Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Why do we need Ram Mandir in Ayodhya?: రామ మందిరం అవసరమేమిటి?

Why do we need Ram Mandir in Ayodhya?: రామ మందిరం అవసరమేమిటి?

ఆ అవకాశం లేకపోవడం లౌకికవాదమా?

రామ మందిర నిర్మాణం వల్ల జరిగేదేమిటి? ఒరిగేదేమిటి? ప్రస్తుతం దేశంలో వివిధ రాజకీయ పక్షాలు, వివిధ వర్గాలు దీనిపై వాదోపవాదాలు సాగిస్తున్న నేపథ్యంలో దీని ప్రాధాన్యం గురించి వివరించాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని కేవలం ఒక మతపరమైన అంశంగానే కాక, నాగరికతకు సంబంధించిన విషయంగా కూడా పరిగణించాలని సంప్రదాయవాదులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి, ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతోందంటే దేశమంతా కోలాహలంగా మారిపోయింది. ఇందులో సందేహమేమీ లేదు. ప్రస్తుతం దేశమంతా ఒక విధమైన రామ నామ ఉన్మాదంలో మునిగిపోయింది. దేశంలో త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇందులో కొంత రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటే ఉండవచ్చు కానీ, దేశంలో అత్యధిక సంఖ్యాక ప్రజలకు ఇది అభిమానపాత్రమైన అంశమే. రాజకీయాలతోనూ, సిద్ధాంతాలతోనూ సంబంధం లేని వ్యక్తులకు ఇది చాలా ముఖ్యమైన విషయమేననేది కాదనలేని విషయం. ఏవిధంగా చూసినా ఇదొక చారిత్రాత్మక సంఘటనే. అనేక సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత దేశ సంస్కృతి, నాగరికత మళ్లీ తనను తాను వ్యక్తం చేసుకోగలుగుతోంది. ఇదొక నాగరికత పునరుజ్జీవన ప్రయత్నం. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున సామూహిక ప్రార్థనలు జరపడం, దేశవ్యాప్తంగా ప్రతి దేవాలయంలోనూ దీపాలు, ధూపాలు వెలిగించడం, ఇంటా బయటా భజనలు, సత్సంగాలు, ప్రవచనాలు నిర్వహించడం, వనవాసం నుంచి తిరిగి వచ్చిన రాముడికి స్వాగతం పలుకుతున్నట్టుగా ప్రతి ఇంటి ముందు దీపపు ప్రమిదలు ఏర్పాటు చేయడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, పురాతన నాగరికతకు మళ్లీ ప్రాణం వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇందులో పాల్గొనడాన్ని దేశంలోని ప్రతి అయోధ్య అభిమానీ ఉడుతా భక్తిగా భావించడం జరుగుతోంది. అనేక సంవత్సరాలుగా హిందువు తానొక హిందువునని చెప్పుకోవడానికి భయపడే, బాధపడే, సిగ్గుపడే పరిస్థితి నెలకొని ఉంది. దేశంలోకి మొట్టమొదటి సారిగా మొగలులు అడుగుపెట్టడం, వారి తర్వాత బ్రిటిష్‌ పాలకులు పాలనలోకి దిగడం, ఆ తర్వాత కూడా సుమారు 75 సంవత్సరాల పాటు హిందువులు నిర్లక్ష్యానికి గురికావడం వంటి పరిణామాల వల్ల హిందువుల ప్రాభవం, ప్రాధాన్యం స్వదేశంలోనే తగ్గడం జరిగింది.
సరికొత్త బలం ఏవో కొన్ని సిద్ధాంతాలను, సూత్రాలను కలుపుకుని ఏర్పడ్డ మతంగానూ, నాగరికతే లేని జీవన శైలిగానూ ఇతర వర్గాలన్నీ భావించడమే కాకుండా, అదే నిజమని హిందువులను సైతం నమ్మించి వారిలో ఆత్మన్యూనతను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అయోధ్య వేడుక ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశవ్యాప్తంగా దాదాపు ప్రతి వర్గమూ, ప్రతి మతమూ తమ సొంత అస్తిత్వాన్ని, తమ గుర్తింపును గర్వంగా చాటుకుంటున్న దశలో, హిందువులకు అటువంటి అవకాశాన్ని దక్కనివ్వక పోగా, వారిని మతతత్వవాదులుగా, తిరోగమనవాదులుగా పరిగణించడం అనేది నిజంగా అతిపురాతన భారతీయ నాగరికతకు, సంస్కృతికి గొడ్డలిపెట్టు. హిందువులను అన్ని విధాలా అణచివేయడాన్ని కొనసాగిస్తూనే, ఇతర మతస్థులను, అల్పసంఖ్యాక వర్గాల వారిని సంతృష్టిపరచడమే లౌకికవాదంగా చెలామణీ చేయడం జరుగుతోంది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దీనినంతటినీ ఉలిక్కిపడేటట్టు చేసింది. ఒక విధమైన షాక్‌ ట్రీట్మెంట్‌ ఇచ్చినట్టయింది.
అయోధ్య కేసును, పూర్వాపరాలను పరిశీలించిన వారికి సుమారు అయిదు వందల ఏళ్లపాటు హిందువులు ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరించారో అర్థమవుతుంది. అయోధ్యను చేజిక్కించుకోవడానికి వారికి అయిదు శతాబ్దాలు పట్టడం ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన విషయమే. బాబర్‌ కాలం నుంచి మొగలులు నిష్క్రమించే వరకూ దేశంలో అయోధ్యతో సహా దేవాలయాలు ఏ విధంగా విధ్వంసకాండకు గురవుతూ వచ్చిందీ విలియం ఫించ్‌, థామస్‌ హెర్బర్ట్‌, జోసెఫ్‌ టిఫెన్‌ తేలర్‌, రాబర్ట్‌ మాంట్‌ గోమరీ మార్టిన్‌ తదితర బ్రిటిష్‌ పర్యాటకులు, పరిశోధకులు రాసిన గ్రంథాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయోధ్య అనేది రామజన్మ భూమి అనీ, రాముడు ఇక్కడే పుట్టి పెరిగాడనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని 1858 నుంచి మరాఠాలు, నిహాంగ్‌ సిక్కులూ న్యాయస్థానాల్లో పోరాటాలు జరుపుతూనే ఉన్నారు. పురాణాలు, పరిశోదక గ్రంథాలు, చారిత్రక, న్యాయపరమైన సాక్ష్యాలు, పురాతత్వ తవ్వకాలు వగైరాల సమీకరణ జరిగిన తర్వాత కూడా వీటిని న్యాయస్థానాల్లో నిరూపించడానికి నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. ఈ పరిణామాల కారణంగానే అయోధ్యకు ఇంత ప్రాధాన్యం ఏర్పడింది.
పెరుగుతున్న ప్రాధాన్యం అయిదు వందల సంవత్సరాల పాటు మౌన పోరాటం సాగిస్తున్న హిందువులు చివరికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా న్యాయం కోసం 75 సంవత్సరాలు నిరీక్షించాల్సి రావడం నిజంగా విచిత్రమైన విషయం. ఎట్టకేలకు ఈ కల సాకారం అయిన తర్వాత కూడా ఈ వేడుకలను తగ్గుస్థాయిలో నిర్వహించాలంటూ ఒత్తిడి తేవడం అసంబద్ధంగానే కనిపిస్తోంది. పురాతన సంస్కృతి, నాగరికతలతో తెగతెంపులు చేసుకుని, సరికొత్త నాగరికతతో దేశాన్ని ముందుకు నడిపించాలని నెహ్రూ కోరుకోవడం వల్ల దేశ పురాతన నాగరికతకు తీరని విఘాతం కలిగింది.
అతి దారుణమైన పరిస్థితుల్లో దేశంలో ప్రవేశపెట్టిన లౌకికవాదం కూడా పక్షపాత ధోరణితోనే సాగడం దురదృష్టకరం. లౌకికవాదం కారణంగా హిందువులకు తమ దేవాలయాల మీద, తమ విద్యాసంస్థల మీద పట్టుకోల్పోవడం జరిగింది. పది రాష్ట్రాలలోని ప్రభుత్వాలకు ఏకంగా లక్షా పది వేల దేవాలయాల మీద, వాటి ఆదాయం మీద పూర్తి అజమాయిషీ చిక్కింది. తమిళనాడు ప్రభుత్వం సుమారు 47 వేల ఆలయాలు, 56 మఠాల మీద అజమాయిషీతో సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమిని హస్తగతం చేసుకోగలిగింది. ఈ లౌకిక భారతదేశంలో మిగిలిన మతాలకన్నిటికీ తమ ప్రార్థనా మందిరాల మీద, తమ విద్యాసంస్థల మీద పూర్తి స్థాయిలో అజమాయిషీ ఉండడం, హిందువులకు మాత్రం అటువంటి అవకాశం లేకపోవడం లౌకికవాదంగా చెలామణీ అవుతోంది. ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు మరే లౌకక దేశంలోనూ సాధ్యం కాదు. దాదాపు అయిదు వేల ఏళ్లుగా హిందువుల దేశంగా కొనసాగుతున్న దేశంలో హిందువులకే తీరని అన్యాయం జరుగుతుండడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఏ ప్రజాస్వామ్య దేశమూ దీన్ని ఎక్కువ కాలం సహించే అవకాశం లేదు.
అయోధ్యలో రాముడు జన్మనెత్త లేదని వాదిస్తూ పలువురు చరిత్రకారులు, పరిశోధకులు వాదనలు వినిపించి, చివరికి దారుణంగా పరాజయం పాలుకావడం జరిగింది. వారందరకీ కూడా ఈ అయోధ్య వేడుక ఒక పెద్ద దెబ్బేనని చెప్పాలి. చివరికి కె.కె. మహమ్మద్‌ అనే పురాతత్వ పరిశోధకుడు దీన్ని రామ జన్మ భూమి అనే తేల్చి, ఈ చరిత్రకారుల అసత్య పరిశోధనలకు తెరదించడం జరిగింది. అత్యధిక సంఖ్యాకులైన హిందువులను అన్ని విధాలుగానూ సర్వనాశనం చేయడమే లౌకికవాదంగా మారిపోతోంది. రామ జన్మభూమి ఉద్యమం సాగుతున్న రోజుల్లో వి.ఎస్‌. నయీ పాల్‌ అనే పరిశోధకుడు, సాహితీవేత్త దీన్ని సరికొత్త చారిత్రక పునరుజ్జీవంగా అభివర్ణించడం జరిగింది. హిందువులు తమ చరిత్ర విషయంలో జాగృతం అవుతున్నారని, దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న శక్తు ల్ని గుర్తిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
దాదాపు అయిదు వందల సంవత్సరాల తర్వాత రాముడు తన అజ్ఞాత వాసం నుంచి బయటికి వస్తున్న వేళ దీనినొక నాగరికత పునరుజ్జీవంగానే ప్రతి భారతీయుడూ భావించాల్సి ఉంటుంది. దీన్ని బీజేపీ, బీజేపీయేతర వివాదంగానో, పోటీగానో, రాజకీయ ప్రయోజనంగానో పరిగణించడం వల్ల వారి అజ్ఞానాన్నే బయటపెట్టుకున్నట్టవుతుంది. నెహ్రూ భావజాలం నుంచి దేశం బయట పడడం అనేది ఏనాడో ప్రారంభం అయిపోయింది. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

  • డాక్టర్‌. వి. సుదర్శనాచారి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News