ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బు చాలా ముఖ్యం అనడంలో సందేహం లేదు. అందుకే ప్రజలు వివిధ వృత్తుల ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. కష్టపడి పనిచేసి, తాను ఎంచుకున్న వృత్తి ద్వారా నిజాయితీగా డబ్బు సంపాదించి అభివృద్ధి చెందిన వ్యక్తిని సమాజం ఎంతగానో గౌరవిస్తుంది. తాను ఎంచుకున్న వృత్తిని, తన కృషిని నమ్ముకోకుండా అవినీతి మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదు.
అవినీతి సంపాదన అంటే మనం నిర్మించుకున్న చట్టాలకు విరుద్ధంగా మోసం చేసి, రౌడీయిజం చేసి, నేరాలు చేసి , అధికారంతో ప్రభుత్వ ఉత్తర్వులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుని సంపాదించిన డబ్బు. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుని కూడా సొంత ఖాతాలలోకి మళ్లించుకోవడం అక్రమ సంపాదనకు పరాకాష్ట. సమాజంలో విద్య, వైద్యం, రాజకీయాలతో సహా అనేక వృత్తులు ఉన్నాయి.అయితే, విద్య, వైద్యం, రాజకీయాలలో చేసిన కృషిని ఒక వృత్తిగా కాకుండా ఒక సేవగా గుర్తిస్తారు. అంటే విద్య, వైద్య, రాజకీయ రంగాలు సేవా రంగాలుగా గుర్తింపు పొందాయి. కానీ ఈ మూడు రంగాలు నేటి సమాజంలో అవినీతికి మూలాలుగా మారుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది దురదృష్టకరమైన విషయం.
విద్య, వైద్య మరియు రాజకీయాలు సమాజానికి, రాష్ట్రానికి మరియు దేశానికి వెన్నుముక లాంటివి. ఒక దేశం జ్ఞానదేశంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ విద్యా విధానంలో సృజనాత్మకతను, వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక దృక్పథాన్ని పెంపొందించగల బోధనా పద్ధతులు ఉండాలి. ఒక దేశం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ దేశ వైద్యరంగం నిస్వార్ధమైన సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఒక దేశ శాంతి భద్రతలు, ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలంటే ఆ దేశ రాజకీయ వ్యవస్థ దృఢమైన, న్యాయమైన పాలనా వ్యవస్థలను కలిగి ఉండాలి. ఈ మూడు రంగాలు పట్టిష్టంగా ఉంటే ఆ దేశం సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తుంది.
అయితే, విద్యా వ్యవస్థ పూర్తిగా (కొద్ది శాతం మినహాయిస్తే) వ్యాపార రంగంగా మారడం, విద్యార్థులను అభ్యాసకులుగా కాకుండా వినియోగదారులుగా భావించడం, కళాశాల సీటును విజ్ఞానాన్ని పొందే ప్రవేశంగా కాకుండా విక్రయించే వస్తువుగా పరిగణించడం, కేవలం పరీక్షలో మార్కులను సంపాదించడమే లక్ష్యంగా బోధనా పద్ధతులు ఉండడం, మొదలగు కారణాల వలన అధిక శాతం విద్యార్థులలో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం, సామాజిక దృక్పథం లోపిస్తున్నాయి. ఈ లోపాల కారణంగా, మంచి గ్రేడులతో డిగ్రీలు పొందుతున్న విద్యార్థులు కూడా నైపుణ్య లోపాల వలన జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడలేకపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నాణ్యమైన విద్యను అందించకుండా అత్యధిక ఫీజులను వసూలు చేయడం ఒక విధంగా అక్రమార్జనే.
వైద్య రంగాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది ప్రస్తుతం అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారింది.పేదల నుండి ధనవంతులు వరకు లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. ఒక వైద్యానికి ఎంత ఖర్చవుతుందో అంతవరకే బిల్లు వేసే సంప్రదాయం ఏనాడో పోయింది. అవసరం ఉన్నా లేకపోయినా పరీక్షలు చేసి లక్షల రూపాయలు ప్రజల నుండి దోచుకుంటున్నారు. సినిమా మాధ్యమాలలో ఒక చనిపోయిన శవానికి ఆపరేషన్ చేసి డబ్బులు వసూలు చేసిన సన్నివేశాలు మాదిరిగానే నిజజీవితంలో కూడా కొన్ని సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఒక వ్యాధికి తగిన వైద్యం చేసి దానికైన ఖర్చు తీసుకోవడం ధర్మమే. కానీ, అవసరం లేదని తెలిసినా కూడా పరీక్షలు చేసి డబ్బులు తీసుకోవడం అవినీతే. వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడు మనకు జన్మనిచ్చిన ఆ భగవంతునితో సమానం. వైద్యువృత్తి సేవా భావంతో పనిచేయవలసిన వృత్తి. సేవా భావంతో వైద్య సేవలను అందించే గొప్ప వైద్యులు కూడా సమాజంలో కొంతమంది ఉన్నారు. వారి పట్ల సమాజం ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటుంది.
అత్యంత ప్రభావవంతమైన రంగం రాజకీయం. ఈ రంగం గురించి చెప్పాలంటే… ఎన్నికల ముందు ఓట్లకు నోట్లు ఖర్చు పెట్టి అధికారాన్ని సాధించడం, ఆ తర్వాత ఖర్చుపెట్టిన సొమ్మును అవినీతి రూపంలో సంపాదించడం. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఒక అనైతికమైన సంప్రదాయం. ఈ సంప్రదాయం నశించాలంటే నాయకులు, ప్రజలు ఇద్దరులోనూ మార్పు రావలసిన అవసరం ఉంది. ఈ రాజకీయ రంగం చుట్టూ డ్రగ్స్ మాఫియా, అనైతిక సంబంధాలు, అవినీతి,వివిధ రకాల కుంభకోణాలు ఒక వలయంలాగా ఏర్పడి వాటి దుష్ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. అధికార రాజకీయ పార్టీల ప్రభావం వల్ల ప్రభుత్వ అనుబంధ శాఖలన్నిటిలోనూ అవినీతి పేరుకుపోతుంది. ఆయా శాఖల్లోని ప్రభుత్వ అధికారులు అవినీతి ఆరోపణలతో శతమతమవుతున్నారు. ఎంతోమంది పేరుగాంచిన రాజకీయ నాయకులు వివిధ రకాల కుంభకోణాలలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ వారి కీర్తి ప్రతిష్టలను కోల్పోతున్నారు. అయితే, అన్ని రంగాల మాదిరిగానే నిజాయితీగా ప్రజా పరిపాలన చేసే కొద్దిమంది ప్రజా నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇంకా ఉన్నారు.
విద్య, వైద్య, రాజకీయ మరియు ప్రభుత్వ వ్యవస్థలను పరిపాలించే వ్యక్తుల్లో చాలామంది విద్యావంతులు, ఆర్థికంగా బలమైన వాళ్ళే. అయినా, డబ్బు మీద ఉన్న వ్యామోహంతో కోట్ల రూపాయల సంపద ఉన్నా వివిధ రకాల కుంభకోణాలలో దోషులుగా నిలబడి, ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని, అభిమానాన్ని కోల్పోతున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా అక్రమ సంపాదన కోసం కీర్తి ప్రతిష్టలను, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకూ, అత్యంత ప్రభావంతమైన వ్యవస్థలను నడిపే పాలకులకూ ఎంత మాత్రం సమంజసం కాదు.డబ్బులు లేని పేదవాడు డబ్బుకు ఆశపడ్డా అర్థం ఉంది. కానీ, భవిష్యత్తు తరాలు కూడా కూర్చుని తిన్నా తరగని ఆస్తులు, ప్రజలలో కీర్తి ప్రతిష్టలు ఉన్న నాయకులు కూడా అవినీతి ఆరోపణలతో వ్యక్తిత్వాన్ని కోల్పోయి, దేశంలోనే పేరుగాంచిన జైల్లో జీవనం సాగిస్తున్నారు.
ముగింపు మాటగా, వేలకోట్ల సంపద ఉన్న నాయకుడి కంటే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడే ప్రజల హృదయాల్లో మరణించినా కూడా జీవించే ఉంటాడు. అవినీతి సంపద ఎంత విలువైనదైనా… దాని వలన మనిషి కోల్పోయే వ్యక్తిత్వమే కొన్ని రెట్లు విలువైనది. భవిష్యత్తులోనైనా, ప్రజాక్షేత్రంలో ప్రజలను ముందుండి నడిపే నాయకులు, సేవలను అందించే వైద్యులు, ప్రభుత్వ అధికారులు మరియు విద్యావేత్తలు అక్రమ సంపాదన కోసం ప్రయత్నించకుండా వ్యక్తిత్వాన్ని నిలుపుకొని, ప్రజలందరికీ ఆదర్శంగా ఉండి, సమాజాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిద్దాం.
ననుబోలు రాజశేఖర్,
9885739808, 8330969808