామాజికవర్గాలపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది.

రాజస్థాన్‌లో కులాల కుంపట్లు !
రాజస్థాన్‌ ఎన్నికలపై పార్టీల గొడవల కంటే కులాల కుంపట్లే ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తుంటాయి ఇక్కడి ప్రధాన పార్టీలు. టికెట్ల కేటాయింపులో కూడా కుల సమీకరణాలే కీలక పాత్ర పోషిస్తుంటాయి. రాజస్థాన్ రాజధాని నగరమైన జైపూర్‌లో ఇటీవల వివిధ కుల మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ కుల మహాసభలకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వివిధ నాయకులు హాజరయ్యారు. రాజస్థాన్‌లో అనేక సామాజిక వర్గాలున్నాయి. అయితే వీటిలో కొన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యం ఉంది. జాట్‌, రాజ్‌పుత్‌, మీనా, గుజ్జర్‌, బ్రాహ్మణ వర్గాలు ఈ జాబితాలోకి వస్తాయి. అయితే వీటిలో ఏ ఒక్క కులానికీ మొత్తంగా రాజస్థాన్ రాజకీయాలపై గుత్తాధిపత్యం లేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులం ఆధిపత్యం ఉంటుంది. జాట్‌…రాజస్థాన్‌ రాష్ట్రంలో పొలిటికల్‌గా పవర్‌ఫుల్ కమ్యూనిటీ ఇది. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 42 మంది జాట్ కులస్తులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇందులో వివిధ పార్టీలకు చెందిన వారున్నారు. కాగా ఈసారి తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య 50కి పెరగాలన్నది జాట్ సామాజికవర్గ నేతల ఆలోచన. ఇందుకు అనుగుణంగా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జైపూర్‌లో జాట్ మహాకుంభ్ పేరుతో భారీ ఎత్తున ఒక సమావేశం కూడా నిర్వహించుకున్నారు. జాట్ వర్గానికి చెందిన నేతలు పలువురు వివిధ రాజకీయ పార్టీల్లో ప్రముఖులుగా ఉన్నారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవింద్ డోటాసరా కూడా జాట్ సామాజికవర్గానికి చెందిన నేతనే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది జాట్ సామాజికవర్గం. అయితే అనేక కారణాలతో జాట్ రాజకీయ వైఖరిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం మెజారిటీ జాట్‌లు బీజేపీకి అండగా ఉంటున్నారు. తమ కమ్యూనిటీకి చెందిన నాయకుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి కావాలన్నది జాట్ సామాజికవర్గం చిరకాల కోరిక. ఇటీవలి కాలంలో బీజేపీకి చెందిన వసుంధరా రాజేకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. వాస్తవానికి వసుంధరా రాజే జాట్‌ ఆడపడుచుకాదు. జాట్ ల కోడలు రాజే. అలాంటిది తమ కోడలుకు ప్రాధాన్యం తగ్గించడంపై జాట్ కులస్తులు మండిపడుతున్నారు. దీంతో ఈ పరిణామం బీజేపీకి మైనస్ పాయింట్‌గా మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదొక్కటే కాదు నిన్న మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న సతీశ్ పూనియాను పక్కన పెట్టడం కూడా జాట్ సామాజికవర్గానికి మింగుడు పడటం లేదు.

ఈసారి గుజ్జర్లు ఎటువైపు ?
కాంగ్రెస్ విషయానికొస్తే, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు జాట్‌ల వ్యతిరేకిగా పొలిటికల్ సర్కిల్స్‌లో అపప్రధ ఉంది. ఎన్నికల ప్రచారం జరిగినంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఇదొక ఇబ్బందికర అంశంగా మారింది. జాట్‌ల తరువాత రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సామాజికవర్గం…గుజ్జర్లు. వీరు ప్రధానంగా తూర్పు రాజస్థాన్‌లో ఉంటారు. తూర్పు రాజస్థాన్‌లోని కరౌలీ, టోంక్‌, హిండౌన్‌,దౌసా జిల్లాల్లో గుజ్జర్ల ప్రాభవం ఎక్కువ. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న సచిన్ పైలట్ గుజ్జర్ సామాజికవర్గానికి చెందిన నాయకుడే. సచిన్ పైలట్‌ ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో 2018 ఎన్నికల్లో గుజ్జర్లు కాంగ్రెస్‌ కు వెన్నుదన్నుగా ఉన్నారు. అయితే సచిన్ పైలట్‌కు ముఖ్యమంత్రి కుర్చీ దక్కలేదు. సచిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఆ తరువాత రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి.ఇందులో భాగంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టు నుంచి కూడా సచిన్ పైలట్‌ను తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఇప్పటికైతే కాంగ్రెస్‌ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు గుజ్జర్లు. రాజస్థాన్‌లో మరో కీలక సామాజికవర్గం …రాజ్‌పుత్‌. జనసంఘ్‌ కాలం నుంచి రాజ్‌పుత్‌లు కమలం పార్టీకి అండగా ఉంటున్నారు. కిందటిసారి ఎన్నికల్లో 24 మంది రాజ్‌పుత్‌లు బీజేపీ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు రాజ్‌పుత్‌లు గెలిచారు. ప్రస్తుతం బీజేపీ అసెంబ్లీ బరిలో ఉన్న రాజ్యవర్థన్ రాథోడ్, దియా కుమారి రాజ్‌పుత్‌లే. ఈ నేపథ్యంలో ఈసారి రాజ్‌పుత్ సామాజికవర్గం కమలం పార్టీకి అండగా నిలుస్తుందన్న ఊహాగానాలు జైపూర్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు రాజస్థాన్ రాజకీయాల్లో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషించారు. అయితే కాలక్రమంలో బ్రాహ్మణుల హవా తగ్గింది. మొత్తంమ్మీద సామాజికవర్గాల సమీకరణాలే ఈసారి ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించబోతున్నాయి.

ఎన్నికల్లో కీలక అంశాలు
ఈసారి ఎన్నికల్లో అనేక అంశాలు కీలకం అయ్యాయి. ఇందులో పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం ఒకటి. రాజస్థాన్‌లో గత నాలుగున్నరేళ్ల కాలంలో 18 సార్లు పరీక్షా పత్రాలు లీకయ్యాయి. ఈ పేపర్‌ లీకేజీల ఎపిసోడ్లు విద్యారంగంలో దుమారం రేపాయి. పరీక్షా పత్రాల లీకేజీలపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అశోక్ గెహ్లాట్ సర్కార్‌కు పరీక్షలు నిర్వహించం కూడా రాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి పేపర్‌ లీకేజీల ఎపిసోడ్లు మైనస్ పాయింట్‌గా మారింది. అవినీతి అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ చేపట్టిన దీక్ష కూడా ఈసారి ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉన్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తూ దాదాపు ఏడాదిన్నర కిందట సచిన్ పైలట్ దీక్ష చేపట్టారు. దీంతో కాంగ్రెస్ సర్కార్‌లో అవినీతి జరిగిందన్న సంకేతాలు సామాన్య ప్రజలకు అందాయి. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతిపై కొత్త చట్టం చేయాల్సి వచ్చింది. కొత్త చట్టం సంగతి ఎలా ఉన్నప్పటికీ సచిన్ పైలట్ దీక్ష, అశోక్ గెహ్లాట్ సర్కార్‌కు మాయని మచ్చలా తయారైంది. ఈసారి ఎన్నికల్లో మరో కీలకాంశం ఉచిత పథకాలు. రాజస్థాన్‌లో మరోసారి అధికారానికి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎడాపెడా ఉచిత పథకాలను ప్రకటించింది. ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల మేర బీమా అవకాశం కల్పిస్తామంటూ హస్తం పార్టీ ఇచ్చిన హామీకి ప్రాథమికంగా ప్రజల్లో మంచి స్పందన లభించింది. అలాగే మరోసారి అధికారంలోకి వస్తే వంద యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మరో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ హామీలపై పేదలు, గ్రామీణ ప్రాంతాలవాసుల నుంచి సానుకూల స్పందన లభించిన సంకేతాలు అందాయి. దీంతో ఉచిత పథకాల హామీలే తమను గెలుపు తీరాలకు చేరుస్తాయని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

-ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్, 63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News