Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Women prisoners: మహిళా ఖైదీల పాట్లు వర్ణనాతీతం

Women prisoners: మహిళా ఖైదీల పాట్లు వర్ణనాతీతం

జైళ్ల సిబ్బందిలో జవాబుదారీతనం పెరగాలి

దేశంలోని జైళ్లలో మహిళా ఖైదీలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. అక్కడ కూడా పురుషాధిక్యాలు, అత్యాచారాలు తప్పడం లేదు. దేశంలోని అనేక జైళ్లలో మహిళా ఖైదీల స్థితిగతులు వర్ణనాతీతంగా ఉంటున్నాయని, వారు బానిసల కంటే దుర్భర జీవితం గడుపు తున్నారని, వారి పట్ల జరుగుతున్న నేరాలకు లెక్కలేకుండా పోతోందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో తన తాజా నివేదికలో తెలియజేసింది. ఈ మధ్య దేశంలోని అనేక జైళ్లను సందర్శించిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు కూడా పురుషాధిక్యానికి సంబంధించిన అవలక్షణాలన్నీ అక్కడ వంద రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌ జైళ్లలో 196 మంది మహిళా ఖైదీలు గర్భవతులుగా ఉన్నారంటే దేశంలోని జైళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కఠినాతి కఠిన శిక్షలు విధించడానికి అవకాశాలున్నప్పటికీ, మహిళల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై జైళ్ల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నప్పటికీ, మహిళా ఖైదీలపై లైంగిక దాడులు అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతున్నాయి.
క్రైమ్‌ రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం, జైళ్లలో ఏటా దాదాపు రెండు వందలకు పైగా అత్యాచార సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత అయిదేళ్ల కాలంలో దాదాపు రెండు వేల లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. ఇక వందలాది మంది మహిళా ఖైదీలు కస్టడీల్లోనే గర్భవతు లవుతున్నారు. ఇక వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం, వారికి సరైన పౌష్టికాహారం అందించక పోవడం, వారు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకోకపోవడం వంటివి కూడా వందల సంఖ్యలో సంభవిస్తున్నాయి. ఈ క్రైమ్‌ రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం, మహిళా ఖైదీల పట్ల అన్యాయాలు, అక్రమాలు ఈ మధ్య కాలంలో బాగా తగ్గుతోంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ జాడ్యం వర్ణనాతీతంగా తయారవుతోందని అది తెలియజేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మహిళా ఖైదీల పరిస్థితి దుర్భరంగా తయారవుతోంది. ఈ రాష్ట్రాల్లోని జైళ్లలో మహిళా ఖైదీలకు హక్కులు పూర్తిగా మృగ్యమైపోయాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
మహిళా ఖైదీల పట్ల అన్యాయాలను, అక్రమంగా పాల్పడుతున్నది ఎక్కువగా పోలీసులు, జైళ్ల సిబ్బంది, రాజకీయ నాయకులు, పునరావాస కేంద్రాల్లోని సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది తదితరులు. నిజానికి మహిళా ఖైదీలకు జైళ్లలో భద్రత ఉంటుందని ఆశిస్తారు. అయితే, వారు భూలోక నరకంలో, నరరూప రాక్షసుల మధ్య జీవిస్తున్నారని క్రైమ్‌ రికార్డుల బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వారిని బయట కంటే అనేక రెట్లు ఎక్కువగా శారీరకంగా, మానసికంగా వేధించడం జరుగుతోంది. పోలీసులు లేదా జైళ్ల అధికారుల నిర్బంధంలో ఉండగా మహిళా ఖైదీలపై జరిగే అత్యాచారాలకు కఠినమైన శిక్షలు విధించడానికి అవకాశం ఉంది కానీ, చట్టాలు వీటిని అడ్డుకోలేకపోతున్నాయి. కస్టడీ, జైళ్ల తీరుతెన్నులు ఇందుకు బాగా అవకాశాలు కల్పిస్తున్నాయి. మహిళా ఖైదీలను మధ్య మధ్య విడుదల చేయడానికి, వారికి స్వేచ్ఛ కల్పించడానికి అవకాశం ఉన్నప్పటికీ జైళ్ల సిబ్బంది వాళ్లు చేసిన నేరాలను సాకుగా తీసుకుని వారిని అనేక విధాలుగా వేధించడమే జరుగుతోంది.
మహిళా ఖైదీలకు ఎటువంటి రక్షణా లభించడం లేదు. మహిళా అధికారులున్నప్పటికీ, సిబ్బంది నుంచి మహిళా ఖైదీలకు భద్రత లభించడం లేదు. ప్రధానంగా పురుషాధిక్య ధోరణులు, సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం, లైంగిక సమానత్వాన్ని ఏమాత్రం లెక్కచేయకపోవడం, వారికి సరైన శిక్షణ లేకపోవడం, ఖైదీలకు మరో మార్గం లేకపోవడం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇటువంటి అక్రమాలు, అన్యాయాలను నిరోధించడానికి జైళ్ల సంస్కరణలు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు, జైళ్ల సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచాల్సి ఉంది. వారికి లైంగిక సమానత్వం పట్ల సరైన శిక్షణ నివ్వాల్సి ఉంది. సామాజిక సేవా సంస్థలు, న్యాయ నిపుణులు, మేధావి వర్గాలు నడుం బిగించి ఇటువంటి అన్యాయాలకు విరుద్దంగా గళం ఎత్తడంతో పాటు, వీటి పరిష్కారానికి మార్గాలను సూచించాల్సి ఉంది. క్రైమ్‌ రికార్డుల బ్యూరో వెల్లడించిన విషయాలు ఇప్పటికైనా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఒక మేలుకొలుపు కావాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News