Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Varun Gandhi: కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ?

Varun Gandhi: కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ?

వరుణ్ గాంధీ అడుగులు ఎటువైపు ?

ఫిరోజ్ వరుణ్ గాంధీ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో వరుణ్ గాంధీ పేరు లేదు. వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ లభించకపోవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. వరుణ్ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన పిల్‌భిత్ నియోజకవర్గం నుంచి ఈసారి యూపీ మంత్రి జితిన్ ప్రసాద్ పోటీ చేస్తారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరందుకుంది. కొంతకాలంగా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు వరుణ్ గాంధీ. బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైనా, అనేక సార్లు పార్టీ విధానాలపై ఆయన మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ పరిణామాలకు సంబంధించి కూడా చాలా సార్లు స్వంత పార్టీ విధానాలపై వరుణ్ గాంధీ నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వకపోతే సమాజ్‌వాదీ పార్టీ తరఫున వరుణ్‌ గాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సంజయ్ గాంధీ – మనేకాల బిడ్డ ఫిరోజ్ వరుణ్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి అగమ్యగోచరంగా మారింది. ఫిరోజ్ వరుణ్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌లోని పిల్‌భిత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పిల్‌భిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ గాంధీ మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి ఇప్పటికి 51 సీట్లకు తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం. మరో 21 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. వీటిలో వరుణ్‌ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న పిల్‌భిత్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే ఈసారి వరుణ్ గాంధీకి పిల్‌భిత్ టికెట్ లభించకపోవచ్చన్న వార్తలు లక్నో రాజకీయవర్గాల్లో గుప్పుమంటున్నాయి. వరుణ్ గాంధీ బదులు ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద్‌ వైపు కమలం పార్టీ హస్తిన పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వరుణ్ గాంధీ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

- Advertisement -

స్వంత పార్టీ పైనే వరుణ్ విమర్శలు
కొంతకాలంగా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు వరుణ్ గాంధీ. బీజేపీ తరఫున లోక్ సభకు ఎన్నికైనా, అనేక సార్లు పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ పరిణామాలకు సంబంధించి కూడా చాలా సార్లు స్వంత పార్టీ విధానాలకు భిన్నంగా ఆయన మాట్లాడారు. వరుణ్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. దీంతో వరుణ్‌ను బీజేపీ అధినాయకత్వం సైలెంట్ గా పక్కన పెట్టింది. పార్టీ వ్యవహారాల్లో ప్రాధాన్యం తగ్గించింది. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ బీజేపీకి గుడ్ బై కొట్టి త్వరలో కాంగ్రెస్ లో చేరతారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో కొంతకాలం నుంచి వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల పెదనాన్న కుమారుడు రాహుల్‌ గాంధీతో వరుణ్ గాంధీ సమావేశమయ్యారు. దీంతో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే గాంధీ కుటుంబ పార్టీగా పేరున్న కాంగ్రెస్ లోకి మరో గాంధీ రావడానికి సోనియా కుటుంబం అనుమతిస్తుందా అనే ప్రశ్న కూడా తెరమీదకు వచ్చింది.

2004 నుంచి బీజేపీతో వరుణ్‌కు అనుబంధం
కొంతకాలం కిందటి వరకు బీజేపీలో వరుణ్ గాంధీకి మంచి గౌరవమే దక్కింది. బీజేపీ టికెట్ పై ఆయన మూడోసారి పిల్‌భిత్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇటు పెద్దమ్మ సోనియా గాంధీ, వరసకు సోదరుడైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు సారథులుగా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీలోనే వరుణ్ గాంధీ కొనసాగారు. బీజేపీతో ఆయన అనుబంధం ఇప్పటిది కాదు. 2004లోనే వరుణ్‌ గాంధీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు నలభై సెగ్మెంట్లలో వరుణ్ ప్రచారం చేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో పిల్‌భిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ గాంధీ పోటీ చేశారు. వాస్తవానికి పిల్‌భిత్ సెగ్మెంట్ వరుణ్ తల్లి మనేకా గాంధీది. అయితే రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో పిల్‌భిత్ నుంచి వరుణ్ గెలిచారు. ఇక రాజకీయంగా వరుణ్ గాంధీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇందిర కుటుంబ వారసుడిగా వరుణ్ గాంధీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని బీజేపీ ఇవ్వడం మొదలెట్టింది. 2013లో బీజేపీలో పెద్ద పదవి ఆయనను వరించింది. జాతీయ స్థాయిలో పార్టీకి జనరల్ సెక్రెటరీగా వరుణ్‌ను నియమించింది బీజేపీ హై కమాండ్. ఆ తరువాత 2013 లో మమతా బెనర్జీ ఖిల్లా అయిన పశ్చిమ బెంగాల్‌కు వరుణ్‌ గాంధీ బీజేపీ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. అయితే ఇదంతా గతం కాబోతోంది.

లఖీంపూర్ ఘటనలో సొంత పార్టీనే టార్గెట్ చేసిన వరుణ్
ఉత్తరప్రదేశ్‌లో లఖీంపూర్ సంఘటన సందర్భంగా తన సొంత పార్టీ బీజేపీనే ఆయన టార్గెట్ చేశారు. ఎనిమిదిమంది అమాయక రైతులను బలిగొన్న లఖీంపూర్ సంఘటనపై వరుణ్ గాంధీ తీవ్రంగా స్పందించారు. రైతులపై వాహనాన్ని ఎక్కించిన అప్పటి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అభయ్ మిశ్రాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లఖీంపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అయితే… అదంతా ఒక ఎత్తు. ప్రతిపక్షాలు ఏమైనా చెబుతాయి, ఏమైనా డిమాండ్ చేస్తాయి అని అధికారంలో ఉన్న పార్టీ సరిపెట్టుకోవడం సహజం. అయితే అభయ్ మిశ్రా అరెస్టుకు ఇక్కడ పట్టుబట్టింది బయటి వ్యక్తి కాదు. సాక్షాత్తూ బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికైన నాయకుడు. దీంతో బీజేపీ పరిస్థితి ఇరుకున పడ్డట్లయ్యింది. అభయ్ మిశ్రా విషయంలో బీజేపీ సర్కార్ వెనకాముందు ఆడటానికి కూడా రాజకీయ కారణాలు లేకపోలేదు. అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో అక్కడి బ్రాహ్మణులకు పొసగడం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంతో బ్రాహ్మణ సమాజాన్ని సముదాయించడానికి ఆ వర్గానికి చెందిన కొంతమంది నాయకులకు మంత్రి పదవులు కూడా ఇచ్చింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. ఛోటామోటా లీడర్లకు కూడా చిన్నా చితకా పదవులిచ్చి తమ వైపునకు తిప్పుకోవడానికి యోగి ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ పరిస్థితుల్లో అభయ్ మిశ్రాను అరెస్టు చేస్తే బ్రాహ్మణ పెద్దలు ఆగ్రహిస్తారేమోనన్న భయం యోగి ఆదిత్యనాథ్‌కు ఉండేది. దీంతో అభయ్ మిశ్రాను అరెస్టు చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అప్పట్నుంచీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడైన వరుణ్ గాంధీని బీజేపీ హై కమాండ్ పక్కన పెట్టడం మొదలైంది. ఒక్కమాటలో కమలం పార్టీలో వరుణ్ గాంధీ డౌన్‌ఫాల్ మొదలైంది.

బీజేపీకి తలనొప్పిగా వరుణ్ ట్వీట్లు
స్వంతపార్టీ పైనే ఎడాపెడా విమర్శలు చేస్తున్న వరుణ్‌పై బీజేపీ హై కమాండ్ కన్నెర్ర చేసింది. ఆ తరువాత కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గంలో ఫిరోజ్ వరుణ్ గాంధీ పేరు మాయమైంది. దీంతో హై కమాండ్ అంతరంగం మనేకా తనయుడికి అర్థం అయింది. అయినప్పటికీ వరుణ్ వెనక్కి తగ్గలేదు. లఖీంపూర్ ఘటనలో రైతులకు న్యాయం చేయడమే తన అజెండా అన్నాడు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడం మొదలెట్టాడు. విమర్శలు చేస్తోంది సాక్షాత్తూ బీజేపీ ఎంపీ కావడంతో మీడియా వీటికి ప్రయారిటీ ఇచ్చింది. చివరకు ఇదంతా బీజేపీ హై కమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు రైతులకు మేలు చేయడమే తమ పార్టీ విధానమని గొప్పలు చెప్పుకునే కమలం పార్టీ ఆచరణ విషయం వచ్చేసరికి అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. కథ అంతటితో ఆగలేదు. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ అనేక అంశాల్లో రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. వరుణ్ చేసిన ఈ ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్‌టాపిక్‌గా మారింది.

పగలు ఎన్నికల ర్యాలీలు..రాత్రి కర్ఫ్యూ
ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించింది యోగి ఆదిత్యనాధ్ నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. అయితే పగలు మాత్రంపెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తోంది. దీనినే సూటిగా ప్రశ్నించారు వరుణ్ గాంధీ. దీనిని రెండు నాల్కల ధోరణి అనకుండా ఇంకేం అంటారంటూ బీజేపీ సర్కార్‌ను ఎద్దేవా చేశారు. యోగి సర్కార్‌ పనితీరుపై ట్వీట్ చేసి హల్‌చల్‌ చేశారు. దీంతో వరుణ్‌కు సమాధానం చెప్పుకోలేక యూపీ ప్రభుత్వం ఇరుకునపడింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే కాదు సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరుణ్ గాంధీ ట్వీట్ డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా తగిలినట్లయింది. అంతేకాదు కమలం పార్టీపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఓ ఆయుధం ఇచ్చినట్లయింది.

అగ్నిపథ్ పై ప్రధాని నరేంద్ర మోడీకి వరుణ్ ప్రశ్నలు
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రారంభించిన అగ్నిపథ్ పథకంపై కూడా వరుణ్ గాంధీ నిప్పులు చెరిగారు. అగ్నిప‌థ్ ప‌థ‌కంపై దేశ యువ‌త‌లో అనేక అనుమానాలు ఉన్నాయ‌న్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీపై ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వరుణ్ గాంధీ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏదేమైనా నరేంద్ర మోడీ, అమిత్ షా కు ఇష్టం లేని వాళ్లు బీజేపీలో కొనసాగడం అంత ఈజీ కాదు. అందులోనూ జాతీయస్థాయిలో అంతో ఇంతో పేరున్న ఫిరోజ్ వరుణ్ గాంధీకి మరీనూ. తాజాగా యూపీకి సంబంధించిన తొలి జాబితాలో వరుణ్‌ గాంధీ పేరు కనిపించలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే వరుణ్ గాంధీ త్వరలోనే బీజేపీ నుంచి బయటకు వస్తారన్న ప్రచారం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. నిజంగా వరుణ్ బీజేపీకి గుడ్ బై కొడతారా ? గుడ్ బై కొడితే వరుణ్ ముందున్న ఆప్షన్స్ ఏమిటి ? మనేకా తనయుడు ఏ పార్టీలో చేరతారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

                          ఎస్. అబ్దుల్ ఖాలిక్,  సీనియర్ జర్నలిస్ట్ 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News