పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖలిలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్ర గత చరిత్రను గుర్తు చేస్తున్నాయి. 2007-08 ప్రాంతంలో సింగూరు, నందిగ్రామ్ లో భూ సేకరణకు వ్యతిరేకంగా అప్పటి మార్క్సిస్టు పార్టీ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సాగించిన పోరాటాలు మరచిపోలేనివి. ఈ పోరాటాలు, ఉద్యమాలకు అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ నాయకత్వం వహించారు. ఆ ఉద్యమం కారణంగానే మమతా బెనర్జీ పలుకుబడి పెరిగి, ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో 34 ఏళ్ల సుదీర్ఘ పాలనా చరిత్ర కలిగిన మార్క్సిస్టు పార్టీ ప్రభుత్వం ఘోర పరాజయం పాలయింది. తాను రాష్ట్రంలో ప్రజల జీవితాల్లోనే కాక రాజకీయ సంస్కృతిలో కూడా పరివర్తన తీసుకువస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఆమె అధికారంలోకి రావడం జరిగింది.
సందేశ్ ఖలిలో జరిగిన సంఘటనలను, వాటి విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ స్పందనను గమనిస్తే, రాష్ట్రంలో ఆమె చెప్పిన పరివర్తనేదీ కనిపించడం లేదని తేలికగా అర్థమవుతుంది. పాత్రలు, పాత్రధారులు మారాయేమో కానీ, ఇతివృత్తం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్, ఆయన సహచరుల ఆగడాలకు వ్యతిరేకంగా వేలాది మంది మహిళలు వీధుల్లోకెక్కారు. ఆయన మీద పోలీస్ స్టేషన్లలోనూ, న్యాయ స్థానాల్లోనూ ఇప్పటికే లైంగిక దాడులు, బలవంతపు వసూళ్లు, ఆస్తి వివాదాల అనధికార పరిష్కారం, జీతాల్లేకుండా పనిచేయించడం, అపహరణలు, భూకబ్జాలు వంటి ఆరోపణలపై విచారణలు జరుగుతున్నాయి. అనేక రోజులుగా మహిళలు పోరాటాలు సాగిస్తున్నప్పటికీ మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు. షాజహాన్ షేక్, ఆయన సహచరులు పరారీలో ఉన్నారు.
నిజానికి, ఆయన పరారీ అయి చాలా కాలం అయింది. జనవరిలో రేషన్ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) అధికారులు ఆయన ఇంటి మీద దాడి చేసినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. అప్పట్లో ఆయన సహచరులు, అనుయాయులు ఇ.డి అధికారుల మీద దాడి చేయడం కూడా జరిగింది. ఆయన సహచరుల్లో కొంత మందిని పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయిన తర్వాతే మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ మాత్రం చర్యనైనా తీసుకుంది. కొందరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అఘాయిత్యాలు, అన్యాయాలు, అక్రమాల పైన ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు మాత్రం ఒకపట్టాన చర్యలు తీసుకోవడం లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే ఈ నాయకులను సమర్థించడం, వారిని అన్ని విధాలుగానూ కాపాడడం కూడా జరుగుతోంది. చివరకు సందేశ్ ఖలికి చెందిన మహిళలు గత శనివారం పాలక పక్ష నాయకులపై సామూహిక అత్యాచారాలకు సంబంధించిన ఫిర్యాదులు చేయడంతో
వారిపై కేసులు నమోదయ్యాయి.
సహజంగానే మమతా బెనర్జీ, ఆమె మంత్రి వర్గ సహచరులు బీజేపీ వంటి ప్రతిపక్షాల మీద ఎదురు దాడి ప్రారంభించారు. బీజేపీ, మార్క్సిస్టు పార్టీలు తమను అప్రతిష్ఠపాలు చేసే ఉద్దేశంతో పని గట్టుకుని రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తున్నారని, ఈ పార్టీలే తమ ప్రభుత్వం మీదకు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. తమ పార్టీ నాయకులెవరూ ఈ సామూహిక అత్యాచారాలు, బలవంతపు వసూళ్లు, భూ కబ్జాలకు పాల్పడడం లేదని, ప్రతిపక్షాలే ఇటువంటి అన్యాయాలకు ఒడిగడుతూ తమ మీద నింద వేస్తున్నాయని ఆమె ఎదురు దాడి ప్రారంభించారు. పైగా సందేశ్ ఖలి అత్యాచార సంఘటనలన్నీ టీ కప్పులో తుపాను లాంటివని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అయితే, ఆమె వీటిని అంత తేలికగా తీసిపారేయడంలో అర్థం లేదు. ప్రభుత్వం ఏ విషయంలోనైనా విఫలం అయినప్పుడు ప్రతిపక్షాలు దాన్ని వాడుకోవడం సహజమే. ఒక ప్పుడు ఆమె కూడా ఇదే పని చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడం, నేరస్థులపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. బీజేపీకి రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలనే కోరిక ఉంటే ఉండవచ్చు. కానీ, సామూహిక అత్యాచారాలు జరిగిన మాట మాత్రం వాస్తవం. దాన్ని ఏ పార్టీ అయినా రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది జరగకపోవచ్చు.
రాష్ట్ర గవర్నర్ సి.వి. ఆనంద్ బోస్, జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తూర్పారబట్టడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య మరీ పేట్రేగిపోయిందన్నది వాస్తవం. లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటున్నాయంటే అందుకు మమతా బెనర్జీ ప్రభుత్వాన్నే తప్పుపట్టాల్సి ఉంటుంది. సందేశ్ ఖలి మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యతను మమత విస్మరించడం భావ్యం కాదు. ప్రతిపక్షాల దుష్ప్రచారం అని చెప్పి తప్పించుకోవడం ఇక్కడ కుదరకపోవచ్చు.