ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందడం చాలా గొప్ప విషయం. మొదటిసారిగా పార్లమెంట్లో మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఇంత కాలానికి ఆమోదించడం నిజంగా దేశ చరిత్రలో గొప్ప పరిణామం. రాజకీయంగా ఉన్న ఒక ప్రధాన అడ్డు గోడను ఇది తునాతునకలు చేసింది. పార్లమెంటులో 15 శాతం మంది మహిళలు కూడా లేకపోవడం నిజంగా ఆందోళన కలిగించే అంశం. లోక్ సభలోనూ, శాసనసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 128వ రాజ్యాంగ సవరణను చేపట్టి, నారీ శక్తి వందన్ అధినియంను తీసుకురావడం జరిగింది. ఈ రిజర్వేషన్లకు 15 ఏళ్ల కాల పరిమితిని విధించినప్పటికీ, దీన్ని ఆ తర్వాత పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక వర్గాలు, అనేక పోరాటాలు జరపాల్సి వచ్చింది. సుమారు 15 ఏళ్ల క్రితం అంటే 2010లో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదిం చినప్పటికీ, దురదృష్టవశాత్తూ ఇది అమలుకు నోచుకోలేదు.
అయితే, ఈ బిల్లు అమలులోకి రావడానికి కొంత కాలం పడుతుంది. ఇది అమలు కావాలన్న పక్షంలో ముందు నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కల సేకరణ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు దీన్ని కొత్త పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లుగా ప్రవేశపెట్టడం, దీన్ని లోక్ సభ ఆమోదించడం హర్షణీయమైన విషయం. అయితే, ఇక్కడొక సమస్య కూడా ఉంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును నియోజకవర్గాల పునర్విభజనకు జోడించడం జరిగింది. నిజానికి, లోక్ సభ స్థానాలకు, శాసనసభ స్థానాలకు, మహిళా రిజర్వేషన్లకు ఎటువంటి సంబంధమూ లేదు. ఏది ఏమైనా ఇవి పూర్తి కావడానికి మరి కొంతకాలం పడుతుంది. మొత్తం మీద 2024 ఎన్నికల్లో ఈ బిల్లు అమలు కావడానికి అవకాశం లేనట్టు కనిపిస్తోంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఇస్తున్న రిజర్వేషన్లలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీల) రిజర్వేషన్లలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే, వీటన్నిటి కారణంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో కాలయాపన చేయడం మంచిది కాదు.
ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఇది లాంఛనంగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది. మహిళల ప్రాతినిధ్యం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిజానికి స్థానిక సంస్థల్లోనూ, పంచాయతీరాజ్ సంస్థల్లోనూ మహిళలకు ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఆ స్థాయిలో మహిళా ప్రాతినిధ్యానికి ఇబ్బందేమీ లేదు. ఈ 50 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అనేక రాష్ట్రాలలో అమలు జరుగుతోంది. అట్టడుగు స్థాయిలో ఈ మహిళా రిజర్వేషన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయన్నది పరిశీలించి, ఆ అనుభవాల నుంచి తగిన పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఈ స్థాయిల్లో మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి, ఇంటా బయటా కూడా పురుషాధిక్యత నుంచి బయటపడి ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడుతున్నదీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇతర రంగాల్లో కూడా మహిళలు అనేక పోరాటాలు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య వంటి రంగాలు పూర్తి స్థాయిలో మహిళకు అందుబాటులో లేవు. అంతేకాదు, అనేక ప్రాంతాల్లో వారికి భద్రత తక్కువగా కూడా ఉంది. ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య కూడా రాను రానూ తగ్గుతోంది. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య 24 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రభుత్వం రాజకీయ చిత్తశుద్ధితో వ్యవహరించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాల్సి ఉంది. దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న పక్షంలో కీలక రంగాల్లో సైతం మహిళలకు స్వేచ్ఛ నివ్వాల్సిన అవసరం ఉంది.
Women reservation: రిజర్వేషన్ల పరంగా మహిళలకు పెద్ద పీట
బిల్లు అమలులో కాలయాపన చేయడం మంచిది కాదు