Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Women and Work: మహిళలంటే ఇంత చులకనా?

Women and Work: మహిళలంటే ఇంత చులకనా?

మహిళలకు ఉద్యోగాలిచ్చేవారే కరువు

భారతదేశంలో మహిళలకు ఉద్యోగావకాశాలకు సంబంధించిన తాజా వివరాలను పరిశీలించే పక్షంలో మహిళల పట్ల వివక్ష ఏ స్థాయిలో ఉన్నదీ అర్థమవుతుంది. దేశంలోని అనేక ప్రసిద్ధ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వదిలి పెట్టి ఆఫీసుల్లోనే పనిచేయాలని నిర్ణయించడంతో ఈ వివక్ష వెలుగు చూసింది. కోవిడ్‌ తర్వాత దేశంలోని పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న సంఖ్య 54 శాతం నుంచి 52.8 శాతానికి పడిపోయినట్టు అర్థమైంది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం, గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. కోవిడ్‌ తర్వాత ఉద్యోగాలు తగ్గడంతో పాటు, స్వయం ఉపాధికి మారిన మహిళల సంఖ్య కొద్దిగా పెరిగింది. ఇది వరకు 39.2 శాతం ఉన్న స్వయం ఉపాధి 42.3 శాతానికి పెరిగినట్టు లేబర్‌ ఫోర్స్‌ సర్వే తెలియజేసింది. స్వయం ఉపాధి మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం మహిళలకు స్థిరమైన జీతభత్యాలతో ఉద్యోగాలు ఇవ్వడంలో బాగా తగ్గిందని అర్థమవుతోంది. అంతేకాక, సంస్థల్లో ఉద్యోగాలు చేయడం కంటే, ఇంటి పనుల్లో నిమగ్నం కావడానికి, అవ్యవస్థీకృత రంగాలలో పని చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.
అహ్మదాబాద్‌ లోని ఐ.ఐ.ఎం గత ఫిబ్రవరిలో ఒక అధ్యయనాన్ని నిర్వహించినప్పుడు, ఈ అవ్యవస్థీకృత రంగంలో మహిళలకు 7.2 గంటలకు మించిన పనివేళలు ఉంటుండగా, పురుషులకు 2.5 గంటలకు మించి ఉండడం లేదు. ఇంటి పనుల్లో నిమగ్నమైన మహిళలకు కూడా జీత భత్యాలు చెల్లించడం ప్రారంభించే పక్షంలో ఆ ఆదాయం జి.డి.పిలో 7.5 శాతానికి పైగానే ఉంటుందని ఎస్‌.బి.ఐ గత మార్చిలో విడుదల చేసిన ఒక సర్వే నివేదికలో వెల్లడించింది. 2018 జూన్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మహిళలు స్వయం ఉపాధి రంగంలోకి దిగడమనేది 14 శాతం నుంచి ఏకంగా 65 శాతానికి పెరిగినట్టు అజీం ప్రేమ్‌ జీ విశ్వవిద్యాలయం తెలియజేసింది. ఆ సమయంలో దేశంలో జరిగిన అనేక సర్వేలు ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. అంతకు ముందు కూడా దేశంలో మహిళలకు ఉద్యోగావకాశాలు 30 శాతం నుంచి 33 శాతం మాత్రమే పెరిగాయి. భారతదేశంలో కంటే మహిళా ఉద్యోగుల పరిస్థితి నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల పరిస్థితి మరింత ఉత్తమంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక జీతాలు, వేతనాల మధ్య తేడా తగ్గుతూ వస్తున్నప్పటికీ, అది చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 2022 సంవత్సరం నాటి పరిస్థితులను బట్టి చూస్తే పురుషులు సంపాదించే ఆదాయంలో మహిళల ఆదాయం 76 శాతం మాత్రమే ఉంటోంది.
కార్పొరేట్‌ రంగంలోని ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య కూడా దాదాపు తీసికట్టుగా ఉంటోంది. ఇక్కడ అధికార స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య 24.7 శాతం మించి పెరగడం లేదు. డైరెక్టర్లు, సీనియర్‌ అధికారులు, అధిపతుల్లో మహిళల భాగస్వామి అతి తక్కువగా ఉంటోందన్నది వాస్తవం. ఇప్పుడు ఆ సంఖ్య కూడా 19 శాతానికి తగ్గిపోయింది. ఉద్యోగాల్లో మహిళల సంఖ్య తగ్గిపోతుండడానికి కారణం పురుషాధిక్యం, భద్రతకు సంబంధించిన భయాలు. అంతేకాక, ఇంటి పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుండడం వల్ల కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు. ప్రైవేట్‌, ప్రభుత్వ రంగంలోని కంపెనీలు ఒక్క మహిళను ఉద్యోగంలోకి తీసుకున్నా ఘనంగా ప్రచారం చేసుకోవడం తప్ప, నిజానికి మహిళలను ప్రోత్సహించడానికి చేస్తున్నదేమీ కనిపించడం లేదు. విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి వీలైనన్ని అవకాశాలు కల్పించడంతో పాటు, వారికి భద్రత కూడా కల్పించి అవొక నియామకాల మేళాను నిర్వహించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News