Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Who wins in Telangana?: తెలంగాణ ఎన్నికలలో గెలిచేది వోటర్లా? నాయకులా ?

Who wins in Telangana?: తెలంగాణ ఎన్నికలలో గెలిచేది వోటర్లా? నాయకులా ?

ఓటర్లూ.. ఓట్లేయండి

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3, 2023 గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రారంభమైన నామినేషన్ల పర్వం చివరి తేదీయైన 10 నవంబర్ 2023 వరకు కొనసాగింది. నామినేషన్ల ఉపసంహరణ తేదీ నాటికి 4,798 మంది అభ్యర్థులు 5,716 నామినేషన్లు దాఖలు చేయగా అందులో 606 నామినేషన్లు తిరస్కరింపబడి మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 2,898 నామినేషన్లు ఆమోదింపబడ్డాయి. అందులో 608 నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 2,290 అభ్యర్థులు బరిలో మిగలగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం కోసం 36,655 పోలింగ్ స్టేషన్లలో 59,779 బాలెట్ యూనిట్లతో ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. కాగా ఈ సారి శాసన సభ ఎన్నికలలో 1,58,71,493 పురుషులు 1,58,43,339 స్త్రీలు మరియు 2,557 ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుని 2,290 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నవంబర్ 30 వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రం లోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను, 18 నియోజకవర్గాలు ఎస్సీలకు మరియు 9 నియోజకవర్గాలు ఎస్టీ లకు కేటాయించబడినవి.

- Advertisement -

రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మొత్తం 119 నియోజకవర్గాలలో తన అభ్యర్థులను బరిలో నిలపగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుని విజయ బావుటా ఎగిరేసి “హ్యాట్రిక్” సాధించి ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇదిలా ఉండగా జాతీయ పార్టీలైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థితో సహా) మరియు భారతీయ జనతా పార్టీ (8 మంది జనసేన అభార్తులతో సహా) మొత్తం 119 నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను నిలపగా స్వర్గీయ కాన్షీరాం ద్వారా స్థాపితమైన మరో జాతీయ పార్టీ బహాజన సమాజ్ పార్టీ 106 మంది అభ్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 19 మంది అభ్యర్థులను మరియు హైదరాబాద్ పాత బస్తీలో పట్టున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 9 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేలా ఎప్పటికప్పుడు ఎత్తుగడలను రచిస్తూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మరో వైపు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు భారీగా నగదు, మద్యపానం మరియు ఇతర వస్తువుల రూపేణా ప్రయత్నించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడులలో ఎన్నికల సంఘం రు.659.20 కోట్ల విలువ గల నగదు మరియు ఇతర వస్తువులను జప్తు చేసింది.

వాగ్దానాల హోరు:

2023 శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాల్ని ప్రకటించింది. కాగా బీజేపీ “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” (అందరితో మమేకమై, అందరి అభివృద్ధే లక్ష్యంగా, అందరి విశ్వాసాన్ని చూరగొనడం) నినాదంతో పాటు దశాబ్దాల పోరాట ఫలితంగా స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక “దళితుడిని” తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తామని వాగ్దానం చేసి వంచించిన భారాస మరియు ఐదు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగి ఒక్క పర్యాయం కూడా బిసి వ్యక్తిని పూర్తి కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వని కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఎన్నికలకు ముందే, తాము అధికారం లోకి వస్తే బిసి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం తో పాటు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం సానుకూలమని అందుకు తగు నిర్ణయం తీసుకుంటామని సాక్షాత్తూ ప్రధానమంత్రి ద్వారా ప్రకటింప చేసింది. మరో వైపు అధికారంలో ఉన్న భారాస ప్రభుత్వం మాత్రం ఈ రెండు జాతీయ పార్టీలు ఒకే నాణేనికి ఉండే బొమ్మ-బొరుసు లాంటివని, వీటిని నమ్ముకుంటే మిగిలేది శుష్కప్రియత్వాలు శూన్య హస్తాలేనని ఎద్దేవా చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు విజయం తమదంటే తమదని భుజాలు చరుచుకుంటూ హేమాహేమీ నాయకులతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రచార ఆర్భాటాలకు నేటి సాయంత్రం నుండి తెరపడనుంది.

వోటింగ్ సరళి:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2014 లో మొత్తం 2,81,65,885 ఓట్లకు గాను 1,94,43,411 (69 శాతం) ఓట్లు పోలవగా 2018 లో 2,56,94,443 ఓట్లకు గాను 2,04,70,749 (79.7 శాతం) పోలింగ్ నమోదయ్యింది. పార్టీ పరంగా గెలుపొందిన సీట్లు మరియు వోటింగ్ శాతం వివరాలు:

పార్టీల వివారాలు

2014

2018

గెలిచిన సీట్లు

ఓట్ల శాతం

గెలిచిన సీట్లు

ఓట్ల శాతం

తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత భారత రాష్ట్ర సమితి)

63

34.30

88

47.40

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

21

25.20

19

28.17

భారతీయ జనతా పార్టీ

5

7.10

1

6.98

తెలుగు దేశం పార్టీ

15

14.70

2

3.50

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్

7

3.80

7

2.70

స్వతంత్ర అభ్యర్థులు

1

5.00

1

3.25

ఇతరులు

7

9.90

1

3.25

2018 ఎన్నికలలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 76.50 శాతం ఓటింగ్ నమోదు కాగా హైదరాబాద్ లో అత్యల్పంగా 50.00 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. నియోజకవర్గం పరంగా వరంగల్ జిల్లా లోని నర్సంపేట్ లో 84 శాతం వోటింగ్ నమోదు కాగా హైదరాబాద్ లోని యాఖుత్ పుర నియోజకవర్గంలో కేవలం 45 శాతం వోటింగ్ నమోదయ్యింది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ లోని 24 అర్బన్ స్థానాల్లో చాలా వరకు గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 40 నుండి 55 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. తక్కువ పోలింగ్ శాతానికి ప్రధానంగా పట్టణ ప్రాంత విద్యాధికుల నిర్లిప్తతే కారణం. కార్పోరేట్, ఐ టి మరియు ఇతర రంగాలలో పని చేసే చాలా మంది ఉద్యోగస్తులు పోలింగ్ రోజును కేవలం ఒక సెలవు దినంగా పరిగణించి సరదాగా సమయం గడిపేందుకు మొగ్గు చూపుతారు తప్ప బాధ్యాతాయుతమైన పౌరులుగా భారత రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకుని తమ బాధ్యతను నిర్వర్తించడంలో అలసత్వం ప్రదర్శిస్తారు. కొందరు చదువుకున్న వారు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాలను నిందిస్తూ కాలం వెళ్ళబుచ్చుతారు తప్ప వ్యవస్థ బాగు కోసం తమలాంటి వారి సహకారం అవసరమన్న విషయాన్ని గుర్తించకపోవడం విడ్డూరం. విద్యావంతులు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగిస్తే పరిస్థితి తప్పకుండా ఆశాజనకంగా మారుతుంది.

వోటర్లలో చైతన్యం రావాలి:

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణన లోకి తీసుకోకుండా, ఏమాత్రం దూరదృష్టి లేకుండా కేవలం అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు తమకు తోచిన విధంగా వాగ్దానాలు గుప్పిస్తూ ఉచితాలు ప్రకటించడాన్ని దేశ మరియు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి పౌరుడు నిర్ద్వందంగా ఖండించాలి. సామాజికంగా వంచనకు గురైన అట్టడుగు వర్గాలను, అర్హులైన పేదలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. అయితే అట్టి పథకాలు లబ్దిదారులను స్వావలంబన దిశగా పయనింపచేసి, వారిలో ఆత్మవిశ్వాసం పాదుకొల్పి, దేశ మరియు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసేలా ఉండేలా తప్ప తరతరాలు సోమరిపోతులుగానో లేదా జీవితాంతం పరాన్నజీవులుగానో మిగిలిపోయేలా చేయకూడదు. “కాంగ్రెస్ చెప్పిన హామీలు అమలుకావాలంటే ఏటా 50 లక్షల కోట్ల బడ్జెట్ కావాలని, ఇప్పుడున్న తెలంగాణ బడ్జెట్ కేవలం 3 లక్షల కోట్లేనని, ఆ పార్టీ ప్రకటించిన వాగ్దానాలు అమలు కావాలంటే 30 ఏండ్లు పట్టవచ్చు” అని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా వ్యవస్థాపకులు డా జయప్రకాశ్ నారాయణ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యను విజ్ఞులైన ఓటర్లు గమనించాలి.

అభ్యర్థుల నేరచరిత:

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం 2290 అభ్యర్ధులలో 521 (23 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు పేర్కొనగా, 2018 లో 1777 అభ్యర్ధులకు గాను 368 (21 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు తమ నామినేషన్ పత్రాలలో పేర్కొన్నారు. పైన పేర్కొన్నవి సాధారణ క్రిమినల్ కేసులు కాగా 2023 లో 15 శాతం మంది మరియు 2018 లో 13 శాతం మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు వివిధ న్యాయస్థానాలలో విచారణలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13, 2020న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు, నేర చరిత గల వ్యక్తులను తమ అభ్యర్థులుగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎంచుకోవడానికి గల ఆంతర్యాన్ని ప్రశ్నిస్తూనే సచ్చీలురైన వ్యక్తులను ఎంపిక చేయడానికి వారికి గల అశక్తతను కూడా ప్రశ్నించింది. నాటి తన ఆదేశాలలో, అటువంటి ఎంపికకు కారణాలను తెలియజేయాలని మరియు నేర చరిత్ర లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. అయినప్పటికీ 2023 తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో కూడా రాజకీయ పార్టీలు తమ పాత పద్ధతులను అనుసరిస్తూ అంగ మరియు అర్థ బలం గల 23 శాతం మంది నేరచరితులను తమ అభ్యర్థులుగా ప్రకటించడం సుప్రీంకోర్టు సూచనలను బేఖాతరు చేసినట్లయ్యింది. రాజకీయ పార్టీల ఈ వైఖరి మన దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు దర్పణం పడుతోంది.

నిరాశా నిస్పృహలకు తావు లేదు:

రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ “ప్రజాస్వామ్య వ్యవస్థ” లో మెజారిటీ ఓటర్ల నిర్ణయమే శిరోధార్యం. చైతన్యవంతులైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. భారత రాజ్యాంగం ద్వారా వర్ణ, వర్గ, లింగ విబేధాలు లేకుండా దేశంలోని పౌరులందరికీ ప్రాథమిక హక్కులలో భాగంగా సంక్రమించిన ఓటు హక్కును తమ పూర్తి విచక్షణను ఉపయోగిస్తూ రాజకీయ పార్టీలు స్వార్థపూరిత స్వప్రయోజనాల కోసం వెదజల్లే ప్రలోభాలకు ఏమాత్రం లొంగకుండా నిర్భీతితో వినియోగించుకుని దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా తమ బాధ్యతను నిర్వర్తించాలి. పరిణతి లేని ఓటర్ ఐదు సెకన్లలో చేసే పొరపాటు ఐదేళ్ళ గ్రహపాటుగా మారుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి విజ్ఞతను ప్రదర్శించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టం కట్టాలి.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News